12, నవంబర్ 2020, గురువారం

రామాయణమ్..120

 రామాయణమ్..120

.

రాముడు శరభంగ మహాముని ఆశ్రమంలో ఉండగానే అక్కడ నివసించే మునలంతా ఆయన వద్దకు వెళ్ళారు .

.

వారిలో రకరకాల సంప్రదాయాలు అనుసరించి తపస్సు చేసుకునేవారున్నారు .వారందరూ గుంపుగా ఒకచోట పోగై రాముడిని కలిసి ప్రార్ధించారు. 

.

రామా రక్షకా ! నీవు తప్ప మాకెవరు దిక్కు ? నీ వద్దకు భిక్షుకులుగా వచ్చాము ,అర్ధిస్తున్నాము మాకు ప్రభువు నీవే కదా !

ఇక్ష్వాకులేకదా అనాది కాలంనుండి మాకు దిక్కు .రామా మూడులోకాలలో నీవంటి మహాధనుర్విద్యావేత్త ఎవడూలేడు, అలాంటి నీ పాలనలోకూడా మాకు రాక్షసుల బాధలు తప్పటం లేదు. 

.

మమ్ములను నీవే కాపాడాలి ప్రభూ ! అని ముక్త కంఠంతో మొరపెట్టుకున్నారు వారంతా . 

.

ఓ తాపసులారా మీరు నన్ను ఇలా ప్రార్ధించకూడదు. ఆజ్ఞాపించండి .మీ కోరిక నెరవేరుస్తాను ఇక మీరు నిశ్చింతగా ఉండండి .

.

రాక్షసులు నా పరాక్రమము ,నా తమ్ముడి పరాక్రమము ఇకముందు రుచి చూస్తారు,మీరు గుండెల మీద చెయ్యివేసుకొని ఏ భయమూ లేకుండా మీమీ కార్యాలు చూసుకోండి అని అభయమిచ్చి అక్కడనుండి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం వైపుగా సాగిపోయాడు.

.

చాలాదూరం ప్రయాణం చేసి వారు ఆ ముని ఆశ్రమం చేరుకున్నారు.

.

రాముడిని చూడగానే ఆ ముసలి మునికి ఎక్కడలేని ఉత్సాహము ఉప్పొంగింది ఒక్కుదుటున లేచి ,రామా వచ్చావా! నీకోసమే చూస్తూ ఉన్నానయ్యా అని కౌగలించుకొన్నాడు.

.

మహర్షీ మాకు నివాస యోగ్యమైన ఒక స్థలాన్ని నీవు చూపగలవని శరభంగులవారు మాకు చెప్పినారు. కావున మాకు ఆచోటు చూపించండి స్వామీ అని ప్రార్ధించాడు రాముడు.

.

అంత ఆ మహర్షి రామా ఈ ఆశ్రమవాతావరణం చాలా ఆహ్లాదకరం గా ఉంటుంది నీవు ఇక్కడే వసియించవచ్చు అని అన్నాడు.

.

ఆయన మాటలు విన్న రాముడు ,ధనుర్బాణములతో నేను ఇక్కడ ఉంటె ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలుగవచ్చు కావున వేరొక చోటు చూపించండి స్వామీ అని అడిగాడు.

.

అప్పటికే రాత్రి అయ్యింది ముని ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని అక్కడే విశ్రమించారు మువ్వురూ.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: