12, నవంబర్ 2020, గురువారం

తులసి చుట్టూ పురుషులు ప్రదక్షిణ చేస్తే

 *తులసి చుట్టూ పురుషులు ప్రదక్షిణ చేస్తే?*




* తులసి చెట్టు...పూజకు మాత్రమే కాదు ఎన్నోరకాల ఔషధ గుణాలున్న ఆరోగ్యకరమైన మొక్క. నిజానికి ఎంతోమంది ప్రజలు తులసి చెట్టు ఇంట్లో పెట్టుకుని పూజిస్తుంటారు. అందులోనూ కేవలం స్త్రీలు మాత్రమే పూజించాలి అనుకుంటారు. కానీ పురుషులు కూడా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానమాచరించి తులసిని పూజించినట్లయితే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. 


* మహిళలు శాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటూ రోజూ తులసి మొక్కను ఆరాధిస్తారు... సంధ్యాసమయంలో దీపం వెలిగించి కుంకుమ, పుష్పాలతో పూజించి మహాలక్ష్మిలా ఆరాధిస్తారు. తులసిదళాలు, పుష్పాలు లేనిదే శ్రీ మహావిష్ణువుకు, శ్రీకృష్ణ భగవానునికి అర్చన పరిసమాప్తి కాదని పురోహితులు సైతం తెలుపుతున్నారు. అటువంటి దైవ సంభూత రూపిణి అయిన తులసిని పూజించడం ఎంతో శ్రేయస్కరం.


* ఇతిహాసాల ప్రకారం తులసి కృష్ణుల వివాహం హిందూ సంప్రదాయంలో ప్రధానమైంది. తులసి వివాహ పర్వంగా దీనిని జరుపుతారు. ఆధునిక కాలంలో కూడా అన్ని ప్రాంతాలకు ఈ గాథ వర్తిస్తుంది. తులసి పత్రాలు ప్రతి పండుగనాడు, ప్రతి పవిత్ర సందర్భాలలోనూ వినియోగించ మన ఆచారం. 


* తులసి తరతరాలనుండి వస్తున్న ఔషధ సంపద కూడా.... ఇందులోని ఔషధ గుణాలు వలన ఆ ఆకుల కషాయాన్ని జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బందులను తొలగించేందుకు వినియోగిస్తారు. పర్వదినాలలో దేవతలకు చేసే నివేదనలలోను, కొన్ని ప్రత్యేక విందులలోనూ అతిథులకు ఆహారపదార్థాలపై తులసి ఆకును వుంచి అందించడం సంప్రదాయం.


* పవిత్ర దినాన చేసే భోజనంపైన, ప్రసాదంపైన తులసి పత్రం ఉంచడం ప్రేమకు, విధేయతకు చిహ్నం. ఎంతో పవిత్రమైన తులసిపత్రం తరచూ దైవారాధనలో ఉపయోగిస్తుంటాం. తీర్థంలో కూడ తులసిని విధిగా చేస్తారు. 


* తులసి పత్రం త్యాగగుణానికి గుర్తు. పదార్థంపై తులసి ఆకు వుంచాక ఇచ్చేవానికి దానిపై ఎలాంటి హక్కు వుండదు. అందుకే వివాహ సమయాల్లో వధువు తల్లిదండ్రులు ఒక తులసి పత్రాన్ని లేదా బంగారంతో చేసిన తులసి పత్రాన్ని సమర్పిస్తుంటారు. ఈ విధంగా తులసి మొక్క ఎంతో ప్రాముఖ్యతను గాంచింది.... ముఖ్యంగా హిందువుల పవిత్రమైన మొక్క గా కొలవపడుతూ ప్రఖ్యాతి పొందింది.

కామెంట్‌లు లేవు: