12, నవంబర్ 2020, గురువారం

మహాభారతము ' ...75 .

 మహాభారతము ' ...75 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


సర్వాలంకార శోభితులమై ప్రణయం జరుపుకుందామని కోరిన లోపాముద్ర, కోరిక తీర్చే అవకాశం లేక, అగస్త్యుడు, ' భార్యామణీ ! నీకోరిక నీకు సమంజసంగానే తోచవచ్చు. కానీ, సర్వసంగ పరిత్యాగిని. మునులలో శ్రేష్ఠునిగా కొనియాడ బడుతున్నవాడను. నావద్ద నీవు అనుకున్నట్లు అలంకరించుకునే, ధనంలేదు. హంసతూలికా తల్పాలు యేర్పరచలేను. అవి లేకపోవడం, మన దాంపత్యానికి అవరోధం అవుతుందని నేను అనుకోలేదు. ' అని నిరాశగా అన్నాడు. భర్త తనకోరిక తీర్చలేనందుకు నొచ్చుకున్నాడని తెలిసి లోపాముద్ర, ' స్వామీ ! మీరు తపోధనులు. మీరు తలుచుకుంటే, మీ తప:శక్త్తి ద్వారా యివన్నీ సమకూర్చలేరా? ఆలోచించండి. మన సుఖానికి ఆ మాత్రం తపశ్శక్తి వినియోగించలేరా ? ' అని అడిగింది.


' నీవు చెపుతున్నది నీపరిధిలో చాలా చిన్నవిషయం దేవీ ! కానీ తపస్సు అనేది చిన్న విషయం కాదు. ఎన్నో నియమనిష్టలతో కూడుకున్నది. ఈ చంచలమైన వానికోసం తప;ఫలాన్ని వుపయోగిస్తే, అనుకున్న లక్ష్యం సాధించలేము. ఈ విషయంలో నాపై అలుగకుండా, , నీకు వేరేయేదైనా ఉపాయం తోస్తేచెప్పు. ' అనగానే లోపాముద్ర, ' మహామునీ ! నా ఋతుకాలం చాలావరకు అయిపొయింది. ఈ పరిస్థితులలో మీతో సంసారజీవనం చేయనందుకు నన్ను అర్ధం చేసుకుని క్షమించండి. మీరు సర్వజ్ఞులు. మీకెలా తోస్తే అలా చెయ్యండి. నన్నుమటుకు యీవిషయంలో బలవంతపెట్టకండి. ' అని చెప్పివేసింది. 


అగస్త్యునికి ఆమె నిర్ణయం తెలిసిపోయింది. ఇక ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం వృధా అని గ్రహించి, ' అవసరమైన ధనాన్ని సంపాదించుకుని వస్తాను. అప్పటిదాకా, సతీధర్మాన్ని ఆచరిస్తూ, ఆశ్రమం కనిపెట్టుకుని వుండు. ' అనిచెప్పి, అగస్త్యుడు, దగ్గరలో వున్న శ్రుతర్వుడు అనే రాజు వద్దకువెళ్లి, ' మహారాజా ! నేను కార్యార్ధినై వచ్చాను. నీవు గొప్ప ధనవంతుడవని విన్నాను. నీదగ్గర మిగులు ధనం వున్నచో, ఆ యిచ్చే దానంవలన యెవరికీ యిబ్బంది కలుగని పక్షంలో, నాకు నీ శక్తికి తగినట్లు ధనం సహాయం చెయ్యి. ' అని సూటిగా అడిగాడు. ' అన్నాడు అగస్త్యుడు.  


శ్రుతర్వుడు యెంతో భక్తి తో అలాగే అని చెప్పి, మంత్రిని పిలిపించి, మిగులు ధనం ఏ మాత్రం ఉంటుందో, కోశాధికారిని అడిగి తెలుసుకొమ్మని పురమాయించాడు. ఆశ్చర్యకరంగా, వారి కోశాగారంలో అసలు మిగులుధనమే లేదు. బొటాబొటీ ఖర్చుల నిమిత్తం మాత్రమే రాజ్యంలో సొమ్ము వున్నది. అది గ్రహించి, యెంతో కొంత సొమ్ము యిస్తానన్నా కూడా అగస్త్యుడు వద్దని, తనవలన ప్రజలు యిబ్బంది పడగూడదని, ధనం తీసుకోకుండా తిరస్కరించాడు. అగస్త్యుడు, శ్రుతర్వుడు అలోచించి ప్రక్కరాజ్యం ప్రభువైన బద్నశ్వుడు అనేరాజును కలిశారు. అమితాశ్చర్యంగా, ఆ రాజువద్దకూడా, మిగులు ధనంలేదు. ఆ తరువాత, ముగ్గురూ అలోచించి యింకొకరాజైన త్రదస్య రాజును కలిశారు. ఆయనదీ అదే పరిస్థితి. అప్పుడు మిగిలిన ముగ్గురు రాజులూ కలిసి అలోచించి, అగస్త్యుని, వట్టిచేతులతో తిప్పి పంపకూడదని అలోచించి, ' మహర్షీ ! దగ్గరలో ఇల్వలుడు అనే ఒక రాక్షసుడు వున్నాడు. వాడి వద్ద విపరీతమైన ధనం వున్నదని ప్రతీతి. అతనిని అడిగి మీ అవసరాలు తీర్చుకుందురు . ' అని ముగ్గురు రాజులూ అగస్త్యుని తీసుకుని ఇల్వలుని వద్దకు వెళ్లారు.   


ధర్మరాజా ! మనం అగస్త్య మహర్షి గురించి, యెందుకు చెప్పుకుంటున్నామో గుర్తుంది కదా ! అగస్త్యుడు వాతాపిని యెందుకు చంపాడు ? అని తెలుసుకోవడానికే కదా ! మనం అక్కడకే వస్తున్నాము. ఈ ఇల్వలుడు అనే రాక్షసుడు యెవరోకాదు. వాతాపి అనేవాడి, సోదరుడే ! వీరు అందరు రాక్షసాగ్రేసరులవలె, దితికుమారులే ! ఇల్వలునికి బ్రాహ్మణద్వేషం కలిగే ఒక సంఘటన జరిగింది.  


ఒకనాడు,ఒక గొప్ప తపోనిష్ఠగల బ్రాహ్మణుడు, ఇల్వలుని మార్గంలో వెళుతుండగా, ఆయనకు నమస్కరించి, ఇల్వలుడు, ' విప్రోత్తమా ! నాకు ఇంద్రునితో సరిసమానమైన కుమారుడు కలిగేటట్లు దీవించండి. ' అనిప్రార్ధించాడు. ఇది ఇల్వలునికి మించిన కోరికగాభావించి ఆ బ్రాహ్మణుడు ఆవిధంగా దీవించడానికి ఒప్పుకోలేదు. అప్పటినుంచి, కనబడిన ప్రతిబ్రహ్మణుని చంపివేయాలని నిర్ణయించుకున్నాడు.   


ఇంకేముంది? ఆ ఆలోచన రావడమే ఆలశ్యం, కామరూప విద్య తెలిసిన తనతమ్ముడు వాతాపిని ఒక జంతువురూపం ధరింపజేసి, దానినివండి, విప్రులను దారికాచి,భోజనానికి పిలిచి, వారు తమ పితృదేవతల మారు రూపాలని చెప్పి, వారిని సత్కరించి, ఆ వండిన భోజనం పెట్టేవాడు. వారు తృప్తిగా భోజనం చెయ్యగానే, తనకు తెలిసిన క్షుద్రవిద్యతో, ' వాతాపీ ! రా ! ' అని ప్రేమగా తనతమ్ముని పిలిచేవాడు. వెంటనే, బ్రాహ్మణుని ఉదరంలో ఆహారంగా వున్న వాతాపి, ఆ బ్రాహ్మణుని ఉదరాన్ని చీల్చుకుని, బైటకు వచ్చేవాడు. ఆ బ్రాహ్మణుడు విగతజీవుడయ్యేవాడు. ఈ విధంగా లెక్కలేనంతమంది బ్రాహ్మణులను చంపి, బ్రహ్మహత్యా పాతకం మూటగట్టుకుని వున్నారు, ఆ సోదరద్వయం.


ఇలాంటి పరిస్థితులలో అగస్త్యునితో కలిసి, ఆ ముగ్గురురాజులూ, ఇల్వలుని దర్శించడానికి, అతని సహాయం కోరడానికి వచ్చారు.


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

కామెంట్‌లు లేవు: