26, అక్టోబర్ 2020, సోమవారం

సుభాషితాలు

 ---------సుభాషితాలు-------------------

నీరధారఁ బడఁగ నీక యడ్డంబుగాఁ

గలశరంధ్ర మాఁపగాను దెలిసి

హరియుఁ గావ్యు నేత్ర మటఁ గుశాగ్రంబున

నడువ నేకనేత్రుఁ డయ్యె నతఁడు.

 

నీళ్ళధార పడకుండా శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడి ఆపేసాడు. సాక్షాత్తు విష్ణువు అయిన వామనుడు ఆ సంగతి తెలుసుకుని దర్భకొనతో పొడిచాడు. దానివలన శుక్రుడు ఒంటి కన్ను వాడు అయ్యాడు.

 

కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు

నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ

మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి

మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁ గలఁడె.

 

బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తెలుసుకున్నాడు. దేశకాలాలు తెలుసుకున్నాడు. శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు. తనకు చేటువాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికి యోగ్యమైనదిగా భావించి ఆ దాన మిచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడుంటాడా?

 

ఎడ్డెమనుష్యుఁడేమెఱుఁగు నెన్ని దినంబులు గూడియుండినన్

దొడ్డ గుణాడ్యునందుఁగల తోరపు వర్తనల్లఁబ్రజ్ఞ బే

ర్పడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుక గాకెఱుంగనే?

తెడ్డది కూరలోఁగలయ ద్రిమ్మరుచుండినైన భాస్కరా!

 

తాత్పర్యం: భాస్కరా! మూఢాత్ముడు గుణవంతుని వెంట తిరుగుచున్ననూ అతని సద్గుణములతో కూడిన నడవడికలు గుర్తించలేడు, జ్ఞాని గుర్తించగలడు. ఎలాగనగా కూరలో తిరుగుచున్న తెడ్డు ఆ రుచిని గుర్తించలేదు. కూర యొక్క రుచి నాలుక గుర్తించును.

 

సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లులుబ్ధిమానవుల్

వీరపతివ్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహీ

భారముఁదాల్పఁగా జనులు పావనమైన పరోపకార స

త్కార మెఱుంగలే రకట దాశరథీ కరుణాపయోనిధీ!

 

తాత్పర్యం: రామా! పండితులు, దయగలవారు సత్యాచారపరులు. ఉదార స్వభావులు పతివ్రతలు బ్రాహ్మణులు గోవులు వేదములు మున్నగు విశిష్ట జన్ములు భూభారము లెరుంగక సంచరించుచున్నారు. రామా! ఏమని చెప్పను, నాయందు దయ యుంచి నన్ను రక్షింపుము.

 

ధరణీనాయకు రాణియు

గురురాణియు నన్నరాణి కులకాంతను గ

న్నరమణి దను గన్నదియును

ధర నేవురు తల్లులనుచుఁదలఁపుఁ కుమారా!

 

తాత్పర్యం: ఓ కుమారా! రాజు భార్యయును, గురు భార్యయును, అన్న భార్యయును, అత్తయును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.

 

సీ. నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత

దురితజాలము లన్ని - దోలవచ్చు

నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత

బలువైన రోగముల్ - పాపవచ్చు

నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత

రిపుసంఘముల సంహ - రింపవచ్చు

నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత

దండహస్తుని బంట్ల - దరమవచ్చు

 

తే. భళిర! నే నీ మహామంత్ర - బలముచేత

దివ్య వైకుంఠ పదవి సా - ధింపవచ్చు

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!

 

 

ఱాలన్ రువ్వఁగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచునే

చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేఁ గాను,నా

శీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో

శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!         17

తా:--    అజ్ఞానియైన ఒక కిరాతకుడు పూలులేవని రాళ్ళతో పూజించినట్లు నేను చేయలేను. సిరియాళునిలాగా కుమారుని పిలిచి చంపి వంటచేసి జంగమదేవులకు పెట్టలేను. తిన్నడు లాగా కన్నులు పీకి నీకు సమర్పించలేను. ఇంక నా భక్తి గాఢమైనదని ఎలా చెప్పగలను? ఈ మాత్రము భక్తికి నీవు హృదయములో సంతోషపడినచో అదే నాకు మహాభాగ్యము.


ఉద్యమేవ హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై:   

నహి సుప్తస్య సింహస్య  ప్రవిశంతి ముఖే మృగా:

        తా:----   ప్రయత్నమూ చేసిననే కార్యములు సిద్దిన్చును. కానీ వూరికే మనోరథము వల్ల పనులు నెరవేరవు. సింహమే యైననూ వూరికే నోరుతెరచి కూచున్న జంతువులు తమంతట తాము వచ్చి  ప్రవేశించవు గదా!  

 

మన యేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః 

బంధాయ విషయాసంగి ముక్త్యై నిర్విషయం స్మృతమ్ 

      తా:--  మనస్సే బంధ మోక్షములకు కారణం మగుచున్నది , మనస్సు విషయాసక్త 

మగుచో బంధమునకును, నిర్విషయ మైనచో ముక్తినీ కారణం మగుచున్నది.

కామెంట్‌లు లేవు: