4, డిసెంబర్ 2020, శుక్రవారం

**సౌందర్య లహరి**ఆరవ శ్లోక భాష్యం -

  **దశిక రాము**

**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


**సౌందర్య లహరి**ఆరవ శ్లోక భాష్యం - రెండవ భాగం


కాముడు (మన్మథుదు), కామేశ్వరి సేవకుడే కాబట్టి, ఆమె దగ్గరున్న చెఱుకువిల్లు కూడా ఈయన ధరిస్తూ ఉంటాడనడంలో తప్పులేదు. భావాల్లో ప్రేమ, రుచుల్లో తీపి వంటిది. అయినా ఎవరితోనైనా యుద్ధం చేసేటప్పుడు మిరపకాయల వంటి ఆయుధాలుంచుకోవాలి కదా! ఈయన దానికి పూర్తి వ్యతిరేకమైన ఆయుధాలు ధరిస్తాడు.


చెట్టు కాండం గట్టిగా ఉండవచ్చు. ఆకులు, పళ్ళు కూడా అప్పుడప్పుడు గరుకుగా కోసుగా ఉండవచ్చు. పూలు సుతిమెత్తటివి. అందమైన మనిషి ఎంతటి కఱుకువాడయినా కళ్ళు సున్నితంగానే ఉంటాయి. కొంచెం దుమ్ముపడితే కందిపోతాయి. అలాగే చెట్టంతా కఠినమైనా పూలు సున్నితంగా ఉంటాయి. మరి ఈయనో ? అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం వంటి పుష్పాలు ఆయుధాలుగా పెట్టుకొన్నాడు. ఒక్క పూవు ఒక్కొక్క ఇంద్రియానికి ప్రతీక. లలితా సహస్రనామంలో కూడా అంబిక అయిదు బాణాలు అయిదు ఇంద్రియాలతో సంబంధమున్న వానిగా అభివర్ణించబడింది. “పంచతన్మాత్రసాయకా” పంచభూతములకు సూక్ష్మరూపము ఈ అయిదు తన్మాత్రలు అయిదు ఇంద్రియముల చేత గ్రహించబడతాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు పంచతన్మాత్రలు.


ఈ అయిదు పుష్పాలు అయిదు ఇంద్రియాలను సూచిస్తాయనుకొన్నాం కదా! అయిదు తన్మాత్రలకు కూడా సంబంధముంటుంది. పూవున్న చోట తేనెటీగ ఉంటుంది. పూలకు స్పర్శ రూప రస గంధ లక్షణములున్నయి. కానీ పూలకు శబ్ద లక్షణం లేదు కదా! ఈ తుమ్మెద ఆ కొరత తీరుస్తుంది. ఈ మన్మథుడు “చంపు”, “చావగొట్టు” అనే అరుపులతో యుద్ధానికి వెళతాడు. అల్లెతాడుగా ఉన్న తుమ్మెదల ఝంకారమనే సంగీతంతో కూడి యుద్ధనికి వెళతాడు. 


రాజులు బలహీనులైనా విశ్వాస పాత్రులైన సామంతులు మహా పరాక్రమవంతులైతే రాజ్యం భద్రంగానే ఉంటుంది. యుద్ధాలలో విజయాలు వరిస్తాయి. మరి ఈ మన్మథరాజు సామంతులెటువంటి వారు ? “వసంత స్సామంతో” – వసంత కాలమన్నమాట. ఈ కాలంలో సమశీత ఉష్ణస్థితులతో వసంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. దీనికి పుష్పసమయమన్న పేరుకూడా ఉంది. అటువంటి ఋతువుకు అధిపతి యుద్ధం చేయబోయే మన్మథునికి తోడు. యుద్ధంలో ఆగ్నేయాది అస్త్రాలు వేసి శత్రువును క్షోభింపచేయాలి. ఈ సామంతుడు తలపులలోకి వస్తేనే మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది.


“మలయ మరుదాయోధన రథః” – “ఆయోధన” అంటే యుద్ధం కోసం అన్నమాట – మలయ పర్వతాల నుండి వచ్చే మంచిగంధపు వాసనలున్న చల్లటి గాలులు ఈయన యుద్ధం కోసం ఏర్పడిన రథము యుద్ధాలలో విషవాయువులు కదా వదిలి పెట్టాలి. మందంగా వీచే కాలుష్యత ఏమాత్రం లేని చల్లటి గాలి ఈయన రథమా? 


మన్మథుని బాణాలు, విల్లు, వింటితాడు కనీసం కనులకు కనిపిస్తాయి. ఈ వసంతుడు కళ్ళకు కనిపించను కూడా కనిపించడు. ప్రకృతి పుష్పించినపుడు ఓహో వసంత్మోచ్చింది అనుకుంటాం. చల్లటి గాలులు సోకినపుడు మలయమారుతం వీస్తుంది అనుకుంటం. సామంతులు, రథము ఇంత లక్షణంగా ఉన్నాయి. పోనీ మన్మథుడు బలిష్టంగా కనిపిస్తాడా అంటే ఆయన అనంగుడు. మన్మథునకనేక పేర్లున్నాయి.


అయితే ఆచార్యులవారు ఇక్కడ సాభిప్రాయంగా అనంగుడనే నామమే తీసుకున్నారు. అనంగ అంటే అంగములు లేనివాడు. శివునిచేత భస్మం చేయబడిన మన్మథుని కామేశ్వరి పునరుజ్జీవితుణ్ణి చేసింది. కానీ శరీరమే లేకుండా ఆమే భర్త వేసిన శిక్షను పూర్తిగా మాఫీచేయడం ఆమెకు ఇష్టంలేదు. అందువల్ల శరీరాన్నీయలేదు. అయితే అతడి భార్యకు మాత్రం కనిపించే వరమిచ్చింది. “రతినయన లేహ్యేన వపుషా” అన్నారు ఆచార్యులవారు. మిగతావారందరికీ అతడు కాంతి, శబ్దము, గాలి వలె ఒక శక్తి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: