12, నవంబర్ 2020, గురువారం

17-16-గీతా మకరందము

 17-16-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక మానసిక తపస్సును గూర్చి వచించుచున్నారు –


మనః  ప్రసాదస్సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః | 

భావసంశుద్ధిరిత్యేతత్

తపో మానసముచ్యతే || 


తాత్పర్యము:- మనస్సును నిర్మలముగానుంచుట (కలతనొందనీయక స్వచ్ఛముగానుంచుట), ముఖప్రసన్నత్వము (క్రూరభావము లేకుండుట), పరమాత్మనుగూర్చిన మననము (దైవధ్యానము) గలిగియుండుట (లేక, దృశ్యసంకల్పము లెవ్వియు లేక ఆత్మయందే స్థితిగలిగియుండుట, అను వాఙ్మౌనసహిత మనోమౌనము), మనస్సును బాగుగ నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము గలిగియుండుట (మోసము మున్నగునవి లేకుండుట) అనునివి మానసిక తపస్సని చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- “మనః ప్రసాదః”  మనస్సు తేటగా, నిర్మలముగా, కలతనొందకుండ నుండవలెను. మనస్సునందు, రజోగుణ, తమోగుణములయొక్క సంపర్కమున్నచో, అది చంచలముగానో, మత్తుగానో యుండును. కావున సత్త్వగుణమును, విశుద్ధసత్త్వగుణము నాశ్రయించి మనస్సును నిర్మలముగా నుంచుకొనవలెను. చిల్లగింజ అరగదీసి నీటిలో కలిపినచో మురికియంతయు క్రిందకు జని నీరు తేటగానుండునట్లు, భక్తి జ్ఞాన వైరాగ్యదులచే మనోమాలిన్యమును రహితమొనర్చి చిత్తమును వినిర్మలముగా జేయవలెను. ఇదియే మనఃప్రసాదము, మానసిక తపస్సు, ఇదియే మనఃప్రసాదమును స్వీకరించినవాడు మఱల బంధమును బొందనేరడు.


"సౌమ్యత్వమ్” - అంతఃకరణ వృత్తి సామాన్యముగ ముఖమునందు ప్రతిబింబించుచుండును. ముఖము సౌమ్యముగా, వికాసముగానున్నచో దానినిబట్టి చిత్తవృత్తియు నిర్మలముగా, నిశ్చలముగా, .నున్నదని ఊహించవచ్చును. అట్టి సౌమ్యస్థితి గలిగియుండుటయు మానసిక తపస్పేయగును. 


“మౌనమ్” - "వాఙ్మౌనము, మనోమౌనము" అని మౌనము రెండు విధములు. ఇచట మౌనమును మానసిక తపస్సునందు జెప్పుటవలన మానసిక మౌనమే ఇచటవివక్షితమని తెలియుచున్నది. అయితే వాఙ్మౌనము మనో మౌనమునకు సహాయకారిగా నుండగలదు. కాబట్టి అదియు నభ్యసించవలసినదే. అయితే మనోమౌనమునకై యత్నింపక కేవలము వాఙ్మౌనముమాత్రము గలిగియున్నచో అత్తఱి మనస్సు అనేక సంకల్పములతో గూడుకొని చంచలమైయుండుటవలన - ఆ మౌనమువలన ఎక్కువ ప్రయోజనము యుండదని ఈ సందర్భమున గ్రహించవలసియున్నది. మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిశ్చలత్వము, దృశ్యసంకల్పరాహిత్యమే యగును. కనుకనే మౌనమును భగవానుడు వాచికతపస్సులో చేర్చక మానసికతపస్సులో చేర్చుట సంభవించినది. కాబట్టి మనోమౌనమే సర్వులకును ముఖ్యమైనదనియు, వాఙ్మౌనము దానికి సహాయ భూతముగ నుండుననియు నెఱుంగవలెను.


“ఆత్మవినిగ్రహః” - ఇచట "ఆత్మ” అను పదమునకు మనస్సని, ఇంద్రియములని యర్థము. నిగ్రహమని చెప్పక వినిగ్రహమని చెప్పుటవలన సామాన్యనిగ్రహము చాలదనియు, ఇంద్రియ మనంబులను లెస్సగ నిగ్రహించవలెననియు తేలుచున్నది. అట్లే  " భావసంశుద్ధి” అను పదమునందును, శుద్ధి అని చెప్పక "సంశుద్ధి” అని చెప్పుటవలన భావమందు పరిపూర్ణమగు శుద్ధత్వము గలిగియుండవలెనని స్పష్టమగుచున్నది. జ్ఞానసిద్ధికి భావశుద్ధి అవసరము. అనగా ఆత్మానుభూతికి భావనిర్మలత్వము అత్యంతావశ్యకమైయున్నది. నిర్మలజలమందు సూర్యుడు దేదీప్యమానముగ ప్రకాశించునట్లు  శుద్ధహృదయమున ఆత్మభాస్కరుడు చక్కగ భాసించును. కాబట్టి మనస్సునందు, భావములందు ఏలాటి దృశ్యదోషము, అపవిత్రత చేరకుండ బహుజాగరూకతతో జూచుచుండవలెను.


ప్రశ్న:- మానసికతపస్సు అనగా నేమి?

ఉత్తరము:- (1) మనస్సు నిర్మలముగా నుండుట (2) ముఖమందు ప్రసన్నత్వము గలిగియుండుట (3) మౌనము (ఆత్మనుగూర్చిన మననము, లేక దృశ్యవృత్తిరాహిత్యపూర్వకమగు ఆత్మస్థితి) - అనునవి మానసిక తపస్సని చెప్పబడును.

కామెంట్‌లు లేవు: