26, అక్టోబర్ 2020, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

సోదరప్రేమ..


"నా పేరు సురేష్..నెల్లూరు నుంచి వచ్చాను..దాదాపు సంవత్సరం నుంచీ ఇక్కడకు రావాలని అనుకుంటున్నాను..ఇప్పటికి కుదిరింది..ఒక వారం రోజుల పాటు ఇక్కడ వుండవచ్చా?..కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి..ఈ స్వామి వారి వద్ద మ్రొక్కుకుంటే అన్నీ తీరిపోతాయని విన్నాను..స్వామివారు దయ చూపిస్తే నా మనోవేదన తగ్గుతుందని ఆశ!." అన్నారు..ఆయన సుమారు నలభై ఐదేళ్ల వయసు కలిగి ఉంటారు..చూడటానికి నెమ్మదస్తుడిలా కనబడ్డారు..మా సిబ్బందికి చెప్పి, వారికొక రూమును కేటాయించాను..


వచ్చిన రోజు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి, మందిరం లోకి వచ్చి, ఓ గంట సేపు ధ్యానం చేసుకున్నారు..ఆ తరువాత లేచి వెళ్లి..మందిరం వద్ద ఉన్న దుకాణాల లో కొన్ని బిస్కెట్ పొట్లాలు కొని..మందిరం వద్ద ఉన్న కుక్కల కు ఆహారంగా పెట్టారు..రాత్రికి తన రూముకు వెళ్లిపోయారు..రోజూ ఇదే విధంగా ఉదయం, సాయంత్రం ధ్యానం చేసుకోవడమూ..కుక్కలకు ఆహారాన్ని అందివ్వడమూ తన ప్రధాన దినచర్యగా మార్చుకున్నారు..మధ్యాహ్నం మందిరం తరఫున ఉన్న అన్నప్రసాదాన్ని స్వీకరించేవారు..ఐదురోజులు గడిచిపోయాయి..మందిరం వద్ద ఉన్న ఇతర భక్తులూ..మా సిబ్బంది కూడా ఆయనను అమాయకుడి గా భావించసాగారు..కానీ ఆయన ఇవేవీ పట్టించుకోకుండా..అందరితో కలివిడిగా..వుండేవారు..ఏదీ మనసులో దాచుకోకుండా ప్రవర్తించేవారు..శని, ఆదివారాల్లో అన్నదానం వద్ద  నిలబడి..అక్కడికి వచ్చి ఆహారం తీసుకునే వాళ్ళను ఆసక్తిగా గమనించేవారు..తానే అన్నదానం చేస్తున్నట్లు గా భావించి..అందరికీ కొసరి కొసరి అన్నం పెట్టేవారు..ఒక తన్మయత్వం ఆయన కళ్ళలో కనబడేది..శనివారం నాటి పల్లకీ సేవలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు..


మరోరెండురోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే.."ప్రసాద్ గారూ ఈరోజు మందిరం వద్ద ఎన్ని గంటలకు వుంటారు?.." అని నాకు ఫోన్ చేశారు..చెప్పాను..ఉదయం ఎనిమిది గంటల కల్లా మందిరం వద్దకు వెళ్ళాను..నాకోసమే ఎదురు చూస్తున్నట్లుగా మందిరం వెలుపలే వేచి ఉన్నారు..ఆయనను పలకరించి..మందిరం లోపలికి వెళ్లి, శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వచ్చి కూర్చున్నాను..నేరుగా నా వద్దకు వచ్చేసారు..


"కొన్ని వివరాలు అడుగుతాను..చెపుతారా?.." అన్నారు..చెపుతాను అన్నట్లు తల ఊపాను.."అలా కాదు..నోటితో చెప్పండి.." అన్నారు..పసిపిల్లాడు అడిగినట్లు గా అడిగారు..వారిని చూస్తుంటే..ఏదీ దాచుకోకుండా చెప్పాలని అనిపించింది..


"ఒక వారం పాటు ఇక్కడ అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత?.." అన్నారు..చెప్పాను..

"ఓహో..అలాగా.."అన్నారు..కొద్దిసేపు మౌనంగా వుండి.."ప్రసాద్ గారూ నేను ఇక్కడికి వచ్చిన రోజు మీతో..కొన్ని సమస్యలున్నాయని చెప్పాను..గుర్తుందా?..నాకున్న పెద్ద సమస్య మా తమ్ముడే.. వాడు నాతో విబేధించి..నాతో మాట్లాడటం మానేశాడు..ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతోంది..నిన్న రాత్రి వాడు నాకు ఫోన్ చేశాడండీ..అరగంట సేపు మాట్లాడాడు..ఉన్నఫళంగా నన్ను బయలుదేరి రమ్మన్నాడు..నన్ను చూడాలని అనుకుంటున్నాడట.. తన పొరపాట్లు మన్నించమని అడిగాడు..నేను ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి వద్ద ధ్యానం చేసుకున్న ఫలితం ఇది.. నేను శ్రీ స్వామివారిని  నా తమ్ముడికి నాకూ మధ్య ఉన్న అంతరాలను తొలగించమనే కోరుకున్నాను.. శ్రీ స్వామివారు అది తీర్చారు.." 

ఆ మాట చెపుతూ..ఉద్వేగం ఆపుకోలేక..కన్నీళ్లు పెట్టుకున్నారు..


"నేను నాలుగు రోజులపాటు వుందామని అనుకున్నాను..కానీ పదిరోజుల పైనే ఇక్కడ వున్నాను..శ్రీ స్వామివారి కృపతో తమ్ముడి దగ్గరకు వెళుతున్నాను..త్వరలో మా తమ్ముడితో సహా ఇక్కడికి వస్తాను..నాకు చాలా తృప్తిగా వుందండీ..ఇంత చిన్న పల్లెటూరు ప్రక్కన ఉన్న ఈ గుడివద్ద..మీకు ఉన్న పరిమిత  వనరులతోనే..మీరు చేస్తున్న అన్నదానం బాగుందండీ.." అన్నారు..


ఆరోజు సురేష్ గారు వాళ్ళ ఊరు వెళ్లేముందు..ఒక వారం రోజుల పాటు అన్నదానానికి సరిపడా సరుకులను మందిరం వద్దకు చేర్పించి మరీ వెళ్లారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: