26, అక్టోబర్ 2020, సోమవారం

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పదకొండవ శ్లోక భాష్యం - మూడవ భాగం


ఇప్పుడు నే చెప్పిన దాంట్లో రెండు పొరపాట్లున్నాయి. ఒకటి శ్రీచక్రము అంబిక నివాసమొక్కటే కాదు. అంబికే ఆ శ్రీయంత్రం. యంత్రమే నివాసస్థలమూ, నివసించే మూర్తీ కూడా! ఇక ఈ శ్రీయంత్రం అమృత సింధువు, మేరు పర్వతముల వంటి ఆవాస స్థలముకాదు. 


సుధాసింధువులోనూ, మేరు పర్వతంలోనూ కూడా శ్రీయంత్రముంటుంది. దానిపైనే చింతామణి గృహం ప్రతిష్టితమై ఉంటుంది. మనింట్లో పూజించే శ్రీయంత్రం ఎంతో చిన్నది. సుధాసముద్రంలోనూ, మేరు పర్వతంపైనా ఉన్న శ్రీచక్రములు పరిమాణంలో ఈ శ్రీయంత్రానికి లక్షల రెట్లు పెద్దవి. వాటికీ నవావర్ణలున్నాయి. ప్రతి ఆవరణలోనూ అనేక దేవతలున్నారు. అమ్మ పరివారం, పరిచారికలున్నారు. బిందువుపైన, తొమ్మిదవ ఆవరణలో అంబిక పంచ బ్రహ్మాసనంపై కూర్చుని ఉంటుంది. 


లిఖించబడిన లేక ఈ పలకపై చెక్కబడిన (Two Dimensional - 2D) శ్రీయంత్రము భూప్రస్తారమని పిలవబడుతుంది. ఆవరణలన్నీ ఒకదానికి పైగా ఒకటి చెక్కబడిన శ్రీయంత్రమునకు (3D - Three Dimensional) మేరు ప్రస్తారమని పేరు. కొన్ని ఆవరణలు ఒకదానిపై ఒకటి చెక్కబడి, మరికొన్ని ఆవరణలు భూమి ఎత్తులో ఉంటే దానిని అర్ధమేరు అంటారు. అప్పుడు పైన చెప్పినది పూర్ణమేరు. కామాక్షీ సన్నిధిలో ఆచార్యులవారు లిఖించి ప్రతిష్ఠించిన భూప్రస్తారము. మన మఠంలో పూజలో ఉన్నది పూర్ణమేరు. మాంగాడులో కామాక్షీ దేవాలయంలో అర్ధమేరు ఉన్నది.


మిగతా యంత్రములన్నీ ఆయా యంత్రముల దేవతల పేర్లతో పిలవబడుతున్నాయి. శివచక్రము, మేధాదక్షిణామూర్తి యంత్రము, షడక్షర చక్రము – ఇలా! లలితా యంత్రం మాత్రం శ్రీచక్రమని పిలవబడుతుంది. శ్రీ అంటే ఎంతో పవిత్రమైనది. పూజనీయమైనది, శుభకరమైనది అని అర్థం. అసలు కేవలం చక్రమని పిలిస్తే దానికి శ్రీచక్రమనే అర్థం. అంబికా యంత్రానికి ప్రత్యేకమైన పేరు అవసరం లేదని దీని భావం. అలాగే ఆమెను పూజించే మార్గానికి కూడా శ్రీవిద్య అని పేరు. మిగతా దేవతల పూజా పద్ధతులు వారివారి పేర్లతోనో లేక ఆ మంత్రద్రష్టల పేర్లతోనో పిలవబడుతున్నాయి. శ్రీవిద్యలో కూడా అనేక మంత్రాలున్నాయి. ఆ మంత్రాలు కూడా మొదటి అక్షరంతోనో, మంత్రద్రష్ట పేరుతోనో పిలవబడతాయి. కానీ లలితా తంత్రాన్నంతటినీ కలిపి శ్రీవిద్య అంటారు. ఆవిడ మంత్ర యంత్రాలే కాదు, ఆమె నివసించే పురానికి కూడా కైలాసమో, వైకుంఠమో అనే ప్రత్యేక నామం లేదు. దానికి శ్రీపురము లేక శ్రీనగరమన్న పేరు. ఈ పేరు చాలు – లోకజనని అయిన తల్లి ఆవాసముండే నగరమని చెప్పడనికి.


ఆమె మనకు *నిత్యశ్రీ*ని ప్రసాదిస్తుంది. ఆత్మానుభూతి అనే ఎల్లలు లేని, పోలికలేని ఆనందాన్ని ప్రసాదిస్తుంది.  అందుకే లలితా సహస్రనామంలో ఆమె మొదటిపేరు *శ్రీమాత*. తదనుగుణంగానే *శ్రీవిద్య, శ్రీచక్ర, శ్రీపుర* మనే పేర్లు.


నేను సౌందర్యలహరిలో వివరించబడిన శ్రీయంత్రాన్ని గురించి కదా వివరిస్తున్నాను. తొమ్మిది త్రికోణాలు ఒకదానినొకటి ఖండించుతూ ఆరు ఆవరణలుగా నలభై మూడు (నలభై నాలుగు) త్రికోణములుగా ఉంటాయని చెప్పాను. ఆ తొమ్మిది త్రికోణములలో నాలుగు శివ చక్రములు. ఐదు శక్తి చక్రములు. బిందువు శక్తి చక్రములలో ఒకటి, పూజచేసే భక్తునకభిముఖంగా ఈ బిందువుండాలి. శివశక్తుల అద్వైత తత్త్వాన్ని ఒకదానినొకటి పెనవేసికున్న శివశక్తి చక్రాలు తెలియజేస్తున్నాయి. అందువలన ఉద్భవించిన కోణములు, పద్మదళము, బహిఃప్రాకారములు, వాటి పరిమాణముల గురించి ఈ శ్లోకం చెబుతోంది. శ్రీవిద్యా సంబంధించిన వాఙ్మయం ఒక నవల వలెనో, ఊరికే తెలుసుకోవటానికి కాలక్షేపానికి చదివే పుస్తకంగానో మీరు చదవరాదు. ఇది గురువు చేత ఉపదేశింపబడి గోప్యంగా ఉంచదగిన మహావిద్య. విషయాన్ని పూర్తిగా వదిలి వేయరాదని నేను కోంచెంగా స్పృశించాను.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: