4, డిసెంబర్ 2020, శుక్రవారం

*శ్రీమద్భాగవతము**

  **దశిక రాము**


*

*శ్రీమద్భాగవతము**

 తృతీయ స్కంధం -26


వరహావతారుని ఎదిరించుట


అలా నారదమహర్షి చెప్పగా, హిరణ్యాక్షుడు అగ్నిహోత్రంలా మండిపడ్డాడు. కమలలోచనుడైన విష్ణువును ఎదిరించా లని ఉత్సాహపడ్డాడు. ముల్లోకాలకు భయం కలిగించేలా, తన భుజబలాన్ని ప్రదర్శించుతూ, పెద్ద గదను చేతబట్టి, అతిశయించిన తేజస్సుతో ఆ మహా సముద్రగర్భంలోనికి అతి వేగంగా వెళ్ళాడు.అలా వెళ్ళి సముద్ర మధ్యభాగంలో...హిరణ్యాక్షుడు తన ఎదుట దట్టమైన కోరలు కలిగి, దేవతలలో శ్రేష్ఠుడై, భూభారాన్ని మోయడానికి సమర్థుడై, యజ్ఞమయమై, మేఘంలాగా నల్లగా ఉన్న ఆది వరాహమూర్తిని వీక్షించాడు.ఆ సమయంలో వరాహరూపంలో ఉన్న హరి...కమలములవంటి తన కన్నుల కాంతులను ప్రసరింప జేస్తూ, తన చూపుతో ఆ హిరణ్యాక్షుని దేహకాంతిని వెంటనే నశింపజేశాడు.ఇంకా ఆ ఆదివరాహం అడ్డులేని శౌర్యంతో నిరాటంకంగా విహరిస్తూ...కొంతసేపు తుదా మొదలూ ఏకమై ముక్కలయ్యేటట్లు కులపర్వతాలను తన ముట్టెతో కూలదోస్తూ, కొంతసేపు బ్రహ్మాండభాండం పగిలి చిల్లులుపడే విధంగా తన కొమ్ములతో చిమ్ముతూ, కొంతసేపు సప్తసముద్రాలు బురదలై ఇంకిపోయే విధంగా తన గిట్టలతో మట్టగిస్తూ, కొంతసేపు చంద్రుడూ సూర్యుడూ ఒకమూలకు తోసుకుపోయేటట్లు తన పొట్టితోకను త్రిప్పుతూ...తిరుగుతూ, కుప్పించి దూకుతూ, దాటుతూ, ఇగిలిస్తూ, ఎగురుతూ, నేలను బొరియలుగా తవ్వుతూ హిరణ్యాక్షుని గుండెలు తల్లడిల్లే విధంగా ఆ వరాహం యుద్ధానికి సిద్ధమై...ఇంకా...కన్నులు నిప్పులు కురియగా వాడికోరపైన భూమిని ధరించినవాడై వరాహమూర్తి తనకు ఎదురు రాగా చూచి హిరణ్యాక్షుడు ‘అడవిలో సంచరించవలసిన ఈ జంతువు నీళ్ళల్లో విహరించేదిగా ఎలా అయింది?’...అని ఆశ్చర్య భయాలు తన మనస్సులో అతిశయించగా హిరణ్యాక్షుడు భయంకర వరాహ రూపాన్ని ధరించిన రాక్షస గర్వ నాశకుడైన ఆ హరితో ఇలా అన్నాడు. బుద్ధిలేని ఓ పెద్ద వరాహమా! బ్రహ్మ ఇచ్చిన వరదానాన్నిబట్టి చూస్తే రసాతలంతో కూడిన భూమి శాశ్వతంగా నా ఆధీనమైనదే. పూనికతో నీవీ భూమిని తీసుకువెళ్ళకు. విడిచి పెట్టు. కాదని తీసుకుపోతే నీ ప్రాణం తీస్తాను. నా మాటలను విను. మొండిపట్టు ఎందుకు పడతావు? మాయగాడివై ఇప్పుడీ భూమిని దొంగతనంగా తీసికొని పోతుంటే నిన్ను నా గొప్ప భుజబలం చేత అణచివేయకుండా చూస్తూ ఊరుకుంటానా? గొప్ప యోగమాయ యొక్క బలంచేత లభించిన అల్పమైన పౌరుషంతో ఉన్న నిన్ను పాతిపెట్టి, నా మిత్రులకు, సేవకులకు ఆనందాన్ని కలిగిస్తాను. నా గదాఘాతంతో ముక్కలైన నీ తలను చూసి దేవతలందరూ నిర్మూలంగా నశిస్తారు” అని హిరణ్యాక్షుడు చెప్పగా విని యజ్ఞవరాహ రూపంతో విలసిల్లుతున్నట్టి....శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతల కందరికీ ఆ రాక్షసుని వల్ల వచ్చే కీడును ఊహించి విచారించి వాడికోర చివర ప్రకాశిస్తున్న భూదేవితో స్థిరంగా ఉన్నాడు. ఆ రాక్షసుని మాటలు అనబడే అంకుశాల పోట్లకు మిక్కిలి కోపించిన హరి భయపడిన ఆడయేనుగుతో ఉన్న గజేంద్రుని వలె భూదేవితో కూడి అతిశయించాడు. వాడియైన తెల్లని కోరల కాంతులు ఆకాశంలో వ్యాపించగా సముద్రంనుండి బయటికి వచ్చిన భయంకరమైన యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువును....ఏనుగు వెంటబడిన మొసలి వలె ఆ హిరణ్యాక్షుడు వెంబడించి, పాపసముద్రాన్ని దాటించేవాడూ, వరాహరూపాన్ని ధరించినవాడూ, గిట్టలతో మేరుపర్వతాన్ని మట్టగించినవాడూ అయిన హరితో ఇలా అన్నాడు. “నిందించినా రోషం చెందక, సిగ్గుపడక, మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఇలా పిరికిపందలాగా పారిపోవడం నీ మగతనానికి తగిన పనేనా? అని హిరణ్యాక్షుడు ఆక్షేపంచగా శ్రీహరి మనస్సు కోపంతో రగుల్కొనగా...

పద్మనాభుడైన విష్ణువు భూమిని అనాయాసంగా భూమిని నీళ్ళపై నిలిపి, దానికి ఆధారంగా తన బలాన్ని చక్కగా పెట్టాడు. అది చూచి దేవతలు ఆనందించారు.

పూలవాన బోరున కురిసింది. దేవదుందుభులు వైభవోపేతంగా మ్రోగాయి. గంధర్వగానం వినిపించింది. అప్సరసల నాట్యాలు ఆనందాన్ని కలిగించాయి.ఆ సమయంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువు బంగారు మకరకుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాల కాంతులు ఆకాశ మంతటా వ్యాపింపగా యుద్ధానికి సంసిద్ధుడై...

పెద్ద గదాదండాన్ని చేత పట్టుకొని, మణులు పొదిగినట్టి చిత్రమైన బంగారు కవచాన్ని అందంగా ధరించి, హిరణ్యాక్షుడు పలికిన కటువైన మాటలు వాడి బాణాలై తన హృదయాన్ని కలత పెట్టగా విష్ణువు మిక్కిలి పరాక్రమం కలవాడై వస్తున్న అతణ్ణి చూచి ఆగ్రహోదగ్రుడై....కూడా నవ్వుతూ ఇలా అన్నాడు.

ఓరీ అమంగళ కార్యాలను ఆచరించేవాడా! విను. గర్వంతో నన్ను అడవిలో కనిపించే మృగంగా నీ మనస్సులో భావిస్తున్నావు. ఔను. నేను అడవి జంతువునే. నువ్వు యుద్ధరంగంలో స్థిరంగా నిలువగలిగితే బలిపశువుగా వచ్చే నీవంటి కుక్కలను ఈరోజు సంహరిస్తాను. ఓరీ దురాత్మా! నీకు శక్తి ఉన్నట్లైతే నన్ను యుద్ధంలో ఎదిరించి పోరాడడానికి సిద్ధం కా. ఈరోజు నీ కోరికలను తీరుస్తాను. ఊరికే నిన్ను నీవు పొగడుకొనడం తగదు.ఓ రాక్షస కులాధమా! విను. రణరంగ విశారదులైన సత్పురుషులు మృత్యుపాశాలలో చిక్కుకొని కూడా నీలాగా తమను తాము పొగడుకొని సంతోషించారా? ఎందుకీ ఆత్మస్తుతులు? ఎంచి చూస్తే ఇవి పౌరుషవంతుని లక్షణాలా?దేవతల శత్రువైన ఓ హిరణ్యాక్షా! చూస్తూ ఉండు. నీవు చెప్పే పాతాళలోకపు గొప్ప నిధిని నేను గ్రహించి గర్విస్తాను. నన్ను సిగ్గులేనివానిగా లెక్కించావు కనుక నేను నీతో దాగి ఉండే యుద్ధం చేస్తాను. నీ గదాదండానికి భయపడి పారిపోతున్నా నన్నావు కదా! నన్నెదుర్కో. నేను నీ కోరికలను తీరుస్తాను. నీవు సేనానాయకుడవు. శూరుడవై ఈరోజు యుద్ధభూమిలో నన్ను ఎదిరించితే నీ బలాన్నీ ఆయువునూ తీసుకొంటాను చూడు. తిరుగులేని పరాక్రమంతో నేటినుండి భూమి రాక్షసులు లేనిదై వన్నెకెక్కేలా చేస్తాను. రాక్షస కులాధమా! నన్ను ఎదిరించగల శౌర్యము, ధైర్యము, బలం నీకు ఉన్నట్లైతే యుద్ధభూమిలో నిలబడు. నీ ఆప్తులు కన్నీరు కార్చడాన్ని ఆపదలిస్తే వెంటనే వెళ్ళిపో. అనవసరమైన ప్రగల్భా లెందుకు? నన్నిక్కడ పూడ్చిపెడతా నన్నావు. అంతటివాడవే కావచ్చు. యమపురంలో కాపురానికి వెళ్ళేముందు నీకు ఇష్టమైన చుట్టాలను చివరిసారిగా చూసుకొని రా.” అని ఈవిధంగా కమలాక్షుడైన విష్ణువు హిరణ్యాక్షుని ఆక్షేపించి పలికిన పరిహాసపు మాటలకు అతడు కోపం తెచ్చుకొని, రోషమూ గర్వమూ కలగలసిన మనస్సు కలవాడై, కనుగొనల్లో నిప్పుకణాలు వెలిగ్రక్కగా, తోక త్రొక్కిన నల్లత్రాచులాగా చీకాకు కలుగగా...శరీరం కంపించగా, వేడి నిట్టూర్పులు విడుస్తూ, కనుబొమ్మలు ముడిపడగా, రోషంతో మనస్సు కలత చెందిన మనస్సు కలవాడై గదను తీసుకొని సాహసంతో విష్ణువునకు ఎదురు నడిచాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుడు అతిభయంకరమైన ఆకారం కలవాడై....మదించిన ఆ రాక్షసరాజు మిక్కిలి కోపంతో విష్ణువును గదతో దెబ్బ వేయగా, రాక్షససంహారి అయిన హరి ఆ దెబ్బను లక్ష్యపెట్టక, శౌర్యంతో ఆ గదను స్వాధీనం చేసికొని ముక్కలు చేసాడు. రాక్షసుడు వెఱ్ఱెత్తిపోయి మరొక గదతో భయంకరంగా విష్ణువును కొట్టాడు. రాక్షసవైరి అయిన హరి ఆ దెబ్బ తనకు తగలకుండా గదాయుద్ధనైపుణ్యం వెల్లడించే హస్తలాఘవంతో ఆ గదను పట్టుకొని దానితోనే శత్రువు విశాలమైన వక్షస్థలం అదిరిపోయేటట్లు కొట్టాడు. వాడు ఎంతో చికాకుపడి, అంతలోనే తెప్పరిల్లి, శత్రుమర్దనుడైన ఆ జనార్దనుణ్ణి కొట్టాడు. ఈ విధంగా తలపడి ఒకరినొకరు జయించాలనే కోరిక కలవారై ఆ ఇద్దరూ కోపంతో ఉవ్వెత్తుగా లేచే కెరటాలతో ఒకదాని నొకటి కొట్టుకొంటున్న ఉత్తర దక్షిణ సముద్రాల లాగా, పెద్ద తొండాలతో పరస్పరం ఢీకొంటున్న రెండు మత్తగజాల లాగా, రోషంతో భయంకరంగా గాండ్రిస్తూ తలపడుతున్న రెండు పెద్దపులుల్లా, పొగరుబోతుతనంతో రంకెలు వేస్తూ క్రుమ్ములాడుకుంటున్న ఆబోతుల జంటలాగా సహింపరాని సింహబలంతో పోరాటం చేస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు ఎడమ వైపుకు గిఱ్ఱున తిరగగా, విష్ణువు కుడివైపు తిరిగి గదాదండంతో శత్రువు వక్షాన్ని పిడుగుపాటు వంటి దెబ్బతో పగులగొట్టాడు. వాడు తెలివి తప్పి తెప్పరిల్లి లేచి హరి నుదుటిపై కొట్టి నొప్పించాడు. అప్పుడు ఆ ఇద్దరు వీరులు తమ శరీరాలు రక్తంతో తడిసిపోగా పూచిన అశోకవృక్షాలవలె ఉన్నారు. ఒకరికొకరు దూరంగా వెళ్తూ, సమీపిస్తూ, కొడుతూ, అరుస్తూ, ఒకరు మరొకరి రక్తాన్ని వాసన చూస్తూ, తిరస్కారంతో కూడిన హేళనలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ మహాబలుల యుద్ధాన్ని చూడాలనే కోరికతో బ్రహ్మ సమస్త మునీంద్రులను, సిద్ధులను, సాధ్యులను, దేవతల సమూహాన్ని వెంటబెట్టుకొని వచ్చి భూమి కొరకు రాక్షసునితో యుద్ధం చేస్తున్న యజ్ఞవరాహ స్వామితో ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: