26, అక్టోబర్ 2020, సోమవారం

మొగిలిచెర్ల అవధూత

 జీవితానికో గమ్యం..


2019 వ సంవత్సరం దేవీ నవరాత్రుల సమయం లో ఒక గురువారం ఉదయం 9.30 గంటలకు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు ఓ 65 ఏళ్ల పైబడిన ఆడమనిషి ఒక చిన్న చేతి సంచీ ని భుజానికి తగిలించుకుని వచ్చారు..మందిర ప్రాంగణంలో కి వచ్చిన తరువాత ఒకసారి ఆ ప్రదేశం అంతా తేరిపారా చూసి..నీళ్ల పంపుల వద్దకు వెళ్లి..కాళ్ళూ చేతులు కడుక్కొని..క్యూ లైన్ లో వెళ్లి..స్వామివారి సమాధిని దర్శించుకొని..తిరిగి మేము కూర్చుని ఉన్న చోటుకు వచ్చారు.."బాబూ..ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?" అని నన్నే అడిగారు.."నేనేనండీ.." అని చెప్పి కుర్చీలో కూర్చోమన్నాను.."చెప్పండమ్మా.. ఎక్కడినుంచి వచ్చారు?..మీ పేరు.." అని అడిగాను.."నా పేరు అరుంధతి..హైదరాబాద్ నుంచి వచ్చాను..నేను ఎక్కువగా దత్తక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటాను..ఈ ప్రదేశం గురించి విన్నాను..చదివాను..చాలా రోజుల క్రితమే ఇక్కడికి రావాలసింది..కానీ..గాణుగాపూర్ లో నలభైరోజులు ఉండడం మూలంగా..ఇక్కడికి రావడం ఆలస్యం అయింది.." అని చెప్పారు.."ఇక్కడ మూడురోజులు ఉండాలని అనుకున్నాను..దత్తుడి ఆజ్ఞ ఎంతవరకూ ఉంటే అన్నాళ్లు ఉంటాను..నాకు కాలకృత్యాలకు, స్నానానికి ఏర్పాటు ఉంటే చాలు..ఈ మంటపం లోనే ఉంటాను.." అన్నారు.."అలాగేనండీ.." అని చెప్పి..మా సిబ్బందికి ఆమెకు కావాల్సిన ఏర్పాటు చేయమని చెప్పాను.."అమ్మా..ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది.. శనివారం నాడు రాత్రికి కూడా ఆహారపు ఏర్పాటు ఉన్నది.." అని చెప్పాను.."చాలండీ..నేను ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తాను..స్వామివారి జీవితచరిత్ర పుస్తకం ఇక్కడ ఉన్నదా?.." అని అడిగారు.."ఉన్నది..అక్కడ తీసుకోండి.." అని చెప్పాను..సరే అని లేచి వెళ్ళిపోయి..పుస్తకం కొనుక్కొని..స్వామివారి సమాధి దర్శననానికి టికెట్ తీసుకొని..సమాధి వద్దకు వెళ్లి..ఓ ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని నిలబడి..ఇవతలకు వచ్చేసారు...పూజారిగారు అర్చన చేయడానికి గోత్రనామాలు అడిగితే..తన కుమారుడు, కుమార్తెల గోత్రనామాలు ఇచ్చి..అర్చన చేయించుకొని ఇవతలికి వచ్చేసారు..


ఆ తరువాత ఆవిడ ముఖ మంటపం లోకి వెళ్లి కూర్చుని స్వామివారి జీవితచరిత్రను చదువుకోసాగారు..మా పనుల్లో మేము ఉండిపోయాము..మధ్యాహ్నం అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసివచ్చారు..సాయంత్రం స్వామివారి హారతి ఇచ్చిన తరువాత..మా సిబ్బంది వద్దకు వచ్చి.."బాబూ..నేను రాత్రికి మంటపం లోనే పడుకుంటాను.." అన్నారు..ప్రక్కరోజు శుక్రవారంనాడు కూడా తన పాటికి తాను స్వామివారి చరిత్ర పారాయణం చేసుకుంటూ ఓ ప్రక్కగా వున్నారు..శనివారం నాడు ఉదయాన్నే లేచి..ఒక ఆటో మాట్లాడుకుని..మాలకొండకు వెళ్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని మధ్యాహ్నం వచ్చారు..ఆరోజు సాయంత్రం పల్లకీసేవలో అర్చన చేయించుకొని..పల్లకీతోపాటుగా మూడు ప్రదక్షిణాలు చేశారు..ఆదివారం ఉదయం భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి..అందరూ దర్శించుకొని వెళ్లిపోయిన తరువాత..ఎవ్వరూ లేని సమయంలో నా వద్దకు వచ్చి.." బాబూ..మరో వారం ఇక్కడ ఉండాలని దత్తుడి ఆజ్ఞ వచ్చింది.. ఇక్కడే వుందామనుకుంటున్నాను..మీకేమీ ఇబ్బంది లేదు కదా?.." అన్నారు.."అమ్మా..మీ పాటికి మీరు వున్నారు..మీ వల్ల మాకేమీ ఇబ్బందీ లేదు..స్వామివారి అనుమతి ఉన్నంతవరకూ వుండండి.." అన్నాను..


అలా చెప్పిన అరుంధతి గారు ఆ తరువాత మరో పదకొండురోజులు స్వామివారి సన్నిధిలోనే వున్నారు..మొత్తంగా 28 రోజులు వున్నారు..సరిగ్గా గురువారం నాడే..మధ్యాహ్నం నా వద్దకు వచ్చి.."బాబూ..ఈరోజు సాయంత్రం బస్ లో నేను మా ఊరికి వెళుతున్నాను..ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది..ఆ స్వామివారు కరుణిస్తే.. నా శేష జీవితం ఇక్కడే గడపాలని అనుకుంటున్నాను..నాకు బాధ్యతలేమీ లేవు..నా కుమారుడు, కుమార్తె ఇద్దరూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు..మూడేళ్ల క్రితం మావారు కాలం చేశారు..నేనూ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను..నా పెన్షన్ తో నాకు లక్షణంగా గడిచిపోతుంది..ఈ నాలుగు వారాల్లో ఇక్కడి వాతావరణం చూశాక..ఒకటి అనిపించింది..నేను నా ధ్యానం అనే ధ్యాసలో వున్నాను..ఇతరులకు కూడా సహాయం చేస్తే..మరింత తృప్తిగా వుంటుంది అని అర్ధం అయింది..నా లాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలంటే కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి..ఆ దిశగా మీరు ఆలోచన చేయండి..నా వంతు ఆర్ధిక సహాయం నేను చేస్తాను..దత్తుడు నాకు ఈ రకంగా ఉపయోగపడమని అనుజ్ఞ ఇచ్చాడు..నేను మరలా ఒక నెలరోజుల్లో వస్తాను..ఈసారి నలభైరోజులు ఇక్కడే ఉంటాను..గత రెండేళ్లుగా ఎన్నో దత్తక్షేత్రాలు చూసాను..ఈసారి అలాకాదు.. జీవితానికి ఒక సార్ధకత ఉండాలని నా మనసుకు గట్టిగా అనిపించింది.. నేను చెప్పిన సౌకర్యాల గురించి ఆలోచించండి..ఇన్నాళ్లూ ఆదరించినందుకు ధన్యవాదాలు.." అని చెప్పి వెళ్లిపోయారు..


ఆ తరువాత అరుంధతి గారు మరోసారి వచ్చి, తాను చెప్పినట్టే నలభైరోజులు వున్నారు..మేము నిర్మిస్తున్న డార్మెటరీకి ఆర్ధికంగా సహాయం చేసారు.."ఈ క్షేత్రాన్ని ఒక మంచి ధ్యాన ప్రదేశం గా మార్చండి బాబూ.." అని చెప్పారు..మొత్తంమీద మూడుసార్లు స్వామివారి మందిరానికి వచ్చిన అరుంధతి గారు ప్రతిసారీ ఒకమాట చెప్పారు.."ఇక్కడికి వచ్చిన తరువాత..నా జీవితానికి ఒక గమ్యాన్ని చూపారీ స్వామివారు..సాటి మనిషికి సహాయం చేయని జీవితం వృధా కదా?" 


ఆ మార్పుకు కారణభూతుడైన స్వామివారు మౌనంగా సమాధి లో వున్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: