26, అక్టోబర్ 2020, సోమవారం

లక్ష్య నిర్దేశం

 **అద్వైత వేదాంత పరిచయం**


4.1.1 లక్ష్య నిర్దేశం: మన అంతిమ లక్ష్యం ఏమిటో మనకి బాగా తెలియాలి. జీవితం ఫుట్‌బాల్‌ ఆట లాంటిది.బంతిని ఎదుటి టీమ్‌కి అందకుండా మనం పట్టుకుని కూర్చుంటే చాలదు. దాన్ని గోల్‌లోకి వేయాలి.లేకపోతే మన దగ్గర బంతి గంటసేపు ఉన్నా వ్యర్థమే. అలాంటి బంతుల్ని డబ్బు, కుటుంబం, ఆఫీస్‌ వగైరా మనం ఎన్నో పట్టుకు కూర్చుంటున్నాం. మనం స్పష్టంగా నేర్చుకోవాల్సిన అంశం మనం పశుప్రవృత్తి నుంచి మనిషి ప్రవృత్తికి ఎదిగి,మనిషి ప్రవృత్తి నుంచి దైవ ప్రవృత్తికి ఎదగాలి. మన అంతిమ లక్ష్యం మోక్షాన్నిచ్చే ఆధ్యాత్మిక సాధన అని తెలుసు కోవాలి.


4.1.2 క్రతువుల పరిజ్ఞానం :` ఏదో ఒక రకమైన పూజ చేయటం నేర్చుకోవాలి. దీన్నే క్రతువు అంటారు. చాలామందికిపూజ ఎందుకు చేస్తారో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలియదు. ఇక్కడ పూజ అంటే శారీరకంగాచేసే పూజ, దీనివల్ల మూడు లాభాలున్నాయి.

  మొదటి లాభం, పూజ చేయటం వల్ల క్రమశిక్షణ పెరుగుతుంది. క్రమశిక్షణ ఉంటే పూజ చేస్తారు. ఉదాహరణకి సైనికులకున్నన్ని కర్మలు ఎవరికీ లేవు.అందువల్ల క్రమశిక్షణ ఉన్నచోట క్రతువు ఉంటుంది. క్రతువు ఉన్నచోట క్రమశిక్షణ ఉంటుంది.

  రెండో లాభం, జీవితంలో ఉషారు పుట్టుకొస్తుంది.బద్దకించటం శరీరతత్త్వం.తమోగుణ నివృత్యర్థం పూజ చేయాలి.

  మూడోలాభం, దేవుని మీద భక్తి పెరుగుతుంది. తక్కిన భావాలలాగా, భక్తి కూడా మనసులో పుట్టే ఒక భావనే. భావన కనబడదు, కాని దాన్ని చేతల ద్వారానో, మాటల ద్వారానో వెలిబుచ్చుతాము. దాన్ని వెలిబుచ్చటం ద్వారా, ఇంకొంచెం పోషిస్తాం కూడా. అందువల్ల మనం పూజ చేస్తున్నామంటే, మన భక్తిని వెలిబుచ్చటమే కాక,దాన్ని పోషిస్తున్నాం కూడా. శాస్త్రం మనకిచెప్పేది,అన్ని మానవ సంబంధాలకన్నా దైవంతో సంబంధం శాశ్వతమైనదని. మానవ సంబంధాలనెంత బాగా పెంచి,పోషించినా,అవి ఎప్పటికో అప్పటికి వీగిపోక తప్పదు.శాశ్వతసంబంధం అంటే అది దైవంతోనే. అందుకని చేత్తో చేసే పూజా, నోటితో జపించే మంత్రం రెండూ మానకుండా చేయాలి.

🙏

కామెంట్‌లు లేవు: