4, డిసెంబర్ 2020, శుక్రవారం

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏


పరి పరి ద్రోవలన్ దిరిగిన పాదుక

         తావక  భ్రూమధ్యతలము నిలిచె

నంగిలిం  దాకిన యెంగిలి నీరమే

        యభిషేకజలమయ్యె నరయ నీకు

కొంత భక్షించంగ కొఱికినమాంసము

        విశ్వేశ ! నీకు నైవేద్యమయ్యె

కాననంబుల దిర్గు కఱకు కిరాతుడు

        పరమ పావన ముఖ్యభక్తుడయ్యె

ఏమి యీ చిత్ర మరయంగ వింత గాదె ! !

భక్తికిని సాధ్య మవకుండు  శక్తి గలదె !

భక్త సులభుండు నందరిన్  పరమ శివుడె

ముక్తి సమకూరు నెప్పుడు భక్తి వలనె !        63 #



భక్త మార్కండేయపరిరక్షణమువేళ

            ధర్మజు నెడదపై తన్ని తీవు

రజతాద్రి పాషాణ  రాపిడి యందున

            నిరతంబు దిరుగుచున్ నిలుతు వీవు

సుర శిర మణిమయ శోభితమకుటాల

           భూరి ఘట్టన బాధ పొందె దీవు

సర్వ కార్యములందు సరిగిడు రీతిలో

           పరితాప మొనగూరి బాధ గలిగె

పరమ కోమల మగు నీదు పాదయుగళి 

కందిపోయెను మెండుగా  గరళకంఠ!

భవ్య మచ్చిత్త మణిమయ పాదుకలను

ధారణము సేసి తిరుగుము  ధన్యు నౌదు     64#



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: