12, నవంబర్ 2020, గురువారం

నిజాయితీ

 నిజాయితీ


🍁🍁🍁🍁




ఒకతను ఒకరోజు ఒక పెళ్ళికేళితే అక్కడ తన ప్రాధమిక పాఠశాలలో విద్య నేర్పించిన గురువు గారు తటస్థ పడ్డారు.


ఆయనను చూడగానే ఈ యువకుడు ఆనందంతో ఉబ్బితబ్బియి , ఆయన పాదాలకు నమస్కరించి, నన్ను గుర్తు పట్టారా మాస్టారూ అని గద్గద స్వరంతో అడిగాడు. 


మాస్టారు అన్నారు " నేను గుర్తు పట్టలేదు నాయనా, కొద్దిగా నీ పరిచయం చేసుకో" అన్నారు.


ఆ యువుకుడన్నాడు తన పూర్వ మాష్టారితో " నేనండి, స్వరూప్ ను, నేను మీ దగ్గర మూడవ తరగతిలో ఉండగా నేను తరగతిలో ఇంకో అబ్బాయి వాచ్ దొంగలించాను, మీకు ఆ వుందంతం గుర్తున్నదా, నేను అవమానాలపాలు కాకుండా మీరు కాపాడిన రోజు, నా జీవితాంతం గుర్తుండిపోయే రోజు,మీకు గుర్తు లేకపోతే నేను మీకు విపులంగా చెప్తాను " అన్నాడు.


"ఆ రోజు ఒక అబ్బాయి చాలా అందమైన వాచ్ పెట్టుకొచ్చాడు, నాకు కొనే తహతు లేక , అలాంటి వాచ్ నాకు కావాలి అని ఆ అబ్బాయికి తెలియకుండా నేను దొంగలించాను"


"ఆ అబ్బాయి కొద్దిసేపటి తర్వాత తన వాచ్ పోయిన సంగతి గుర్తించి ఏడుస్తూ మీకు పిర్యాదు చేసాడు"


"మీరు తరగతిలో ఉన్న విద్యార్థులనందరిని బెంచి మీద కళ్ళు మూసుకుని నిలబడమన్నారు.మా జేబులు వెతికి దొంగను పట్టుకొని, ఆ అబ్బాయి వాచ్ అతనికి ఇద్దామని"


అందరితో పాటు నేనుకూడా బెంచి మీద నిలబడ్డాను సన్నగా వణుకుతూ, నాకు వాచ్ దాచడానికి సమయం లేదు, జేబులోంచి తీస్తే నా స్నేహితులు చూస్తారు, నా జేబులో వుండకూడని వాచ్ ఉంది, నాకు "దొంగ" "అబద్దాలకోరు" అన్న ముద్రపడుతుంది కాసేపట్లో, ఎందుకిలా చేసాను అని మనసులో అనుకుంటూ బెంచి మీద నిలబడ్డాను గట్టిగా కళ్ళుమూసుకుని.


మీరు మా వెనకాలనుంచి వచ్చి ఒక్కొక్కరి ఒళ్ళంతా తడిమి, జేబులు వెతకడం ప్రారంభించారు. నా దగ్గరకు వచ్చి అందరిలా నన్ను కూడా వెతికి నా జేబులోని వాచ్ తీసుకున్నారు.అక్కడితో ఆగకుండా నా తరువాత మిగిలిన విద్యార్థులను కూడా వెతికారు. మీరు అందరిని వెతకడం అయిన తరువాత అందరిని కళ్ళు తెరిచి మా మా స్థానంలో కూర్చోమన్నారు. నన్ను పిలిచి క్లాసులో అందరికి చూపిస్తూ నేనే దొంగతనం చేసాను అని పిలుస్తారేమో అని భయపడుతూ కూర్చున్నాను"


"కానీ మీరు, పిల్లలందరికీ వాచ్ చూపించి, ఆ అబ్బాయిని పిలిచి వాచ్ ఇచ్చారు. నన్ను ఒక్కమాట కూడా అనలేదు, నేనే దొంగతనం చేసాను అని క్లాసులో ప్రకటించలేదు.ఆ ఉదంతం ఎవరికి చెప్పలేదు"


ఆ తరువాత నేను అదే పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. ఒక్క మాస్టారు కానీ, నా సహా విద్యార్థులు కానీ ఎప్పుడూ నేను వాచ్ దొంగలిచ్చినట్టు మాట్లాడుకోలేదు, ఎన్నోసార్లు అనుకున్నాను మీరు నా పేరు ఆ రోజు క్లాసులో ప్రకటించి ఉంటే ఆ దొంగతనానికి నెనేంత క్షోభ పడేవాడినో, ఎన్ని అవమానాలు ఎదుర్కొనే వాడినో, ఆ రోజు నా గౌరవం మీరు కాపాడారు"

అని ఎప్పుడో తన చిన్ననాటి సంఘటన గుర్తుచేశాడు మాష్టారుకి,



మాస్టారు అతనికేసి చూస్తే ఆ యువకుడి కళ్ళలో సన్నటి కన్నీటితెర.


"ఇప్పుడు నన్ను గుర్తు పట్టారా? పట్టకుండా ఎలా వుంటారు మాస్టారు?, నేను, మీ విద్యార్థిని, మీకు ఆ రోజు జ్ఞాపకం ఉంది కదా?"


"నేను జీవితంలో మర్చిపోలేని రోజు, మళ్ళీ అలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యకూడదు అని తెలుకున్న రోజు మాస్టారు"


ఆ ఉపాధ్యాయుడు జవాబిచ్చారు ఆ యువకుడికి

" బాబు, ఆ రోజు ఆ వాచ్ ఎవరు దొంగలించారో నాకు గుర్తులేదు, నీతోపాటు నేను అందరి జేబులు నా కళ్ళుమూసుకుని వెతికాను"



🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: