12, నవంబర్ 2020, గురువారం

వ్యక్తిత్వవికాసం

 వ్యక్తిత్వవికాసం


🍁🍁🍁🍁🍁


ఒక వ్యక్తిని గురించి చెప్పమంటే ఏమి చెప్తారు? అతడు ఎలా మాట్లాడతాడో, ఎలా ప్రవర్తిస్తాడో వివరిస్తారు. అంతే కదా! అంటే వ్యక్తిత్వం లో ఉండే ముఖ్యమైన అంశాలు మాటలు, చేతలు. 


ఇవి ఎక్కడ నుంచి పుడతాయి? 


ఇవి ఆలోచనలలో నుంచి పుడతాయి. కాబట్టి మీరు బహుశా అతడి ఆలోచనల గురించి కూడా కొంత వ్యాఖ్యానిస్తారేమో. కాబట్టి మొత్తం మీద ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం అతడి మాటలు, చేతలు, ఆలోచనలను గురించి మాట్లాడతాం.


వ్యక్తిత్వంతోపాటు శీలం (స్వభావం) అనేది కూడా ఒక ముఖ్యమైన మాట. ఇవి రెండూ ఒకే అర్థాన్ని సూచించేవే అయినా ప్రస్తుతం మనం అర్థం చేసుకోవడానికి వ్యక్తిత్వం కంటే శీలం అనేది ఇంకొంచెం లోతైనది అని అనుకుందాం. 


వ్యక్తిత్వం ఒక మనిషిలో ప్రస్ఫుటంగా పైకి కనిపించేది అయితే శీలం మరింత లోతుగా ఉండి, మరింత లోతైన పరిశీలన వల్ల మాత్రమే బయటపడుతుంది. 

మరొకవైపు వ్యక్తిత్వం అంటే మనిషి ఎంత అందంగా ఉన్నాడో చెప్పేది కాదు


. బట్టలు ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా తల దువ్వుకున్నాడు అన్నది కాదు. అవి కూడా ముఖ్యమే కానీ కేవలం అవే ముఖ్యం కావు. ఆడవారి కట్టూబొట్టూ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. 


వివేకానంద స్వామి పాశ్చాత్య దేశాలలో మాట్లాడుతూ, “మీ దేశంలో ఒక టైలర్ ఒక 'జెంటిల్ మేన్'ని తయారుచేస్తాడు. 


మా దేశంలో ఒక మనిషి వ్యక్తిత్వమే అతణ్ణి గౌరవనీయుడిగా చేస్తుంది” అని చెప్పారు.


 వ్యక్తిత్వం అంటే ఏమిటో, పరిపూర్ణమైన వ్యక్తి అనేవాడు ఎలా ఉంటాడో స్వామీజీ విస్తారంగా వివరించారు. వ్యక్తి స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ మాత్రమేకాక అణగారిన వర్గాల అభివృద్ధిని సాధించడంలోనూ, తద్వారా దేశప్రగతినీ, నిజమైన స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసం, వివిధ స్థాయులలో మనుష్యుల వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలో ఆయన గొప్ప ముందు చూపుతో వివరించారు.


 వ్యక్తిత్వం గురించి వివేకానంద స్వామి బోధనలన్నింటినీ క్రోడీకరించినట్లయితే మనం దానిని ఇలా ఒక సూత్రం రూపంలో వ్రాయవచ్చు.


చెప్పిన మాటలను (హారం) ఎంత వరకూ చేసి చూపిస్తున్నారన్న దానిని (లవం) ఒక నిష్పత్తి రూపంలో వ్రాశామనుకోండి. అప్పుడు ఒక మనిషి తాను ఆడిన మాటను తప్పకుండా ఎంతవరకూ చేతలలో చూపిస్తున్నాడో ఆ సూత్రం ద్వారా అంచనా వెయ్యవచ్చు.


                      వ్యక్తిత్వం

      చేతలు =  --------------

                       మాటలు 


ఈ సూత్రాన్ని మీరు దైనందిన జీవితంలో ప్రయోగించి చూసినప్పుడు అధికశాతం మనుష్యులలో ఆ నిష్పత్తి విలువలు ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే ఉంటాయని గమనించవచ్చు.


మామూలు మనుష్యులందరూ ఈ స్థితిలోనే ఉంటారు.

ఆ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటే ఆ మనిషి మాట్లాడిన మాటల్ని తన చేతలలో పూర్తిగా నిలబెట్టుకోలేకపోతున్నాడని అర్థం. దుర్మార్గుల విషయంలో మాట్లాడేది ఎక్కువ, ఆచరించేది తక్కువ అనీ, లేకపోతే చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని అర్థం. 


తన మాటల్ని పూర్తిగా చేతలలో చూపేవాడికి అంటే "ఆడి తప్పనివాడికి” ఈ నిష్పత్తి ఒకటి అవుతుంది. అప్పుడు ఆ మనిషి ఒక పరిపూర్ణమైన వ్యక్తి - పూర్తి నిజాయితీ గలవాడు అవుతాడు.


దీనినే ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఒక వ్యక్తి శీలాన్ని కూడా ఒక సూత్రం రూపంలో రాస్తే


                 (చేతలు + మాటలు)

     శీలం =  -----------------------------

                       ఆలోచనలు


ఇలా చెప్పిన మాటలను చేతలలో చూపడమే కాక మనస్సులో ఏది ఆలోచిస్తాడో దానినే మాట్లాడి, దానినే చేతలలో చూపగలిగే వ్యక్తి ఎంత గొప్పవాడో ఊహించడానికి ప్రయత్నించండి.


అలా ఎవరైతే తన మాటల్ని, చేతల్ని తన ఆలోచనలతో

సమానం చెయ్యగలుగుతాడో అంటే ఏది ఆలోచిస్తే దానినే మాటలలో, చేతలలో చూపుతాడో అతడు అత్యున్నతుడైన

శీలవంతుడవుతాడు. 


మరొకవైపు నుంచి చూసినప్పుడు ఈ నిష్పత్తి విలువ కనుక ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి అతిగా ప్రవర్తించేవాడు, లేకపోతే పిచ్చివాడు అయివుంటాడు. (మహాత్ములైన మనుష్యుల విషయంలో ఈ సూత్రాలు కొన్ని సందర్భాలలో వర్తించవు. అయితే మనలాంటి మామూలు మనుష్యుల అవసరాలకు చాలావరకూ సరిపోతాయి.)


వివేకానంద...

“మీ ఆలోచనలను, మాటలను ఒకటిగా చేయగలిగితే, - నేను మరొక్కసారి ఘంటాపథంగా చెపుతున్నాను. మీ మాటలను, చేతలను సంపూర్ణంగా ఒకటిగా చెయ్యగలిగితే

మీ కాళ్ళ దగ్గరికి డబ్బు ధారాళంగా ప్రవహిస్తుంది” అని చెప్పిన మాటలను ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. 


ఆ మాటలకు అర్థం మీరు తలపెట్టిన పనులన్నింటినీ సాధించగలుగుతారనే. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తికి ఎదురుండదు. 


వ్యక్తిత్వ నిర్మాణం గురించి, శీలనిర్మాణం గురించి వివేకానంద స్వామి ఇలా ఒక్క మాటలో తేల్చి చెప్పారని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: