4, డిసెంబర్ 2020, శుక్రవారం

**మహాభారతము**

  **దశిక రాము**



**మహాభారతము** 

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


90 - అరణ్యపర్వం.


శ్రీకృష్ణుడు సత్యభామతో కామ్యకవనానికి వేంచేయగా, ధర్మరాజు మొదలైనవారు వారితో ప్రియ సంభాషణలలో మునిగితేలుతుండగా, మార్కండేయమహర్షి వేంచేశారు.


మార్కండేయుని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించిన పిమ్మట, ధర్మరాజు ' మార్కండేయ మహర్షీ ! మీ రాక మాకెంతో ఆహ్లాదం కలిగించింది. మీ అమృతవాక్కులతో మమ్ములను కృతార్థులను చెయ్యండి. మా పరివారమంతా మీరు చెప్పే విషయాలు వినడానికి వుత్సాహం చూపిస్తున్నారు. ' అని వినయంగా అడిగాడు. శ్రీకృష్ణుడు కూడా, 

' సత్పురుషుల జీవితగాధలు, పతివ్రతామణుల జీవనవిధానము, ఋషుల దినచర్య, మొదలైన సనాతన విషయాలను మీ మధురమైన వాక్కుద్వారా తెలియజేయండి.' అన్నాడు.


శ్రీకృష్ణుడు కూడా ఆవిధంగా అడుగగానే, మార్కండేయుని హృదయం ఆనందంతో నిండిపోయింది. ' భగవంతునికి తనభక్తుల పలుకులు అంతతియ్యగా అనిపిస్తాయా 'అని తన అదృష్టానికి పొంగిపోయాడు. అదే సమయంలో నారదమహర్షి కూడా అక్కడికి అరుదెంచారు.


' మీకు కావలసినన్ని విషయాలు విపులంగా చెబుతాను, మీరు క్షణకాలం నిశ్శబ్దంగా వుండండి. ' అన్నాడు చెప్పడానికి వుపక్రమిస్తూ, మార్కండేయుడు.  


' క్షణకాలం నిశ్శబ్దంగా వుంటే, అన్ని విషయాలు క్షణకాలంలో విపులంగా యెలా జెబుతాడు యీమహర్షి. ' అని అందరూ ఆశ్చర్యపోయి. మహర్షి పలుకులలో అమృతం గ్రోలుతూ వుంటే, యెంత విపులమైన విషయమైనా క్షణమాత్రంలో విన్నట్లే వుంటుంది కదా ! ' అని వారిలోవారు ఆనందబడ్డారు.


మహర్షి వాక్ప్రవాహానికి అడ్డుపడడం యిష్టంలేక నారదమహర్షి కూడా సెలవు తీసుకున్నారు. మార్కండేయమహర్షి ధర్మరాజుతో, ' ముందుగా నీకు సందేహాలు యేమైనా వుంటే అడుగు. ' అని అన్నారు. దానికి ధర్మరాజు, ' మహాత్మా ! నాకు ఎల్లప్పుడూ ఒకటే సందేహం కలుగుతూ వుంటుంది. ఎవరెన్ని సార్లు విపులీకరించి చెప్పినా కూడా . నేను ధర్మమార్గం అనుసరిస్తూ కౌరవులచేత వంచింపబడి తమ్ములతో, భార్యతో అడవులలో కష్టాలు పడుతున్నాను. దుష్టచింతనతో, అనేక అకృత్యాలు చేసిన దుర్యోధనుడు తన సోదరులతో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. కర్మఫలాలు ఈశ్వరుడు యెలా నిర్ణయిస్తాడు. ఎప్పుడు జీవుడు వాటిని అనుభవిస్తాడు. ఇహలోకంలోనా ? పరలోకంలోనా ! ' అని అడిగాడు.


దానికి మహర్షి, ' ధర్మరాజా ! సృష్టి మొదటిలో, బ్రహ్మదేవుడు అన్ని జీవులకు, నిర్మలమైన, నిష్కల్మషమైన మనస్సును బుద్ధిని ప్రసాదించి, ధర్మమార్గము, జ్ఞాన మార్గము జతచేసి భూమిపైకి పంపాడు. అప్పుడు జీవులందరూ ధర్మ పరాయణులుగా, సత్యనిష్ఠతో వుండేవారు. వారు బ్రహ్మతేజస్సుతో, దేవతలవలె ఆకాశంలో విహరించే వారు. భయమనేది తెలీకుండా, క్రమజీవనం గడిపేవారు. '


' కాలక్రమేణా మానవుల కోర్కెలు బలీయమై, కామక్రోధాలకు వశులైనారు. కావలసినవి పొందడంలో అనేక అధర్మమార్గాలు అనుసరిస్తూ అబద్ధాలు చెప్పడం, చేయవలసిన విధులు నిర్వర్తించక పోవడం, జ్ఞానమార్గాన్ని ప్రక్కన పెట్టడం జరిగింది. దానితో వారు వచ్చిన మార్గంపై జ్ఞాపకశక్తి కోల్పోయి, తమ ఉత్కృష్టమైన మానవజన్మను గురించి తెలుసుకోలేక, ధారణాశక్తి సన్నగిల్లి, పరస్పర వైరంతో జీవితాలు గడుపుతున్నారు. ఫలితంగా దేహసంబంధమైన, మనస్సుకు సంబంధించిన రోగములు ప్రబలి, ఆయు:ప్రమాణం తగ్గిపోతున్నది. '


' ఆవిధంగా మానవులు చేసిన శుభాశుభములు వారి అంత:కరణములలో వుండిపోయి, మరియొక దేహం ధరించిన తరువాత, వాసనల రూపంలో ఆ నూతనదేహాన్ని వెన్నంటి వస్తాయి. వాటి ఫలితాలే, ప్రస్తుతం జీవుడు అనుభవించే సుఖదుఃఖాలు. ధర్మరాజా ! కొందరు ఈ లోకంలో చెడు యెక్కువచేసినా, యేకొద్ది పూర్వజన్మ పుణ్యం వలననో, యీ జన్మలో చేసిన కొద్దిపుణ్యకార్యముల వలననో, ప్రస్తుత జన్మలో సుఖాలు అనుభవిస్తారు. ఐతే, యీదేహం వీడిన తరువాత, పుణ్యశేషం లేకుండుట వలన ఆ జీవుడు చెప్ప నలవిగాని బాధలు పడతాడు. '


' మరికొందరు, ఈజన్మలో పుణ్యకార్యములు, కఠినమైన తపస్సు ఆచరిస్తూ, విపరీతమైన కష్టాలు అనుభవించి, జీవిత చరమాంకంలో, మరణానంతరము సుఖంగా వుంటారు. ధర్మరాజా ! మీరంతా రెండవకోవలోకి వస్తారు. మీకూ మంచిరోజులు వస్తాయి. ' అని మార్కండేయమహర్షి ఓదార్చాడు. ధర్మరాజు ఆ తరువాత, దానధర్మాల గొప్పదనాన్ని, మహాత్ముల నియమనిష్టలను, రాజధర్మాన్ని, మోక్షధర్మాన్ని, యిలా అనేక విషయాలను గూర్చి ప్రశ్నించి తెలుసుకున్నాడు. 


అదే విధంగా, మహర్షి, యుగధర్మాల గురించి వివరిస్తూ, కలియుగ ప్రభావాన్ని చెప్పసాగాడు : 

కృతయుగం ప్రమాణం 4800 దివ్యసంవత్సరాలు, త్రేతాయుగం 3600 దివ్య సంవత్సరాలు, ద్వాపరయుగం 2400 దివ్యసంవత్సరాలు, కలియుగం 1200 దివ్యసంవత్సరాలు. ఆ విధంగా కలియుగం పూర్తికాగానే, మరల కృతయుగం ప్రారంభమవుతూ, కాలభ్రమణం జరుగుతూ ఉంటుంది. దివ్య సంవత్సరమనగా, మానవ ప్రమాణంలో 360 సంవత్సరాలు.  


పై నాలుగు యుగాలూ కలిపి, 12000 దివ్యసంవత్సరాలు. దీనిని ఒక చతుర్యుగము అంటారు. ఇలాంటి వేయి చతుర్యుగాలు గడిస్తే, బ్రహ్మకు ఒకపగలు గడుస్తుంది. బ్రహ్మకు పగలు గడవగానే, ప్రళయకాలం వస్తుంది. ఆ తరువాత,  అంతా పెంజీకటి.  


కలియుగంలో, ధర్మహాని యెక్కువగా వుంటుంది. ఆచార వ్యవహారాలపై యెవరికీ ఆసక్తి వుండదు. కలియుగాంతంలో, ధర్మం మొత్తం గాడితప్పే ప్రమాదం వున్నది. బ్రాహ్మణులు యజ్ఞ యాగాదులు వదిలివేస్తారు. నిషిద్ధ వస్తువులు భక్ష్య భోజ్యాలుగా గ్రహిస్తారు. జపతపాదులు మర్చిపోతారు. వేదపాఠశాలలు కనుమరుగవుతాయి. 


ప్రజలలో యెక్కువమంది బలహీనులు, పరాక్రమం లేనివారు వుంటారు. మరుగుజ్జులు, అల్పాయుష్కులు పుడతారు. పండితులను గౌరవించరు. అసభ్య సంబోధనలతో వ్యవహరిస్తారు. అన్నాన్ని అమ్ముకుంటారు. ఇష్టాగోష్టులలో, వైదిక విషయాలకు బదులు, కామ ప్రసంగాలు, పనికిరాని విషయాలు దొర్లుతాయి. పరాన్నభుక్కులు యెక్కువగా వుంటారు. ధనికులు మదాంధులై వుంటారు. విషయభోగాలపై యెక్కువ మక్కువ కలిగి వుంటారు. ఫలపుష్పాలు రసహీనంగా వుంటాయి. చెట్లపై ఉత్తమజాతి పక్షులు కనిపింపవు. '


అని యీవిధంగా కలియుగ లక్షణాలు వివరిస్తున్నారు మార్కండేయ మహర్షి ధర్మరాజుకూ అతని పరివారానికి అని జనమేజయునకు వైశంపాయనుడు చెప్పినట్లుగా, శౌనకాది మహామునులకు సూతులవారు నైమిశారణ్యం లో చెబుతూ వున్నారు. 


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: