4, డిసెంబర్ 2020, శుక్రవారం

రామాయణమ్ 137

 రామాయణమ్ 137

.........................

జగదేకవీరుడు రాముడు అంత స్వల్పకాలములో పద్నాలుగువేలమంది మహాబలవంతులైన రాక్షసులను సంహరించటము చూసిన ఋషులు ,మునులు ,దేవతలు ఆయనను సమీపించి అభినందనలతో ముంచెత్తారు;

.

అప్పుడు వారొక రహస్యాన్ని విప్పి చెప్పారు ,రామా నీవు శరభంగ మహాముని ఆశ్రమానికి వచ్చినప్పుడు దేవేంద్రుడు మునితో ఎదో మాట్లాడుతూ కనపడ్డాడు కదా ,ఆ విషయము ఏమిటనుకున్నావు ! నిన్ను ఈ ప్రాంతానికి ఎదోవిధముగా పంపితే ఎప్పటినుండో జనస్థానములో తిష్ఠ వేసుకున్న రాక్షసులను ఏరిపారేస్తావని తెలిపాడు.

.

 ఉపాయముతో నిన్ను ఇక్కడకు పంపమన్నాడు. ఆవిధముగానే నీవు ఇక్కడ నివసించేటట్లు మేము ఆలోచన చేసి నిన్ను పంపాము ,ఇప్పుడు జనస్థానములో ఒక్క రాక్షసుడు మచ్చుకైనా లేడు,

.

ఇక మేము నిశ్చింతగా, సుఖముగా ఈ ప్రాంతములో సంచరించగలము అని కృతజ్ఞతాపూర్వకముగా పలికి వచ్చిన దారినే తిరిగి వెళ్ళారు.

.

యుద్ధపరిసమాప్తిని కాంచిన లక్ష్మణుడు వదినగారిని తీసుకుని గుహనుండి బయటకు వచ్చాడు. 

.

అన్నగారి పరాక్రమము ఆయనకు తెలియనిదా ? 

ముల్లోకాలన్నీ ఒకవైపు రాముడొక్కడు ఒకవైపు ! 

అయినా విజయము రామునిదే అని ఆయనకు తెలియనిది  కాదు .

.

 ఆయన చేసిన ఘన కార్యానికి అభినందనలు తెలిపాడు లక్ష్మణుడు.

.

లోకకంటకులైన రాక్షసులను ఒంటిచేత్తో మట్టికరిపించి సింహము లాగా నిలుచున్న వీరాధివీరుడైన తన భర్తను చూడగనే సీతమ్మ హృదయము ఉప్పొంగింది.

ఆయనను తటాలున కౌగలించుకొన్నది, ఏ మాత్రము అలసటలేని భర్తను చూసుకుంటూ మురిసిపోతూ మరలమరల ఆలింగనము చేసుకొన్నది వైదేహి.

.

ఒక్కడు మిగిలాడు ! 

.

పదునాలుగు వేలమందిలో ఒక్కడు తప్పించుకొన్నాడు. వాడి పేరు అకంపనుడు.

.

ఆ విధ్వంసాన్ని కన్నులారా చూసిన వాడి కాళ్ళు తడబడుతున్నాయి గుండెలలో దడ మొదలయ్యింది ఏదో విధముగా గుండె చిక్కబట్టుకున్నాడు వాడు ,వేగముగా లంకకు బయలుదేరాడు.

.

 వెళ్ళి వెళ్ళి రావణుడి ముందు కుప్పకూలాడు . భయంభయంగా చూస్తున్నాడు.

వాడి చెవులలో ఇంకా రామకోదండము వెలువరించిన శబ్దమే మారుమ్రోగుతున్నది,

వాడి కన్నులలో ఆ కోదండము చేసిన వీరవిహారమే ప్రతిఫలిస్తున్నది..

.

వాడు రావణుని ముందు నిలబడి ,

ప్రభూ మన రాక్షసులు పదునాలుగువేలమంది హతులైనారు,

ఖరుడు కూడా చనిపోయినాడు అని మాత్రమే పలికాడు.

.

 ఈ మాటలు విన్న వెంటనే రావణుడి కళ్ళు కోపముతో అరుణిమను సంతరించుకున్నాయి.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: