12, నవంబర్ 2020, గురువారం

విదురనీతి 42

 విదురనీతి 42


విదురుడు ఇంకా ఇలా చెప్తున్నాడు 


శుభకర్మల వల్ల లక్ష్మి ప్రభవించి, ధర్మంతో వర్ధిల్లి, చాతుర్యంలో విస్తరించి సమ్యమనంతో సురక్షితమౌతుంది. బుధ్ధీ, కులీనతా, దమమూ, శాస్త్రజ్ఞానమూ, పరాక్రమమూ, మితభాషిత్వమూ, దానమూ, కృతజ్ఞతా అనే గుణాలు పురుషుని కీర్తిని వృధ్ధిపొందిస్తాయి. ఎదుటి వ్యక్తిని గౌరవించడం అన్నిటికంటే ఉత్తమమైన గుణం. సత్పురుష సాంగత్యంవలన ఈ గుణసంపదలు లభిస్తాయి. తపో, యజ్ఞ, దాన అధ్యయనాదులు సజ్జన సాంగత్యమువలననే కలుగుతాయి. సజ్జనులు సత్యవ్రతంతో, మృదుస్వభావంతో, కోమల హృదయులై, ఇంద్రియ నిగ్రహంతో చరిస్తారు. ఉత్తములు దయ,క్షమ, నిర్లోభము, సత్యము ను అనుష్టిస్తారు. దాన హోమ పూజ ప్రాయశ్చిత్తాది ఇహలోక కర్మలను నిర్వహించేవాడు పురోభివృధ్ధి గాంచుతాడు. వివాహము , స్నేహము, వ్యవహారము, సమానులతోనే సాగించాలి. సద్గుణసంపన్నుల మార్గంలో పోయేవాడు నీతివంతుడు, శాస్త్రవిశారదుడవుతాడు. 


క్రోధము, తొందరపాటు, పురుషార్ధం లేకపోవడము, అసత్యభాషణము, దు:ఖ కారణాలు. హితులక్షేమం కోసం యుధ్ధం చెయ్యనివాడూ, ఆదరించినవారి మీద కోపం చూపేవాడూ, వివేకం లేనివాడూ, పరులయందు దోషాలను చూసేవాడూ, దయలేనివాదూ, అధికంగా భాషించేవాడూ, ఈ విశ్వంలో పేరుప్రఖ్యాతులు పొందలేరు. వేషాడంబరం లేకుండా ఆత్మస్తుతి చేసుకోకుండా, కోపం వచ్చినా కఠినంగా మాట్లాడకుండా ఉండేవాడు సర్వులకూ ఆదరణీయుడు అవుతాడు. గర్వంలేనివాడూ, హీనంగా ప్రవర్థించనివాడూ, శాంతించిన శత్రుత్వాన్ని ప్రకోపింప చెయ్యనివాడూ, ప్రమాదాలు పైన పడుతున్నా, అనుచింతంగా ప్రవర్తించన్వాడూ, పరుల దు:ఖానికి సంతోషించనివాడూ, దానం చేసిన తరువాత బాధపడనివాడూ, సత్పురుషులలో శ్రేష్ఠులుగా ఖ్యాతి చెందుతారు. దేశవ్యవహార అవసరాదులూ, జాతి ధర్మాలూ తెలిసిన వారికి ఉత్తమ-అధమ వివేకం కలుగుతుంది. 


పురోభివృధ్ధి కోరేవారు గతాన్ని మరచిపోరాదు. అప్పుడే హృదయంలో మహోన్నతభావం ఉదయిస్తుంది. అంతేకాక తన పురోగతికి ఏఏ ఆటంకాలున్నాయో అవన్నీ నశింపచేసుకుంటాడు. 


(ఇంకా ఉంది)

కామెంట్‌లు లేవు: