12, నవంబర్ 2020, గురువారం

శివుడు - శిశుపోషణ*

 *శివుడు - శిశుపోషణ*


వ్రాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్‌, దయా

శాలికి శూలికిన్‌, శిఖరిజాముఖ పద్మ మయూఖ మాలికిన్‌,

బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో

న్మూలికి, నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్


పురాణ వాఙ్మయానికే కలికితురాయి వంటి భాగవత గ్రంథం మొదట్లో పోతనగారు చేసిన శివ ప్రార్థన ఇది. 


ఈ పద్యానికి శివపరంగా తాత్పర్యం ఇలా చెప్పుకోవచ్చు.


 ‘‘శివుడు నిరంతరం తాండవ కేళిలో ఉంటాడు. దయ కలిగినవాడు, త్రిశూలం ధరించినవాడు, పర్వత రాజ కుమార్తె అయిన పార్వతీదేవి ముఖ పద్మాన్ని వికసింపజేసే సూర్యునిలాంటివాడు, బాలచంద్రుణ్ని శిరస్సు మీద ధరించినవాడు, చేతిలో కపాలం ధరించి భిక్షాటనం చేసేవాడు, పర్వతంలా పెరిగిపోయిన మన్మథుని గర్వాన్ని నిర్మూలించగలిగినవాడు. నారదాది మహర్షుల హృదయపద్మాల్లో విహరించే తుమ్మెదలాంటివాడు అయినటువంటి పరమశివుడికి భక్తితో నమస్కరిస్తున్నాను అని స్థూలంగా దీని అర్థం.


కానీ, సూక్ష్మంగా పరిశీలిస్తే శివపార్వతులు ఆది దంపతులు, ఆదర్శ దంపతులు కావడానికి తగిన కారణాలన్నీ ఇందులో ఉన్నాయని అర్థమవుతుంది.


 సంసారజీవితం ఒక ‘అవారిత తాండవ కేళి’ అని పెళ్లికి ముందే తెలుసుకోవాలి. 


భార్యో, భర్తో, పెద్దవాళ్లయిన పిల్లలో.. ఎవరో ఒకరు ఎప్పుడూ ఏదో ఒకదాని కోసం తాండవం ఆడుతూనే ఉంటారు. ఇతరులు ఆ అకాండ తాండవానికి స్పందనగా మనోహర లాస్యం చేస్తూ సర్దుకోవలసిందే. లేకపోతే ప్రళయం తప్పదు.


 భార్యాభర్తలిద్దరూ పిల్లల పట్ల దయతో ఉండాల్సిందే. ఆ దయ వారి పసితనాన్ని అర్థం చేసుకోవడానికి; అంతే తప్ప.. వారి తప్పుల్ని సమర్థించడానికి కాదు. ఎదుగుతున్న కొద్దీ ఆ విషయాన్ని పిల్లలకు తెలియజేస్తూ ఉండాలి కూడా. మమకారంతో సహిస్తున్న విషయాన్ని పిల్లలు అర్థం  చేసుకోకుండా తప్పుడు పనులు కొనసాగిస్తూ ఉంటే..

 సామ, దాన, భేద, దండోపాయాల ద్వారా సరిచెయ్యక తప్పదు. 

అందుకే పద్యంలో ‘శూలికిన్‌’ అనే ప్రయోగం చేయబడింది. 


అసలు పిల్లల్లో ప్రేమ, దయ, సత్యం, ధర్మం, శీలం మొదలైన సద్గుణాలు వృద్ధి చెందాలంటే తల్లిదండ్రులు ఒకరిపట్ల ఒకరు బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతకు మూలం విశాల భావం. అది  ప్రేమవల్ల ఏర్పడుతుంది. ఆ ప్రేమ ఎలా ఉండాలో.. ‘శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్‌’ అనే వాక్యం తెలియజేస్తుంది. 


పర్వతరాజ కన్య అయిన పార్వతి ముఖం పద్మమైతే.. ఆ ముఖ పద్మం వికసించడానికి కారణమయ్యే సూర్యకాంతి పరమశివుడేనట.

అంటే భర్త ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ భార్య ముఖం వికసించిన పద్మంలా ఉండేలా చూడాలన్నమాట.


 ‘బాల శశాంక మౌళికిన్‌’ అనే ప్రయోగం.. పిల్లల్లో ఉండే అమృతప్రాయమైన సద్గుణాలే తల్లిదండ్రులకు నిజమైన ఆభరణాలని తెలియజేస్తోంది. పిల్లల్ని నెత్తికెక్కించుకుంటే చెడిపోతారు. వారిలో ఉండే సద్గుణాలను శిరోధార్యాలని ప్రశంసిస్తే బాగుపడతారు. 


కూలిపని చేసైనా కుటుంబాన్ని పోషించుకోవాలన్నారు. అందకే ‘కపాలికిన్‌’ అనే ప్రయోగం.


 చతుర్విధ పురుషార్థాల్లో మూడోది కామ పురుషార్థం. దంపతుల మధ్యలో కామవాంఛ పురుషార్థ సాధకం. మరోరకంగా అయితే అనర్థదాయకం. ఆ కామసౌఖ్యాన్ని ధర్మబద్ధంగా పొందవచ్చని చెప్పడానికే ‘మన్మథ గర్వపర్వతోన్మూలికిన్‌’ అనే విశేషణం.


 అంతిమంగా ఏ జీవితానికైనా భక్తి, జ్ఞాన, వైరాగ్యాల ద్వారా మోక్షం పొందడమే లక్ష్యమని చెప్పడానికే..

 ‘నారదాది ముని ముఖ్య మనః సరసీరుహాలికిన్‌’ అనే విశేషణం. 


ఇలా శివ ప్రార్థన చేస్తూ కూడా భాగవత కవి పండంటి కాపురానికి దారి చూపించాడు. ఇదీ సంప్రదాయ సాహిత్యంలో ఆధునిక సుగంధం.  


                                                                  - గరికిపాటి నరసింహారావు గారు

కామెంట్‌లు లేవు: