26, అక్టోబర్ 2020, సోమవారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


113 - విరాటపర్వం.


కీచకుడు ఆ రాత్రికి నర్తనశాలకు రావడానికి వొప్పుకున్నాడన్న వార్త, ద్రౌపది చెప్పగానే,  భీముడు ' కీచకుని, ఇంద్రుడు వృత్రాసురుడిని వధించినట్లు వధిస్తాను,  ఏనుగు మారేడుపండును డొల్ల చేసినట్లుచేసి వాడిని యమపురికి పంపుతాను. నీవు నిర్భయంగా వుండు, ' అని చెప్పాడు  ద్రౌపదికి.  చాలా రోజులకు తిరిగి తనపరాక్రమం చూపేరోజు వచ్చిందని సమరోత్సాహంతో వున్నాడు.


పగలు క్రమంగా తగ్గిపోయి, చీకటి ముసురుకుంటుండగా, భీముడు నర్తనశాలలో శయ్యను యేర్పాటుచేసి,  బహువిధాలైన పూలతో అలంకరించి,  ఆ శయ్యపై,  తన శరీరం కనబడకుండా, చీర చుట్టుకుని,  అటుతిరిగి పడుకుని, వేటకు వుపక్రమించిన సింహంలా కీచకుని కోసం యెదురుచూస్తున్నాడు.


అక్కడ కీచకుడు, రాత్రి జాములు మొదలవగానే,  తన కోసం ద్రౌపది యెదురుచూస్తూ వుంటుందన్న తలంపుతోనే, సంబర పడిపోతూ, అనేక ఆభరణాలు  అలంకరించుకుని, సువాసనలు శరీరమంతా  పులుముకుని, తన చిరకాలవాంఛ నెరవేరబోతున్న వుత్సాహంతో సింహపు బోనుని, శృంగారశాలగా భావించి అడుగుపెడుతున్నాడు.  


పూలతో అలంకరించిన శయ్యను, దానిపై పడుకుని వున్న ఆకారం చూస్తూనే, సైరంధ్రియే ఆశయ్యపై వుందని భావిస్తూ,  ఆ భావనకు ఆనందంతో వూగిపోయాడు.  కామంతో పరవశించిపోయాడు.  శృంగార సంభాషణలు ప్రేలుతున్నాడు.  ఇది వింటూ, ద్రౌపది వేషంలో అటుతిరిగి పడుకుని వున్న భీమసేనుడు, సైరంధ్రీ కంఠ0 అనుకరిస్తూ ,  గోముగా  ' ఇక చాలించండి మీసరసాలు.  కోరివచ్చిన చెలి చెంతచేరినా యింకా సంభాషణలతో, కాలం వెళ్లదీయడమేనా ! నా స్పర్శ అనుభవిస్తే, మళ్ళీ యింకొక స్త్రీ గురించి నీవు ఆలోచించే అవసరమే వుండదు.   నీకు స్వర్గ దర్శనం చేయిస్తాను.'  అంటూ  సరసంగా దగ్గరకు పిలిచాడు, భీమసేనుడు.


ఆ మాటలను ద్రౌపది ప్రేమతో అంటున్నది భావించి, నెమ్మదిగా భీముని మీద చెయ్యి వేశాడు కీచకుడు.  ఎంతో కోపంగా వున్నా, భీముడు సంయమనంతో, కీచకునికి దొరకకుండా తిప్పలు పెట్టసాగాడు.  


కీచకునికి ఒకపట్టాన దొరకకుండా, అతనిలో కామోద్రేకం రెచ్చగొడుతూ,  కామసమరానికి సన్నద్ధుడిని కమ్మని స్త్రీ గొంతుకతో మరీమరీ  కీచకునికి  వేరే ఆలోచన రానీయకుండా వూదరగొట్టాడు, భీముడు, యుద్ధానికి సిద్ధం కమ్మని అన్యాపదేశంగా చెబుతూ.    ఆ విధంగా నయగారాలు పోతూ, కీచకుని రెండుచేతులూ తన బాహువులలోనికి ఒడుపుగా తెచ్చుకుని, ఒక్క వుదుటునలేచి నిలబడి, తన బాహువులతో బంధించి, ' ఓరీ నికృష్టుడా ! పరస్త్రీ వ్యామోహ పిశాచీ కీచకా !! కాచుకో !!! '. అంటూ,  కీచకునితో ద్వంద్వ యుద్ధానికి సమాయత్తమయ్యాడు.


అంతే ! శృంగారవాంఛతో వున్న కీచకుడు సమరాంగణానికి  రావడానికి ఒకింత సమయం పట్టింది.  ఆ అవకాశాన్ని వినియోగించుకుని, ప్రత్యర్థిపై తన పిడికిలి బిగించి ఒక్క దెబ్బవేసి, తనబలాన్ని పరిచయం చేశాడు భీముడు.   కీచకుడు కూడా తన శక్తి యుక్తులు కూడగట్టుకుని,  భీమునితో యద్ధానికి తలబడ్డాడు.  రెండు మదపుటేనుగుల వలే భీకరంగా ద్వందయుద్ధం చేశారు.  నర్తనశాలలో నర్తకులు నర్తించవలసిన చోట యిద్దరు బలశాలులు, వారి ముష్టిఘాతాలతో, జబ్బల చెరుపులతో, రణరంగాన్ని తలపింప జేశారు.  దెబ్బతిన్న సర్పాలవలే, మోసపోయిన చిరుతలవలే, వారు క్రింద పడి, పైకిలేస్తూ  సైరంధ్రి మోసం చేసిందనే వుక్రోషంతో కీచకుడూ, తమ పత్నిని అవమానించాడని భీమసేనుడూ,  ప్రాణాలను పణంగాపెట్టి పోరు సలుపుతున్నారు.  


కీచకుడు బలంగా కొట్టగానే, వాయునందనుడు, భీమసేనుడు  కోపంతో, కీచకుని బరబరా నర్తనశాల మధ్యభాగంలోనికి ఈడ్చుకుంటూ వెళ్లి, పైకియెత్తి, ఒక మహావృక్షాన్ని త్రిప్పినట్లు, అటూయిటూ వూపి, పైకెత్తి పట్టుకుని గిరగిరా త్రిప్పాడు.  దబ్బున నేలకేసి కొట్టాడు.


పడి లేస్తూనే, కీచకుడు తనమోకాలితో భీముని ఉదరంలో పొడిచి నేలమీద పడవేశాడు.  వీరి భీషణ గర్జనల మధ్య నర్తనశాల హోరెత్తిపోయింది.  భీముడు సింహంలా గర్జిస్తూ, కీచకుని వక్షస్థలంపై పిడి గుద్దులు గుద్దుతూ, కీచకుని నిర్వీర్యుడిని చేయసాగాడు.  కీచకుని శక్తి సన్నగిల్లి, పైకి లేవలేకపోతున్నాడు.  ప్రత్యర్థి బలహీనుడు అవుతున్నాడని గ్రహించి, యిక ఆలశ్యం చెయ్యకుండా భీముడు, వానిని క్రింద పడవైచి, పిడిగుద్దులతో వక్షస్థలం మీద వరుసగా  గుద్దసాగాడు.  


వాడు లేవబోతుండగా, వాని కేశాలు బలంగా లాగి,  క్రింద పడవేసి, లేడినిపట్టిన చిరుతలాగా, కీచకుని ఒడిసిపట్టుకుని, చేతులతో మెడకాయను బిగించాడు.  గొంతు నులిమివేశాడు.  ఒక్కసారిగా కనుగుడ్లు బయటకు వస్తుండగా కీచకుడు పెద్దగా అరుస్తూ కూలబడిపోయాడు.  భీముడు రోషంగా,   ' నీలాంటి వాడెవడైనా ముందుముందు పర స్త్రీని అనుభవించాలని, అవమానించాలనీ చూస్తే, కీచకవధ  అట్టి దుర్మార్గులకు గుర్తురావాలి. '  అంటూ కీచకుడిని, పైకి లేవదీసి,  కాళ్ళు చేతులూ ఉదరంలోనికి మడిచి, పుట్టినప్పుడు  తల్లిగర్భంలో వుండే పిండం మాదిరిగా వాడిని చుట్టి నేలపై విసిరి కొట్టాడు.   కీచకుడు కన్నుమూశాడు.  


ఇంకా కసిదీరక భీమసేనుడు కీచకుని కళేబరం వద్దకు వెళ్లి, పొట్టను చీల్చి, అతని చేతులూ కాళ్ళు పొట్టలో దూర్చి ఒక బంతి లాగా తయారు చేసి, వికటాట్టహాసం చేశాడు, విజయగర్వంతో.    ప్రక్కనేవున్న పాంచాలిని పిలిచి, ' ఈకామాంధుని పరిస్థితి చూడు' అంటూ బంతిలా వాడి శరీరాన్ని ద్రౌపది వైపు కాలితో తన్ని,'  ఆరోజు నీముఖం మీద తన్నిన వాడికి నేను చేసిన పరాభవం చూశావు గదా ! ఇక శాంతించు ! '  అని యేమీ ఎరుగనివాడివలే, పాకశాల వైపు అడుగులేస్తూ వెళ్లిపోయాడు, భీమసేనుడు.


ద్రౌపది చెప్పలేనంత సంతృప్తితో, అక్కడనుండి అంత:పురానికి చేరుకొని,  ' నా గంధర్వపతులు,  కామాంధుడైన కీచకుని చంపి నర్తనశాలలో పడవేశారు. ' అని పెద్దగా అరుస్తూ తెలతెలవరకుండానే ఆవార్త అందరికీ వ్యాపింపజేసింది.  


ఈ వార్తవింటూనే, దివిటీలు చేతధరించి భటులు నర్తనశాలవైపు పరుగు తీశారు. అక్కడ శిరస్సు, చేతులు, కాళ్ళు కనబడకుండా వున్న మాంసపు పిండం లాంటి ముద్దను  చూసారు.  భయంతో దూరం నుండే కీచకుని శరీరమే అని నిర్ధారణ చేసుకునే ప్రయత్నం చేయసాగారు.  ఆ విధంగా  కీచకుని అధ్యాయం ముగిసింది.


సింహబలుడు అనే నామంతో పుట్టి పెరిగి, సార్ధకనామధేయుడై, అరివీరులను గడగడలాడించిన మహాయోధుడు, తన అక్కాబావలకు  రాజ్యాధికారం వప్పజెప్పి , తాను స్వతంత్రునిగా తిరుగుతూ, విశృంఖల  కామవాంఛతో, కులస్త్రీలతో  చెలగాటమాడిన దుష్టుడి జీవితం,  నామరూపాలు లేకుండా అంతమైంది.  తరువాత తరాలవారికి, కీచకవృత్తాంతం, ఒక గుణపాఠంగా వుండాలనీ, స్త్రీలు ' నిర్భయులై,'  తిరగడానికి, అట్టి  కామపీడితులకు కీచక నామధేయం పర్యాయపదంగా వుండాలనీ, వ్యాసఃగవానుడు కీచక పాత్రను సృష్టించి భావితరాలకు హెచ్చరిక జేశాడు.


అని జనమేయునకు వైశంపాయన మహర్షి వివరించారని, శౌనకాది మహామునులకు సూతమహర్షి,  నైమిశారణ్యంలో చెప్పాడు.  కీచక మరణాంతర పరిణామాలు యెలా వున్నాయో  చూద్దాం.

   

స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: