12, నవంబర్ 2020, గురువారం

రామేశ్వర లింగము

 Sri Siva Maha Puranam -- 18 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


రామేశ్వర లింగము


రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు.  పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ఈశ్వరా ! లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నా కంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట.  రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు.

స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా

పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!

ఈశ్వరా! నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి.   నన్ను అనుగ్రహించమని  అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగమనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అన్నాడు. శివుడే  శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు.  రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించి ‘సీతా! ఇదిగో సేతువు. అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉన్నది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు.

ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము.  ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగము తయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ

‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని  ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు.  అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది.  దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు.  రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది  దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి.

రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉన్నది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు.  రైల్వేస్టేషనులోనే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు.

అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉన్నది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉన్నది.  అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల  తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం.  నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది.

ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నారు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వారు  సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నారు.  అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది.  రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు.  రామేశ్వరం వెడదాం అనుకున్నానని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెడితే  ఆయనే  రామేశ్వరం తీసుకువెడతాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

కామెంట్‌లు లేవు: