26, అక్టోబర్ 2020, సోమవారం

శృంగేరీ పీఠానికీ

 సేకరణ 👇



శృంగేరీ పీఠానికీ సరస్వతీమాతకు ( శారదామాత ) వున్న అనుబంధం. 


కర్మమార్గంలో బద్దులైనవారిని ఉద్ధరించడం కోసం,శంకరులు అనేక మందిని కలిసి వాదించారని మనకు తెలుసుకదా ! 


అందులో భాగంగానే మాహిష్మతీ నగరంలో మండనమిశ్రుని కలవడానికి శంకరులు వెళ్లి, వారి ఇంటి చిరునామా గురించి శంకరులు వాకబుచేస్తుండగా, కొంతమంది స్త్రీలు నీళ్ళ బిందెలతో శంకరులకు కనబడ్డారు. మండనమిశ్రుని ఇల్లుఎక్కడ ? అని వారిని అడుగగా, వారు శ్లోకరూపంలో సమాధానం ఇచ్చారు.  


స్వత: ప్రమాణం పరత : ప్రమాణం కీరంగనా యత్ర గిరం గిరన్తి 

ద్వారస్థ నీడాన్తర సంనిరుద్ధా జానీ హి తన్మండన పండితౌక : //


అనగా ఏ ఇంటిద్వారంలో పంజరాలలో వున్న చిలుకలు, ' వేదం స్వత:ప్రమాణమా పర: ప్రమాణమా ' అని వాదిస్తూ వుంటాయో, అదే మండనమిశ్రుని ఇల్లు ' అని వారు చెప్పారు. ఇది ఆనందగిరీయం లోని శ్లోకం.  


తీరా శంకరులు, మండనమిశ్రుని ఇంటికి వెళ్లిన తరువాత, ఆయన కుమారిలుడు స్వాగతించినట్లు, ప్రతివాదం చేసేవారిని స్వాగతించలేదు. అసలు సన్యాసులంటేనే మండనులకు ఇష్టముండదు. వారు వేదకర్మలను చేయరనీ, వారిని చూడడమే మహాపాపమని భావించే కోవలోనివాడు. అందుకని శంకరులను వారు పిలవలేదు. పైగా ఆరోజు మండనమిశ్రుని ఇంట్లో శ్రాద్ధకర్మ జరుగుతున్నది, ఆరోజు సన్యాసులను వారుచూడరు. ఇంటి తలుపులు కూడా మూసివున్నాయి.  


ఇలాంటి మండనమిశ్రునికి అలాంటి రోజున ఉపదేశం యివ్వాలని శంకరులు నిర్ణయించారు. తలుపులు మూసివున్న ఆ ఇంట్లోకి కల్లుగీసేవారు చదివే ఒక మంత్రం సహాయంతో, ప్రవేశించారని ఒక కథ వుండగా, శంకరులు యోగశక్తితో ఆ ఇంటిలోకి ప్రవేశించారని వేరొక కథ వున్నది. ఆరోజులలో కొబ్బరిచెట్లు ఎక్కి కల్లు గీయకుండా, మంత్రం చదివి, కొబ్బరి చెట్లనే క్రిందికి వంగేటట్లుగా, వేరొక మంత్రంతో కల్లుగీత పని అయిపోగానే చెట్టు నిలబడేటట్లుగా కల్లుగీత కార్మికులు చదివేవారట.  


ఆరోజు మండనమిశ్రుని ఇంట్లో శ్రాద్ధకర్మలో, జైమినీ మహర్షి, వ్యాసమహర్హి భోక్తలుగా వున్నారు. పరీక్షిత్తు యెంత జాగ్రత్తగా వున్నా, తక్షకుడు పండురూపంలో అతని మేడలో ప్రవేశించ లేదా ? తక్షకుడు విషం చిమ్మితే, శంకరులు అమృతం పంచడం కోసం వెళ్లారు. మండనమిశ్రుడు శ్లేషతో కూడిన ప్రశ్నలతో ఎక్కడనుండి వచ్చావు ? అని ప్రశ్నించడం, దానికి శంకరులు సమాధానం చెప్పడం జరిగింది. ఆ తరువాత, జైమిని, వ్యాసుల వారు, సన్యాసిని శ్రాద్ధకర్మలో విష్ణు స్థానంలో కూర్చోబెట్టవచ్చని చెప్పగా, మండనుడు శంకరులను భిక్ష స్వీకరించమని కోరాడు.  


నేను ఈ భిక్ష కోసం రాలేదనీ, నాకు వాదభిక్ష కావాలనీ, కుమారిలుడు పంపగా వచ్చానని మండనునితో చెప్పారు, శంకరులు. భోజనబిక్ష తరువాత, వాదభిక్ష చేద్దామని మండనుడు అనగా, భోజనానంతరం ఇరువురూ వాదానికి కూర్చున్నారు.  


వాదానికి మధ్యవర్తిగా ఎవరు వున్నారో !   


మండనమిశ్రుడు సాక్షత్తూ బ్రహ్మదేవుని అవతారమనీ, అతనిభార్య సరసవాణి, సరస్వతీదేవి అనీ శంకరులకు తెలుసు. అందుకనే సరసవాణిని మధ్యవర్తిగా నియమించగా శంకరులు యెంతో సంతోషించారు. ఆమె మెచ్చినదే కదా తనప్రజ్ఞ అని భావించారు. కనుక సరసవాణి మాట శిరోధార్యమే !  


ఇక సరసవాణికి ఇబ్బందికర పరిస్థితి. సన్యాసి గెలిచాడని చెబితే భర్త చిన్నబుచ్చుకుంటాడు. అందుకని తెలివిగా, ఫలితం తననోటితో చెప్పకుండా, వారిద్దరి మెడలలో రెండు పూలదండలు వేయించి, ఎవరిమెడలో దండవాడిపోతే వారు ఓడిపోయినట్లని నియమం ఏర్పాటుచేసింది. ఇక పోటీలో వున్న వాద ప్రతివాదులలో శంకరులు ఓడిపోతే, వారు తిరిగి గృహస్థాశ్రమం స్వీకరించాలనీ, మండనుడు ఓడిపోతే, సన్యాసం తీసుకోవాలనీ కూడా నియమం పెట్టుకున్నారు. 

 

వాదం మొదలైంది. రెండు విద్వద్ శిఖరాలు ఢీకొన్నట్లుగా 21 రోజులు చర్చ జరిగింది. శంకరులు అద్వైత వాదాన్ని ప్రతిపాదించారు. శంకరులు నివృత్తిమార్గంలో వున్నారు. పక్వమైన పండు చెట్టునుండి క్రిందబడితే, తిరిగి చెట్టుకు తగిలించి ఏమి ప్రయోజనం ? అదే విధంగా జ్ఞానం వచ్చేదాకా కర్మలు చేస్తూ, పండుపక్వానికి ( పూర్తిజ్ఞానం ) వచ్చిన తరువాత కర్మలు తొలిగిపోతాయి. అలాంటి జ్ఞానం కలిగినవారు అన్నింటినీ సమదృష్టితో చూస్తారు. ప్రేమతో చూస్తారు. నిష్క్రియులై వుంటారు. సన్యాసులంటే, సర్వభూతములకూ తమనుండి ఏ భయమూ లేకుండుగాక ! అని ప్రైష మంత్రం పలికినవారు కదా !  


ఎట్టకేలకు మండనుడు అద్వైతాన్ని పూర్తిగా అంగీకరించాడు. అయన మెడలో పూలమాల వాడిపోయింది. ఆయనలో సగభాగమైన సరసవాణి కూడా భర్త ఓటమిని అంగీకరించింది. తల ఒగ్గింది. తన భర్త ఓడిపోయాడని ప్రత్యక్షంగా చెప్పకుండా ఇద్దరినీ భిక్షను స్వీకరించమని చెప్పి, ఇరువురకూ నమస్కరించింది. ఉత్తరోత్తరా శంకరులు సర్వజ్ఞపీఠం అధిరోహించినప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమై శంకరులని సర్వజ్ఞులని ప్రకటించినట్లు కథ కూడా వున్నది.  

 

ఏ భార్య అయినా తనభర్త సన్యాసం తీసుకుంటుంటే సహించగలదా ? అయితే ఉభయభారతిగా ప్రసిద్ధిపొందిన సరస వాణి సరస్వతీ అవతారమే కదా ! మండనుడు సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులైనారు. సరసవాణి సరస్వతీదేవిగా బ్రహ్మలోకానికి వెళ్ళడానికి సిద్ధపడగా, శంకరులు, ' అమ్మా ! నీవు అలా వెళ్ళిపోతే ఎలా ! ఇక్కడే వుండి అందరికీ జ్ఞానాన్ని సద్బుద్ధినీ కలిగించమని నవదుర్గామంత్రంతో ఆమెను శంకరులు బంధించారు. ఆమంత్రానికి అమ్మ లొంగినట్లే కనబడింది.  


అయితే, సరస్వతీదేవి, తనను ఎక్కడా ప్రతిష్టించవద్దనీ, నీవు దేశం అంతా తిరుగుతూవుండు, నీవెనుకే నేను వస్తుంటాను. నువ్వు ఎక్కడ వెనుదిరిగి చూస్తే, నేను అక్కడే ఉండిపోతానని శంకరులకు చెప్పడము, జరిగింది. అలాగే శంకరులు వెనుదిరిగి చూడకుండా నడుస్తూ, ఆమె అందెల గలగల వింటూనే వున్నారు.  


శృంగేరీపీఠం గొప్పదనం ఏమిటో తెలుసుకుందాం.


ముందు శంకరులు, వెనుక శారదామాత నడుస్తున్నారని చెప్పుకున్నాము కదా ! అలాప్రయాణం సాగిస్తూ తుంగభద్రా తీరంలోని శృంగేరీచేరుకున్నారు, ఇరువురూ. అక్కడ ఒకప్రదేశంలో ప్రసవిస్తున్న కప్పకు ఎండ తగలకుండా పాముపడగ పడుతున్న దృశ్యం చూసారు శంకరులు.   


సహజవైరమున్న కప్పకు, పాము పడగ పట్టడం, పరమ సాత్వికతత్వానికి ప్రతీక అనీ, అది మహత్తర ప్రదేశమని భావించారు శంకరులు. ఇంతలో పరికించి వింటుంటే, శారదామాత అందెలధ్వని వినరావడం లేదు. శంకరులు వెనక్కి తిరిగి చూడక తప్పలేదు. వెనుక ఇసుకతిన్నెలలో శారదామాత పాదాలు చిక్కుపడి, ఆమె కాళ్ళ అందెల చప్పుడు వినబడకపోవడం గమనించారు శంకరులు. వెంటనే, ఇదీ మంచికే జరిగిందని భావించి, అక్కడ శృంగేరీ లో శారదా పీఠాన్ని నెలకొలిపారు శంకరులు. 


శంకరులు చాలాకాలం అక్కడ వుండి, అమ్మవారిని అర్చించారు. శంకరుల మొత్తం 32 సంవత్సరాల జీవన ప్రయాణంలో, మొదటి 16 సంవత్సరాలలో అన్ని గ్రంధాలనూ వ్రాసారు. మిగిలిన 16 సంవత్సరాలలో, ముమ్మారు దేశాన్ని పర్యటించి, అనేక విజయాలు సాధించి షణ్మతాలు స్థాపించారు. అందులో భాగంగానే ఎక్కువకాలం స్వామివారు శృంగేరీలో వున్నట్లు శంకర విజయం గ్రంధం చెబుతున్నది.  


మిగిలిన మఠాలు ఎక్కడ స్థాపించాలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుగా అనుకుని శంకరులు స్థాపిస్తే, శృంగేరీ మఠం మటుకు దైవప్రేరణతో జరిగినట్లు తెలుస్తుంది. విద్యాదేవత అయినా శారదామాత అక్కడ మఠాన్ని నెలకొలిపేటట్లు చేసింది.   


ఇదికాక, అనేక ఒడిదుడుకులకు తట్టుకుని శంకరులు స్థాపించిన ఉత్తరాన బదరీనాధ్ దగ్గరలో జోషీమఠ్, పడమర ద్వారకలో, తూర్పున పురిలో, దేశానికి నడిబొడ్డు అయిన కంచిలో ఇలా అయిదు ప్రదేశాలలో ఆదిశంకరులు స్థాపించిన మఠాలు అద్వైత వెలుగులు విరజిమ్ముతున్నాయి.   


సరసవాణిగా వున్న సరస్వతీదేవి, శారదామాతగా శృంగేరీలో కొలువైవున్న విషయం తెలుసుకున్నాము కదా !  


సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం. 


ప్రధమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ 

తృతీయం శారదాదేవి చతుర్ధం హంసవాహనా : //


పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా /

కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమమ్ బ్రహ్మచారిణీ //  


నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ 

ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ //


బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం య : పఠేన్నరః ; 

సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ 

సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ // 

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: