26, అక్టోబర్ 2020, సోమవారం

పండగొస్తుందంటే

 *పండగొస్తుందంటే ఆ మజానే వేరు* -  డా.ఎం.హరి కిషన్ - కర్నూలు-94410 32212

******************************** 

పెద్దగవుతున్న కొద్దీ, అమాయకత్వం తొలుగుతున్న కొద్దీ, నమ్మకాలు సడలుతున్న కొద్దీ జీవితం క్రమంగా తడి ఆరిపోతావుంది గానీ ఒకప్పుడు పండగొస్తావుందంటే ఎంత సంబరం. ఎంత ఆనందం.


దసరా అంటే ముందుగా గుర్తుకొచ్చేది మా కర్నూల్లో తొమ్మిది రోజులూ సాగే హరికథలే. రాత్రి అన్నం తింటూనే నేనూ మా అన్నా వురుక్కుంటా కొత్తపేటలోని ఆంజనేయసామి గుడికి చేరుకోని, దేమునికి మొక్కుకోని, ప్రసాదం చప్పరిస్తా స్టేజి ముందు కూచునేటోళ్ళం. రాత్రి పదీ పదిన్నరకంతా రోడ్డంతా వుప్పొంగిన తుంగభద్రలా కలకలలాడి పోయేది. హరికథలు చెప్పడానికి వచ్చినాయన భారతంలోనిదో, రామాయణంలోనిదో కథను మొదలు పెట్టి, మధ్య మధ్యలో పిట్ట కథలు చెబుతా, పాటలు పాడతా, డాన్సు చేస్తా, కండ్ల ముందు పంచ రంగుల సినిమా ప్రత్యక్షం చేపించేటోడు. మధ్య మధ్యలో ఆయనకు ఎవరన్నా నిద్రమత్తులో జోగుతా వున్నారేమోనని అనుమానమొస్తే చాలు, ''శ్రీ మద్రమారమణ గోవిందా'' అని గట్టిగా ఒక్కరుపు అరిచేటోడు. వెంటనే కూర్చున్నోళ్ళంతా తిరిగి అంతే గట్టిగా ''గోవిందా'' అని అరిచేటోళ్ళు. అట్లా ''గోవిందా'' అంటే గోవును దానమివ్వకపోయినా ఇచ్చినంత పుణ్యమంట. ఫ్రీగా పుణ్యమొస్తా వుంటే కాదనడమెందుకని నేనూ మా అన్నా గూడా అందర్తోబాటు 'గోవిందా' అని ఒక్కరుపు అరిచేటోళ్ళం. అట్లా నాలుగైదు సార్లు అరిపిచ్చేసరికి జోగుతున్న వాండ్ల నిద్ర మత్తొదిలి అందరూ దారిన పడేటోళ్ళు.


పెద్ద లైబ్రరీ కాడవున్న చెన్నకేశవసామి గుళ్ళోనయితే డాన్సులు, పాటలు, ఏకపాత్రాభినయాలు, నాటికలు ఇట్లా ఒక్కొక్కరోజు ఒకొక్కదాంట్లో పోటీలు పెట్టేటోళ్ళు. నేనొకసారి ఫ్రెండు పిలిస్తే పాటల పోటీ జరిగేటప్పుడు చూడ్డానికని పోయినా పాటల పోటీకి ఒకడొచ్చినాడు. ప్రతి సంవచ్చరమూ ఒస్తాడంట. బాగా తాగి తూల్తా స్టేజి ఎక్కినాడు. వాన్ని చూస్తానే జనాల్లోంచి విజిల్సు విజిల్సుగాదు. వాడు చిరునవ్వులు నవ్వుతా గొంతు సవరించుకోని శంకరాభరణంలో ''శంకరా... నాద శరీరాపరా'' అనే పాటుంది గదా... దానికి పేరడీగా అచ్చం శంకరాశాస్త్రి లెవల్లోనే... ''మందురా... మందులో మత్తుందిరా... గమ్మత్తుందిరా'' అని పాడతా పాడతా ''ఘల్లు ఘల్లుమని గ్లాసులు మ్రోగగ... సురసుర సురసుర సారా పొంగగ, తడి ఆరని పెదవులు తహతహలాడెను కాబోలు.. భువికి దిగెనురా సురగంగా...'' అంటూ తారస్థాయికి చేరుకొనేటోడు మేమంతా ఆ ప్రవాహంలో అట్లాగే కొట్టుకుని పోయేటోళ్ళం. ఆనందం తట్టుకోలేని కొందరు మందు బాబులు పైకురికి పదో ఇరవయ్యో వాని జేబుకి గుండు సూదితో తగిలిచ్చి అభిమానం చాటుకునేటోళ్ళు. ఆ పాటినడానికి అప్పటి నుండీ ప్రతి సమ్మచ్చరం ఆ ఒక్కరోజు మాత్రం ఆంజనేయసామి గుడికాడ హరికథ వినకుండా చెన్నకేశవసామి గుడికాడికి వురుక్కుంటా పోయేటోన్ని.


పండగరోజు కొత్త బట్టలేసుకోని సాయంత్రం ఆంజనేయసామి గుడి కాన్నించి రాములోరి రథాన్ని తోసుకుంటా వీధి వీధి తిరుగుతా జోలాపురం కాడి జమ్మిచెట్టు దగ్గరికి పోయొచ్చేటోళ్ళం. జమ్మాకు తీసుకోని తెలిసినోళ్ళిండ్లకు పోయి పెద్దోళ్ళ చేతిలో దాన్ని పెట్టి కాళ్ళకు మొక్కుతా వుంటిని, భక్తితో గాదు. గౌరవంతో కాదు. ఆరోజు పత్రి చేతిలో పెట్టి మొక్కితే దీవెనల్తో బాటు ఐదో పదో చేతిలో పెడ్తారు గదా... ఆ డబ్బుల కోసమే ఆ దొంగమొక్కులన్నీ.


దసరాకు పదిరోజుల సంబరమయితే సంక్రాంతికి నెలనాళ్ళూ సంబరమే. నేనూ, మాన్నా, మాక్కా, మా సీతక్క పిల్లలూ అందరమూ తుంగభద్రకో, హంద్రీకో పోయి ఇసుక జల్లెడ పట్టి సన్నని ఇసుకను చిన్న చిన్న సంచుల్లో నింపుకోని ఎత్తుకోనొచ్చేటోళ్ళం. దాంట్లో రకరకాల రంగులు కలిపి ఆరబెట్టి సీసాలకెత్తేటోళ్ళం. సంక్రాంతి కాలంలో పెండంటే బంగారమే గదా... అంత సులభంగా చిక్కిసావదు. ఎట్లాగో ఒకట్లా నానాక తిప్పలూ పడి సందులూ గొందులూ వెదికి పేడ దొరికిచ్చుకోనొస్తే, మాక్క సంబరంగా ఇంటి ముందంతా చిక్కగా చల్లేది. రాత్రి అన్నం తిన్నాక, జనాలు రోడ్ల మీద తిరగడం తగ్గాక ముగ్గేయడం మొదలు పెట్టేటోళ్ళం.


వణికించే చలిగాలుల మధ్య గజగజగజ వొణుకుతా... నిండుగా దుప్పటి కప్పుకోని, చలి మంటపై చేతులు కాపుకుంటా, ఆ వెచ్చదనంలో మాక్క వేసే ముగ్గును చూస్తా వుండేటోన్ని. చక్కగా చుక్కలాగుండే మాక్క ఒకొక్క చుక్కే చక్కగా పెట్టి అలవోకగా చుక్కా చుక్కా కలుపుతా చక్కగా ముగ్గు పూర్తి చేస్తే రంగులు తీసుకోని నేనూ, మాన్నా చెప్పినచోట నింపుతా వుండేటోళ్ళం. మా అక్క నెలనాళ్ళూ వేసిన ముగ్గు వేయకుండా వేసేది.


పండగ ముందు మూడు రోజులు మాత్రం నువ్వా నేనా అన్నట్టు వూరు వూరంతా పోటీ పడేది. ఏ ఇంటి ముందు చూసినా పెద్ద పెద్ద రంగు రంగుల హరివిల్లులే. మాక్క ప్రత్యేకంగా నేర్చుకున్న ముగ్గుల్ని ఆ మూడు రోజులూ వేసి చూడ చక్కని రంగులతో అదరగొట్టేది. పొద్దున్నే సూర్యుడు ఇంగా సురసురలాడక ముందే లేసి ఏ యింటి ముందు ఎట్లా ముగ్గేసినారో చూస్తా... వీధి వీధి తిరుగుతా... కొన్నింటిని చూసి నవ్వుకుంటా... మరి కొన్నింటిని చూసి మురిసిపోతా... ఇంకొన్నిటిని చూసి ఆచ్చర్యపోతా, మరి కొన్నిటిని చూసి అసూయపడతా అన్నింటినీ మనసు నిండా నింపుకోని వచ్చేటోళ్ళం.


రంగుల పండుగ తర్వాత నాకు బాగా నచ్చేది వెలుగుల పండుగ. ఇప్పుడంటే సంచుల్తో డబ్బులు తీస్కోని పోయి చేతుల్తో బాణాలు పట్టుకోనోచ్చే కాని కాలమొచ్చింది గానీ మా చిన్నగున్నప్పుడు మరీ ఇంతన్యాయం కాదు. ధర్మం కనీసం ఒక్క కాలు మీదన్నా కుంటుకుంటా నడుస్తావుండేది. అమాస చిమ్మ చీకట్లో వెలుగు పూలు పూయించే దీపావళిని మేము మా అమ్మ స్నేహితురాలు సీతమ్మోళ్ళింట్లో వాళ్ళతో కలిసి చేసుకొనేటోళ్ళం.


బాణాలు మూడు రోజుల ముందుగానే మా మామయ్యతో బాటు ఒన్‌టౌన్‌ దగ్గరి కన్యకా పరమేశ్వరి గుడి ముందున్న హోల్‌సేల్‌ షాపులకి పోయి తెచ్చుకోని మిద్దెపైన ఎండేసేటోళ్ళం. పండగ రోజు పొద్దున్నే తలస్నానాలు చేసి వాళ్ళింటికి చేరిపోయేటోళ్ళం. మాది కొత్తపేటైతే వాళ్ళది నరసింగరావు పేట. పక్కపక్కనే. కూతవేటు దూరమంతే 'ఓ' అంటే 'ఆ' అని పలకొచ్చు. వంటలు, దీపారాధనలు, భోజనాలు, ఆటలు, కబుర్లు అట్లా నెమ్మదిగా చీకటి పడేది. దీపాలు వరుసగా వెలిగించి, దేవునికి మొక్కుకోని, ప్రసాదం తిని మొదలుపెట్టేటోళ్ళం. తెచ్చినవి మాకూ, సీతమ్మోళ్ళ పిల్లలకు సమానంగా పంచేటోళ్ళు. ఎవరి కుప్పలు వాళ్ళు పెట్టుకోని ఒక్కొక్కటే కాల్చుకుంటా పోయేటోళ్ళం.


చిచ్చుబుడ్ల వెలుగులు, భూ చక్రాల మధ్య గెంతులు, రివ్వున ఎగిరే రాకెట్లు, సర్రున తిరిగే విష్ణు చక్రాలు, చెవులను బద్దలు చేసే వంకాయ బాంబులు, నాన్‌స్టాప్‌గా పేలే పొడుగాటి జడలు, కాకర పూవత్తులు, పెన్సిల్లు, లక్ష్మీబాంబులు, డబుల్‌సౌండ్లు... అట్లా ఒక్కొక్కటే కాల్చేసినాక, అన్నీ అయిపోయినా ఆశ తీరక, ఏవన్నా పొరపాటున కాలకుండా పడున్నాయేమోనని భూతద్దం పెట్టుకోని వెదికి, వాటిని గూడా కాల్చి, వత్తులు పోయినవీ, పేలనివీ అన్నీ ఒకచోట చేర్చి వాటిలోని మందంతా ఒక పేపరుమీద పోసి అంటించేటోన్ని. పేపరు కాల్తా వుంటే సురసురసుర వెలుగులు జిమ్ముతా ఒక్కసారిగా మందంతా అంటుకోని బుస్సుమని పైకి లేచి ఆ వెలుగు మా కండ్లల్లో నిలిచిపోయేది.


ఎవడు కనిపెట్నాడో గానీ... ఈ పండుగలు ఒకొక్కటి ఒకొక్కరకంగా... ఏ మాత్రం పోలిక లేకుండా, బోర్‌ కొట్టకుండా భలేగుంటాయి. ఆనాకొడుకెవడోగానీ వానికీ మానవజాతి ఎన్ని వేల సార్లు కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకున్నా ఋణం తీరదు.


నాకిష్టమైన పండుగలలో హోళీ మరొకటి. పండుగకు వారం ముందు నుంచే సీసాలో రంగు నీళ్ళు నింపుకోని, దాని మూతకి చిన్న బొక్క పెట్టి, కొండారెడ్డి బురుజుకు పోయే దారిలో గవర్నమెంట్ ప్రెస్ కాడ, ఐదారుమందిమి నిలబడి రోడ్డు మీద వచ్చే పోయేటోళ్ళను ''డబ్బులిస్తారా... రంగు కొట్టాల్నా'' అని బెదిరిచ్చేటోళ్ళం. కొందరు కోపం తెచ్చుకున్నా చానా మంది ఐదు పైసలో, పది పైసలో చేతిలో పెట్టేటోళ్ళు. ఆ డబ్బుల్తో మురుకులో, సొంగలో, పిప్పరమెంట్లో, పుల్లయిసులో కొనుక్కోనొచ్చుకొనేటోళ్ళం.


పండగ రోజైతే మా ఆంజనేయసామి గుడికాడి నాలుగు రోడ్ల కూడలి దగ్గర రంగు నీళ్ళ డ్రమ్ములు పెట్టేటోళ్ళు. మేం పిల్లలం గదా... ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా లటుక్కున పట్టుకోని ఎత్తి డ్రమ్ములో ఏసి ముంచేటోళ్ళు. పై నుండి కింది వరకూ రంగు నీళ్ళు కారిపోతావుంటే వుడుక్కునేటోళ్ళం. ఆ నాలుగు రోడ్ల కాన్నే ఒక పెయింట్‌ షాపుండేది. అట్లాగే విజ్జన్న వాళ్ళింట్లో ఎద్దుల బండ్లుండేటివి. మా గేర్లోని పొట్టెగాళ్ళకంతా అక్కన్నించి సిల్వర్‌ పెయింట్‌, ఇక్కన్నించి కందెన ఫ్రీగా సరఫరా అయ్యేది. నేను రెండు చేతులకు చిక్కగా కందెన పూసుకోని చేతులు వెనుక పెట్టుకోని ఏ బకరాగాడు దొరుకుతాడా అని వెదుకుతా పోయేటోన్ని. కొన్నిసార్లు నేను గూడా బకరా అయిపోయేటోన్ని. అట్లా సాయంకాలానికంతా గేర్లో ఒకొక్కడూ ఒకొక్క నీలమేఘశ్యాముడయ్యేటోడు.


ఆరోజు రాత్రి కాముని దహనం చేయాల గదా... పండుగకు ముందు మూడు రోజుల నుండీ ''కామన్నా కట్టెల్‌... ఐదూ కట్టెల్‌'' అని ఇంటింటి ముందు ఆగి పాట పాడేటోళ్ళం. అప్పటికీ ప్రభుత్వం జనాలకు ఇంకా ఇంత గ్యాస్‌ కొట్టలేదు గాబట్టి అందరిండ్లలో కట్టెలమోపులుండేటివి. ఐదు కట్టెలో, ఐదు పిడకలో, అర్దరూపాయో ఇచ్చేటోళ్ళు. ఎవరన్నా ఇయ్యకపోతే ఇచ్చేంత వరకూ 'ఓ' అని ఆకాశాన్నంటేలా అరుపులే అరుపులు. అట్లా జమ చేసినవన్నీ ఆ రాత్రి కుప్పగా పోసి కామన్న బొమ్మ పెట్టి అంటిస్తానే ఎవరో చచ్చిపోయినట్టు నోటికి చేయడ్డం పెట్టుకోని లబలబలాడేటోళ్ళం. ఆ ఎర్రని అగ్నిజ్వాలలు మా నల్లని మొఖాల్లో వెలుగులు విరజిమ్ముతా వుంటే ఆడిపాడి అలసిపోయి మంట తగ్గినాక రాత్రి ఏ పదకొండింటికో మూతపడుతున్న కన్నులతో ఇంటికొచ్చేటోన్ని.


ఇంటికాడ మా అమ్మ నిద్ర కండ్లతో ఎప్పుడెప్పుడొస్తానా అని ఎదురు చూస్తా వుండేది. పోయేటప్పుడే తెల్సుగదా వచ్చేటప్పటికి నేనెట్లా వుంటానో. అందుకే మా అమ్మ ఏమనేది గాదు. ఆ పండుగ అట్లాంటిది మరి. రాగానే జాలాడిలో ఏసి... నెత్తి నిండా నీళ్ళు గుమ్మరిచ్చి... బట్టల సబ్బు పూసి... పీచు తీసుకోని ఇంగ చూడు నా సామిరంగా... బాగా మసి పేరుకుపోయిన అంట్ల గిన్నెను తోముతారు చూడు అట్లా తోమేది. ఐనా ఎంత తోమినా ఆ పండగ సంబరమంతా కొన్ని రోజుల వరకూ మొఖాన్ని అంటి పెట్టుకోని అట్లాగే వుండేది.


పండగల గురించి చెబ్తా వుంటే ఒక విషయం గుర్తుకొస్తావుంది. అప్పటికి నేను మూడో నాలుగో చదువుతా వుంటి. ఏ పండగకైనా ముందు కావాల్సింది పెండనే గదా... ఒకరోజు మా అమ్మ పొద్దున్నే పండగ రోజు ''రేయ్‌... పెండ తాపోరా'' అని గంపిచ్చింది. ''పెండే బంగారమాయెనా'' అని పాడుకుంటా పోతావుంటే ఒకచోట ఒకడు బరగొడ్లను తోల్కపోతా కనబన్నాడు. నా లెక్కనే కొందరు గంపలు పట్టుకోని దాన్లెంబడున్నారు. నేనూ పోటీకి దిగినా. ఏదైనా బరగొడ్డు తోక లేపడమాలస్యం ఎవరు ముందు చూస్తే వాళ్ళు పీటీ వుషలెక్క వురికి కిందపడక ముందే గంప పెట్టేసేటోళ్ళం.


మా అమ్మ ఎప్పుడూ ''నీకు ఒక్క పనీ సక్రమంగా చేయడం రాదు. ఒకటి చెప్తే ఒకటి చేసుకోనొస్తా వుంటావ్‌'' అని తిడ్తా వుండేది. అందుకని ఎట్లాగైనా సరే అమ్మతో ''శభాష్‌... కొడుకువంటే నువ్వేరా'' అన్ని భుజం తట్టిచ్చుకోవాలని ఆ బరగొడ్లెంబడే చిన్నపార్కు దాటి, ఎస్టీబీసీ కాలేజీ దాటి, కేసీ కెనాల్ దాటి, కేవీర్ కాలేజ్ దాటి, రైల్వేస్టేషన్‌ అవతలి వరకూ పోయినాను. ఇప్పుడంటే అక్కడ వెంకటరమణ కాలనీ వుంది గానీ అప్పుడంతా పొలాలు, ముళ్ళకంపలే. మొత్తానికి మధ్యాన్నాని కంతా పెండతో గంపంతా నిండిపోయింది. సంబరంగా దాన్ని నెత్తిన పెట్టుకోని విజయగర్వంతో ఇంటికొచ్చినా.


''పోద్దుననగా పోయినాడు. ఇంతవరకూ రాలేదు. ఏమైపోయినాడురా వీడు'' అని మా అమ్మ పండగ కూడా చేయకుండా బైటకూ లోపలకూ వురుకులాడ్తా వుంది. నన్ను చూస్తే సంబరపడుతుందనుకున్నా గానీ ఇంటికాడ ఇట్లాంటి సీనుంటాదని నాకేం తెల్సు. అమ్మ మెచ్చుకోకపోగా నెత్తిన టపీటపీమని నాలుగు పీకింది. అంత పెండ అంత కష్టపడి తెచ్చినా అమ్మ ఎందుకట్లా పీకిందో అప్పుడు నాకేమాత్రం అర్థం కాలేదు. ''థూ... చస్తే ఇంకోసారి ఇట్లాంటి మంచి పనులు చేయగూడదు'' అని నిర్ణయించుకొన్నా కోపంలో...


ఏదేమైనా నమ్మకాలు కొంచం కొంచం సడలుతావుంటే డబ్బులు అనవసరంగా తగిలెయ్యడానికే ఈ పండగలు అని ఇప్పుడు అనిపిస్తా వుంటాది గానీ... నిజానికి ఎన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెడ్తే వస్తాది అంత ఆనందం.

*******************************

డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212

**************************

*****

నచ్చితే మీరొక్కరే నవ్వుకోని సంబరపడకుండా పదిమందికి *SHARE* చేయండి.

రచయిత పేరు తీసేయకండి. మార్చకండి.

కామెంట్‌లు లేవు: