4, డిసెంబర్ 2020, శుక్రవారం

రామాయణమ్ 140

 రామాయణమ్ 140

...........

మంత్రులతో కూర్చొని సమాలోచనలు చేస్తున్నాడు రావణుడు.

.

సుడిగాలిలా వచ్చి ఆయన ముందు వాలింది శూర్పణఖ.

వచ్చీ రావడముతోనే రావణుని నిందించడము మొదలుపెట్టింది .

.

నీవేమి రాజువు !నీకు పోగాలము దాపురించినదిలే ! అసలు బయట ప్రపంచములో ఏమి జరుగుతున్నదో నీకు పడుతున్నదా! అవునులే నీ గూఢచార వ్యవస్థ అంత దరిద్రముగా తగలబడ్డది ,

.

నీపాటికి నువ్వు హాయిగా నచ్చిన దానితో కులుకుతూ ,భోగాలలో మునుగుతూ కాలము వెళ్ళబుచ్చుతున్నావు.

.

నీకు భోగాలు ముఖ్యమని అనుకుంటూ కాలము గడుపుతున్నావు నీలాంటి రాజును జనులు స్మశానపు అగ్ని లాగ గౌరవించరు.

.

భోగాలలో మునిగిన రాజు సముద్రములో మునిగిఉన్న పర్వతము లాగా శోభిల్లడు.

.

ఇంత చపల చిత్తుడవు  నీవు రాజు ఎలా కాగలిగావు?

.

నీకు పరాక్రమం ఒకటుంటే  సరిపోదు ! గూఢచార వ్యవస్థ ,కోశాగారము,పరిపాలనా వ్యవహారము నీ ఆధీనములో ఉంచుకోవటము తెలవాలి ,అప్పుడే నీ రాజ్యము స్థిర పడుతుంది .

.

అసలు నీవేమి తెలుసుకుంటున్నావో నాకు తెలియటము లేదు.

.

అక్కడ జనస్థానములో కొంపలంటుకుంటున్నాయి. 

.


నీ సైన్యము పదునాల్గు వేల మందినీ ఒకడు ఊచకోత కోశాడు, దూషణుడు,త్రిశిరుడు,మహాబలశాలి ఖరుడు అందరూ ఆ ఒక్కడి చేతులలో ఒకేసారి చనిపోయారు.

.

వాడు రాముడు!

.

ఆ రాముడు ఋషులకు అభయమిచ్చినాడు ! 

వారికి రాక్షస బాధ లేకుండా చేస్తానని!.

.

ఎండిన కర్రలు,మట్టిబెడ్డ ,బూడిద వీటివల్ల ఉన్న ఉపయోగము కూడా స్థాన భ్రష్టుడు అయిన నీ వంటి రాజు వల్ల ఉండదు.

.

శూర్పణఖ మాట్లాడే మాటలు రావణుడి హృదయములో క్రోధాగ్నిజ్వాలలు రేపుతున్నాయి ,

.

మంత్రుల సమక్షములో ఇలా చిన్నబుచ్చుతూ మాట్లాడింది !

.

 ఎరుపెక్కిన కన్నులతో ఇలా అన్నాడు,

.

ఎవడా రాముడు?

 ఎట్లాంటిది వాడి బలము?

అసలు అంత దుర్గమమైన దండకారణ్యము లో వాడెందుకు ప్రవేశించాడు?

అతని ఆయుధము ఏమిటి?

అని ప్రశ్నించాడు.

.

అప్పుడు శూర్పణఖ ,

అతడు దశరధ కుమారుడు ,

ఆజానుబాహువు ,

విశాలమైన నేత్రాలున్నవాడు,

నారచీరను ,కృష్ణాజినమును ధరించిఉన్నాడు.

మన్మధుడితో సమానమైన

 సౌందర్యము ఆతనిది!

.

కందర్ప సమరూపశ్చ రామో దశరధాత్మజః

.....

అని పలికి రాముడి పరాక్రమాన్ని వర్ణించ సాగింది .

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: