4, డిసెంబర్ 2020, శుక్రవారం

శాక్తేయ తపస్వి

  శాక్తేయ తపస్వి

మహాత్మా శ్రీ అయిలావఝుల వేంకటరమణయ్య

ద్వాదశాంతేచిదాకాశే, శివశక్త్యాత్మకం గురుం

పరం తేజోమయం ధ్యాయే ద్భోగమోక్ష ఫలాప్తయే

ఓం నమః శ్రీ గురుదేవాయ, పరమపురుషాయ,

సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ,

సర్వమంత్రదోషచ్చేదనాయ, త్రైలోక్యం వశమానయ స్వాహా !

———————————————————————————————–

భారతదేశం పుణ్యభూమి. ధర్మస్థాపన కొరకు ఎందరో మహానుభావులు, అవతారపురుషులు, యోగులు, మహాత్ములెందరో ఈ భూమిపై జన్మించారు. భగవదంశభూతులైన మహా పురుషులు, ఆర్తులను అజ్ఞానులను మూర్ఖులను, మూడులను తమ కారుణ్య దృష్టితో ఉద్ధరిస్తారు. మంత్రయోగంలో సిద్ధిపొంది ఉపాస్య దేవతానుగ్రహంతో తమనాశ్రయించిన భక్తుల సమస్యలను తొలగించి, మేలు చేసిన మహానుభావులెందరో ఉన్నారు. కానీ శక్తిని ఉపాసించి, శాక్తమును సర్వావ్యాప్తము చేస్తూ జాతిని శక్తిమంతము చేయుటకు తమ తపస్సును, జీవితాన్ని అంకితం చేసిన అయిలావఝుల వేంకటరమణయ్యగారు.

జనన వృత్తాంతము : భారద్వాజ గోత్రీకులు శాక్తేయులు, శ్రీ విద్యానందనాధులు కీ.శే. బ్ర.వే. అయిలావఝుల సుబ్రహ్మణ్య శివకామమ్మలను పురాణదంపతులకు కలిగిన ద్వితీయ సంతానము. ఆంధ్ర రాష్ట్రమందలి సింహపురి ( నెల్లూరు ) పట్టణమునకు సమీపానగల పాతకోడురు వీరి జన్మస్థలము. వీరు పింగళి నామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ షష్టీ మంగళవారం ( తేది 2.10.1917 )నాడు జన్మించారు. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వేదాంత, జ్యోతిష్య,శాక్త విద్యలందు అపార విజ్ఞానం సంపాదించి ఆ ప్రాంత వాసులందరికీ ఆదర్శమూర్తిగా మార్గదర్శనం చేస్తూ దేవతాప్రతిష్టలతో పాటు శతచండీయాగాలు నిర్వహిస్తూ పెద్దశాస్త్రులని పేరు గడించారు. సింహపురి ప్రాంతీయులు నాటితరం వాళ్ళేకాక నేటితరం వాళ్ళు కూడా వారి విద్యత్తును, మహిమలను మననం చేసుకుంటున్నారంటే వారెంతో గోప్పవరో స్పష్టమవుతుంది. చండీ యాగాలలో ఆ ప్రాంతవాసులకు శ్రీ చాముండేశ్వరీమాతను దర్శనం చేయించారని ప్రతీతి. వీరి వంశీకులైన శ్రీ అప్పేశ్వర శాస్త్రిగారు “ నవద్వీప పండితుడు “.

శ్రీ వేంకటరమణయ్య తమ బాల్యం గోకులంలో శ్రీకృష్ణుని బాల్యం వలె గడించిందని అనేకమార్లు చెప్పుకునేవారు. పల్లెటూరు, పచ్చని పంటపొలాలు, పాడిపంటలు, కొబ్బరితోటలతో చక్కని వీధులతో అలరారుతున్న పాతకోడురు గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా స్వచమైన, చక్కని పాలు మీగడ పెరుగు వీరికిచ్చేవారట. టీ, కాఫీల వ్యవహారమే లేదట. వీరి అగ్రజుడు సుబ్బరాయశాస్ర్తిగారు, మరో సోదరుడు మంచి ఫోటోగ్రాఫర్. సుబ్బరాయ శాస్త్రిగారు వేదవిద్య నభ్యసించి జ్యోతిష్యం, ముహుర్తభాగము క్షుణ్ణంగా అధ్యాయనము చేసిన మేధావి. ప్రశ్న భాగంలో మంచి ప్రావీణ్యత సంపాదించి ఆ ప్రాంతవసులందరికి ఆరాధ్యమైనాడు. వారు మంచి వేణు వద్యాకులు. శ్రీ రమణయ్యగారు మాత్రం ఆలాజాలంగా గడుపుతూ తోటి మిత్రులతో పాటు కర్రసాము నేర్చుకొని బాలలలందరకూ నాయకుడుగా గడిపాడు. గ్రామీణ క్రీడయైన కబడ్డీలో చంపియన్ గా పేరొందారు. ఆయన చదువుపై అంత శ్రద్ధ కనబరిచేవారుకాదు. తండ్రిగారితో కాలినడకన ఎంతదూరమైన వెళ్ళేవారు. తండ్రి నిర్వహించే వైదిక, ధార్మిక ఉపచార కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఈ క్రమంలో ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తూ సందేహాలు తీర్చుకునేవారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా జ్ఞప్తియుంచుకుని తండ్రిగారిచె ఏకసంధాగ్రాహి అనిపించుకున్నారు. విభవ నామ సంవత్సరం వైశాఖ మాసంలో వీరికి ఉపనయన సంస్కారం జరిగింది.

శ్రీ వేంకటరమణయ్యగారు ప్రత్యేకించి ఏ పాఠశాలలో క్రమంగా విద్యనభ్యసించలేదు. కానీ వీరి చిన్నాన్న శ్రీ ఆదిశేషయ్యగారు పంచసూక్తాలు, నమక చమకాలు పూర్తి చేయించి అమరంలో శ్లోకాలను వల్లే వేయించేటప్పుడు ఉచ్చారణ సరిగా లేకపోవడం వల్ల దండింపబడ్డారు. దండనకు భయపడి ఎవరికీ చెప్పకుండా పాతకోడురు గ్రామదేవత ఆలయానికి వెళ్లి ఒక రాత్రి మొత్తం ఆ దేవాలయంలోనే గడిపి వారి వంశీకుల ఇలవేల్పు గ్రామదేవత ముక్కంటమ్మ సన్నిధిలో గడిపినట్లు, ఆ సమయంలోనే దేవ్యానుగ్రహం కలిగినట్లు వారు చెప్పేవారు. “ ఇవ్వాళ పుట్టి, రేపు చచ్చేవారు నా గురువు కాదు. నా గురువు మా ఇంటి ఇలవేల్పు శ్రీ ముక్కంటమ్మ “ అని అనేకమార్లు చెప్పారు.

శ్రీ పల్లెపూర్ణ ప్రజ్ఞాచార్యుల వద్ద వ్యాకరణ శాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని, కవిరాక్షస బిరుదాంకితులు, కర్నూలు నివాసి, ఆర్ఎంపి వైద్యులు శ్రీ పుల్లాపంతుల వేంకటరమణయ్యగారి వద్ద అవధాన విద్యనూ నేర్చుకున్నారు. గద్వాల సంస్థానంలో అవధానం చేసి, రాణిగారి మెప్పును పొందారు. ఆ తరువాత శ్రీ తిరుపతి వెంకటకవుల వలె ఒంగోలు నివాసి, కవి నరసింహ గారితో కలిసి అనేక అవధానాలు చేశారు. యువ అవధానులను ప్రోత్సహిస్తూ కవితా పిపాస కలిగిన వారందరినీ అవధానం చేయాలనీ ప్రోత్సహించేవాడు.

మాతామహుల నుండి పొందిన ఆయుర్వేద విద్యనూ వైద్యునిగా జీవితాతం వరకు ప్రజలందరికీ సేవ చేయడానికి ఉపయోగించారు. రసపాషాణ జాతులను పుటం పెట్టి అనేక దీర్ఘవ్యాదులకు ఔషధములను తయారుచేసి ఉచితంగా అవసరమైనవారికి పంచిపెట్టటం వారికీ అమితానందకరమైన విషయం. దేశ పర్యటనలో అనేకమంది గిరిజనులతో ఏర్పడిన పరిచయం వల్ల రకరకాల మూలికలు, వాటి విలువలు తెలుసుకుని అవకాశం వచ్చినపుడు వినియోగించేవారు. ఉదాహరణకు తిరుపతి సమీపంలోని తలకోన అడవిలో ఒక మొక్క ఆకును భుజిస్తే ఆరు మసాల వరకు ఆకలిదప్పికలుండవాని పూర్వపు మునులందరూ ఇటువంటి చిట్కాలను ఉపయోగింఛి నిర్విఘ్నంగా తపస్సు చేసుకోనేవారని తెలియజేసారు. నేల ఉసిరికాయ చిన్న పిల్లలకొచ్చే కామెర్ల వ్యాధిని పోగోడుతుందని చెప్పేవారు.

వీరి భూతవైద్యం చూడముచ్చటగా ఉండేది. నాకున్న అనుభవం దృష్ట్యా భూతవైద్యం అంటే నిమ్మకాయలు, మిరపకాయలు, వేపాకులు, జంతుబలులతో జరిపే తంతుగా భావించేవాన్ని. కానీ ఇవేవీ భూతవైద్యానికి పనికిరావని వేంకటరమణయ్య గారి ద్వారా తెలుసుకున్నాను. భాదితులను ముందు కూర్చోబెట్టుకొని ధూమపానం చేస్తూ మామూలు మాటలతో భాదితులను ప్రశ్నిస్తూ వారిలో ఆవాహనమై ఉన్న భూత ప్రేతలను పలికిస్తూ భయపెడుతూ ఆ దేహాన్ని వదిలి వెళ్ళండని ఆదేశిస్తూ జనం మధ్యే వేంకటరమణయ్య గారు భూతవైద్యం చేసేవారు.

కవిగా, అవధానిగా, ఆయుర్వేద వైద్యుడిగా, జ్యోతిష్యుడుగా, ములికావైద్యుడిగా అనేక విధాలుగా సేవలందిస్తున్నా వారి జీవితంలో ఏదో సాధించాలనే కోరిక ఉండేది. దీని కోసం సుమారు రెండు దశాబ్ధాలుగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు దూరంగా కనబడకుండా వెళ్లి తన 35వ ఏట ఇంటికి తిరిగివచ్చారు. ఈ మధ్య కాలంలో వారు పొందిన జ్ఞాన సంపద అమూల్యం. రెండు దశాబ్ధాల ఒంటరి జీవితంలో పట్టణాలు, పల్లెలు, అడవులు, నదులు, సముద్రాలు ఒకటేమిటి ఎన్నో, ఎన్నెన్నో వింతలను చూశారు. ఒక సంవత్సర కాలం శ్రీశైల క్షేత్రంలో నివసిస్తూ ప్రతిరోజు వేకువజామునే లేచి మట్టికుండలతో పాతాలగంగకు వెళ్లి స్నానం చేసి తడిగుడ్డలతో ఆ కుండతో నీళ్ళు తీసుకువచ్చి శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారలను అభిషేకించేవారు. మిగతా సమయంలో గిరిజనుల సహకారంతో అడవంతా తిరుగుతూ సిద్ధులను, మునులను, యోగులను, మూలికలను కనుగొంటూ వారి ఆశీర్వాదాలు, వారి యోగ విద్యలను శ్రీ ముక్కంటమ్మ దేవికృప వల్ల పొందగలిగానని చెప్పారు. నవదుర్గలను, వింధ్యాచల అడవులను, ఆ అడవులలో సంచరిస్తున్న తపోధనులను చూచి వారి ఆశీస్సులను కూడా పొందారు. శ్రీశైలంలో ప్రస్తుతం మనం చూస్తున్న భ్రమరాంబా దేవాలయపు దిగువ భాగాన అసలైన మూలవిరాట్ ఉన్నదని, ఆమె ద్విభుజ అని ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో జాంబియా ఉన్నదని, ఆమె కూడా వీరిని ఆశీర్వదినచిందని శతచండీ యాగ సందర్భాలలో సభ్యులకు, భక్తులకు ఆనాటి వారి అనుభవాలను, కష్టసుఖాలను వెల్లడించేవారు. వారి మాటల్లో శ్రీశైల భ్రమరాంబికానే నవదుర్గగా స్తుతించేవారు.

“ క్రూరాతి క్రూర విఖ్యాతా శ్రీశైల భ్రమరాంబికా |

భ్రమంరాతీతి లోకేస్మిన్ జ్ఞానదా ముక్తిదా ప్రదా || “

దేశ సంచారంలో విశేషానుభవాలను పొంది అపారమైన జ్ఞానసంపత్తిని సంపాదించి లోకోద్దరనకై తన 30 వసంతాల పైచిలుకు వయస్సులో తిరిగి లౌకిక ప్రపంచంలోకి వచ్చారు. ఈ ద్విదశాబ్దకాలంలో వారి బంధువులు వీరి ఆచూకి కోసం ప్రయత్నించమని వీరి తండ్రిగారితో చెప్పినపుడు వాడు తప్పక తిరిగివచ్చి ప్రజాశ్రేయస్సుకు పాటుపడతాడని ఆయన బంధువులకు చెప్పేవారు.

దేశ పర్యటన ముగుంచుకొని వచ్చి అన్నపూర్ణను పోలిన సుబ్బరత్నం అనే తమ దగ్గర బంధువుల అమ్మాయిని వివాహమాడారు. కొంతకాలం నెల్లూరులో గడిపి ఆ తరువాత భాగ్యనగరనికి మకాం మార్చారు. ఎవరివద్దా తన ప్రతిభాపాటవాలు బహిర్గతపరచకుండా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రాంతంలో శక్తి అన్నా, శక్తి పూజలన్నా జంకుతారనే విషయాన్ని పసిగట్టి ఫీల్ ఖానలోని బాలచంద్రయ్య దేవాలయ ధర్మకర్త శ్రీ చంచలం మాణిక్యశర్మగారిని తానే స్వయంగా పరిచయం చేసుకుని భవిష్యత్తులో తాను చేయబోయే సేవా కార్యక్రమాలకు పునాది నేర్పచుకున్నారు.

శాక్తాన్ని సర్వవ్యాపితం చేయాలనే ఏకైక లక్ష్యంతో 1968 జనవరి 22న భాగ్యనగరంలోని ఫీల్ ఖానా బస్తీలో శ్రీ బాలచంద్రయ్య దేవాలయంలో శ్రీ చంచల మాణిక్యశర్మగారి ఆధ్యక్షతన శ్రీ చాముండేశ్వరీ సేవాసమితి అనే సంస్థను స్థాపించి ప్రతినెలా పాడ్యమి నుండి అమావాస్యలోగా ఏదో ఒక తిథియందు భారతదేశంలోని ఏ ప్రాంతమైనా సమావేశం చేయాలని సంకల్పించి ఆ తరువాత వారి జీవితకాలంలో సుమారు 250 సమావేశాలు

నిర్వహించారు. సుమారు 22 సంవత్సరాలు సమితి సమావేశాలు వారి నేతృత్వంలో జరిగి లక్షలాది మంది ప్రజలకు అన్నదానం కూడా చేశారు. ఈ 22 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరపు ఆరంభ సమావేశం శతచండీ యాగంతో ఐదు రోజుల కార్యక్రమాన్ని జరిపించి ప్రజలందరినీ ఆ దేవికృపకు పాత్రుల్ని చేశారు. ఆసేతు హిమాచల పర్యంతం సమావేశ కార్యక్రమాలను నెరవేరుస్తూ ఎంతోమంది కుగ్రామ వాసులకు యాత్రాఫలసిద్ధి కలిగింప చేసిన మహనీయుడు శ్రీ వేంకటరమణయ్యగారు. వారి తరవాత కాలంలో కూడా వారి కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అధ్వర్యంలో సమావేశాలు సాగుతున్నాయి. 467వ సమావేశం శ్రీ మహా రేణుకా ( ఎల్లమ్మ ) దేవాలయం సిద్దిపేటలో 2005 సెప్టెంబర్ 18న జరిగింది.

“ అందరికీ దేవుడు కావాలి, దేవునికి అందరూ కావాలి “ అనేది శ్రీ వేంకటరమణయ్యగారి ఆంతర్యం. ప్రథమంగా శ్రీ చాముండేశ్వరీ సేవాసమితి నిర్వహించిన కార్యక్రమం 3వ సమావేశం తిరుపతి సమీపాన గల తొండవాడయందు ఐదు రోజుల కార్యక్రమం తెలంగాణ ప్రాంతంలో చాముండేశ్వరీ సేవాసమితికి గుర్తింపు తెచ్చిన సమావేశం.

బాలావారహి రాజశ్యామలా సహిత మహాత్రిపురసుందరీ ప్రతిష్ట చేశారు. ఐదు రోజుల కార్యక్రమం ఇది. ఫీలఖానా బస్తీ బాలచంద్రయ్య దేవాలయ ముందుభాగపు రోడ్లన్నీ మామూలు జనాన్ని రాకుండా రోడ్డు బంధించి వేశారు. కేవలం “ ఆశ్వపూర్వాం రథ మధ్యాం-హస్తినాథ ప్రభోదినీం “కు అనువుగా కార్యక్రమ నిర్వహణ జరిగింది.

మెదక్ జిల్లాలోని ఆనాటి ప్రముఖులు, వేదపండితులు కీ.వే. బ్రహ్మశ్రే ఆందోల్ రామయ్యగారు, వెల్దుర్తి మల్లయ్యగారి వంటి దిగ్గజాలతో వైదిక కార్యక్రమం. షోడశ కన్యాపూజ- వేలాదిమందికి షడ్రశోపేతమైన భోజన వితరణ. 1977 జనవరిలో ఆలంపూర్ జోగుళాంబ సన్నిదిలో వీరు లక్షదీపోత్సవం నిర్వహించారు. అంతేకాక అక్కడ జరిగే ప్రతి దైవిక కార్యక్రమానికి అధ్యక్ష ఉపాధ్యక్షులుగా శ్రీశైల భ్రమరాంబను, ఆలంపూర్ జోగుళాంబలను నియమించుకొని ప్రప్రథమంగా వారి దగ్గరకు వెళ్లి వారి హస్తాలకు కంకణ ధారణ చేసి వచ్చేవారు. కుకట్ పల్లిలో శ్రీ భువనేశ్వరీ మాత, హైదరాబాద్ పాతబస్తీలో శ్రీ భూలక్ష్మీ మాత, కామారెడ్డి పేట వద్ద శ్రీ మహామంగళగౌరి తేదీ 1976 మర్చి 21న సిద్దిపేటలో శ్రీ మహా రేణుకా ( ఎల్లమ్మ ), తేదీ 1983 జనవరి 22న శ్రీ మహాదేవీ చాముండేశ్వరి ప్రతిష్టలు నిర్వహించారు. 1985లో చిట్కుల్ చాముండేశ్వరీ సన్నిధానంలో లక్షదీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

మానవజాతి అంతా అల్పాయుష్కులు, మందబుద్ధులు కాబట్టి సూక్ష్మంలో మోక్షాన్ని అన్వేషించాలి అనేవారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా జన్మించిన మహనీయులు మొదలుకొని సాదారణ మనిషి వరకు మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం అసాధ్యమనేవారు. కానీ మనం చేసే ఉపాసన మంత్రం ఉచ్చ్వాస నిశ్వాసాలతో మమేకం కావాలి. దీనికై ప్రత్యేక సమయాన్ని నిర్ణయించుకుంటే

“ సూర్యోదయం సమారభ్య యాత్సూర్యో దయావధి | తావత్ జప్త్వా నిరా తంకో సర్వసిద్దీశ్వరో భవేత్ “ అనే సూత్రానికి అనుగుణంగా సూర్యోదయం మొదలుకుని మళ్ళీ సూర్యోదయం వరకు పుణ్యకాలం కాబట్టి నీ ఉపాసనా దేవతను, మంత్రన్నీ ఉపసిస్తే తప్పక మంచి కలుగుతుందని శ్రీ రమణయ్యగారు భక్తులను ఆదేశిచారు. ఆచారమే బందీఖానాలోకి నెట్టకుండా అనాచారమనే ఊబిలో కూరుకుపోకుండా స్వేచ్ఛగా ఉపాసనా కార్యక్రమాన్ని కొనసాగించాలనేవారు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. ఉపసనకు గణనం అవసరం లేదనేవారు.

శాక్తానికి గల ఒకే ఒక ఆచారం పరస్త్రీ విముఖత. ప్రతి స్త్రీలో తన ఉపాస్య దేవతను చూడగలిగే ప్రయత్నం చేయాలనీ చెప్పేవారు. నడుస్తూ ప్రయాణిస్తూ కూర్చుంటూ రకరకాల కార్యక్రమాలు కొనసాగిస్తూ నిరంతరం జపం చేయడానికి ప్రయత్నిస్తే, ఉచ్చ్వాస నిశ్వాసాలతో కూడా జప కార్యక్రమం మమేకమై దివ్యానుభూతిని పొందే అదృష్టం కలుగుతుందని చెప్పేవారు. ప్రతి వ్యక్తి శక్తి సంపన్నుడు కావాలి. అప్పుడే యావద్దేశం శక్తిసంపన్నమవుతుంది. కాబట్టి శక్తిని ఆరాధించడం అందరికీ ముఖ్యమే. దేవుడు లేక దేవత పవిత్రమైనవారు. పవిత్రమైన వ్యక్తులు మరి ఏ ఇతర వ్యక్తులకు లేదా జీవులకు అపకారం చేయరు. అపకారం చేసే వ్యక్తిత్వం దైవత్వంతో సమానం కాదు. కాబట్టి శక్తిని ఏ పద్ధతిలోనైన ఆరాధించవచ్చు. శక్తి ఉపసనం సహజంగా వామాచారమని, దక్షిణాచారమని రెండు విధాలు. వేంకటరమణయ్యగారి అభిప్రాయం ప్రకారం వామాచారమన్ని జ్ఞానాకాండ అని, శారీరకంగా దక్షిణాచారం ఆచరణీయమని వారనేక సభలు, సమావేశాలలో చెప్పేవారు.

వేంకటరమణయ్యగారి జీవన విధానం నల్లేరుపై బండి నడక కాదు.జీవిత గమనంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవిత లక్ష్యం వైపు మాత్రమే ప్రయాణిస్తూ ఎంతోమంది నాస్తికులను తన వాక్ శుద్ధి ద్వారా ప్రేమ మనస్సుతో ఆస్తికులుగా మార్చిన మహనీయ వ్యక్తిత్వం ఆయనది. కీర్తి ప్రతిష్టలకు, ధనానికి, అధికారానికి స్వార్ధచింతనకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని అద్భుత వ్యక్తిత్వం. ఎన్నో మహత్తర కార్యక్రమాలు జరిగాయనే దర్పంగానీ, గర్వంగానీ వారి మాటల్లో గానీ, చేతల్లో గానీ కనపడేది కాదు. పిల్లలతో పిల్లవాడిగా, పెద్దలతో పెద్దవాడిగా, విజ్ఞులతో విజ్ఞునిగా కలిసిపోయే బహుముఖ ప్రజ్ఞా వ్యక్తిత్వం వారిది.

ఎటువంటి మనస్తత్వపు వ్యక్తులనైనా ఒక్క ప్రేమతత్వం ద్వారా మాత్రమే ఆకట్టుకోగలమని, గురువు అనే వ్యక్తి ఒక్క ఈశ్వరుడు మాత్రమేనని, మిగతావాళ్ళంతా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోనేవరమని మాత్రమేనని వారి నిశ్చితాభిప్రాయం. దైవశక్తిని లోకకళ్యాణర్దానికే వినియోగించాలి కానీ స్వార్ధానికి కాదని, అపకారికి ఉపకారం చేయాలనే స్వభావం ఉండాలని, మనం ధరించే దుస్తులకంటే భుజించే ఆహారం కంటే మనస్సు పవిత్రంగా ఉండాలని వారి ఆదేశం, అభిమతం. శ్రీ వేంకటరమణయ్యగారు 1988 జనవరి 31న పరాశక్తిలో లీనమయ్యారు.

కామెంట్‌లు లేవు: