2, ఆగస్టు 2020, ఆదివారం

రామాయణమ్.. 18

గంగ భూమిమీదకు ఎలా అవతరించింది మహర్షీ ! చాలా ఉత్సుకతతో ప్రశ్నించాడు రాముడు .
.
రామా ,చెపుతాను విను అంటూ మొదలు పెట్టారు విశ్వామిత్ర మహర్షి! 
.
హిమవంతుడికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కొమరిత గంగ రెండవ ఆవిడ ఉమ.
.
పెద్ద కూతురు గంగను ఆయన దేవతల కోరిక మీద వారికి ఇచ్చివేయగా ఆవిడ దేవలోకం వెళ్లి పోయింది!
.
రెండవకూతురు ఉమ శంకరుని ఇల్లాలయింది.
.
పూర్వం అయోధ్య ను సగరుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు ! ఆతడు మీ ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాజు .
ఆయన కు ఇద్దరు భార్యలు పెద్దభార్యపేరు కేశిని,రెండవ భార్య సుమతి!.
.
సంతానార్ధియై సగరుడు భార్యలతో కూడి భృగుప్రస్రవణము అనే పర్వతం మీద ఘోరతపస్సు చేశాడు.
.
ఆయన తపస్సుకు మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై నీకు ఒక భార్యయందు వంశమును నిలిపే ఒక కుమారుడు ,ఇంకొక భార్యయందు మహాబలవంతులైన అరువది వేల మంది  పుత్రులు కలుగుతారు అని దీవిస్తాడు .
.
అప్పుడు సగరుని పెద్దభార్య కేశిని తనకు ఒక్క కుమారుడు చాలు అనగా ఆవిడ యందు అసమంజుడు అనే మహాబలశాలి యైన పుత్రుడు జన్మిస్తాడు .
.
చిన్నభార్య సుమతి యందు అరవైవేలమంది సగరులు జన్మిస్తారు.
.
అసమంజుడు పేరుకు తగ్గట్టుగా అసమంజసమైన ,వికృతమైన చేష్టలకు పెట్టింది పేరు .అతను పసి పిల్లలను పట్టుకొని సరయూ నదిలో ముంచి వారు మునకలేస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందేవాడు ! 
.
ఈ దుశ్చర్యలు భరించలేక దేశ ప్రజలు సగరుడి వద్ద మొర పెట్టుకొంటారు .
.
కొడుకు అనే పక్షపాతము కూడా లేకుండా అసమంజుడికి దేశబహిష్కరణ శిక్ష విధిస్తాడు సగరుడు. అయితే అప్పటికే అసమంజుడికి అంశుమంతుడు అనే వీరాధివీరుడు,బుద్ధిమంతుడు అయిన పుత్రుడు ఉంటాడు! 
ఆలుబిడ్డలను వదిలిపెట్టి కట్టుబట్టలతో దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు అసమంజుడు.
.
ఇలా చాలా కాలం గడచిన తరువాత సగరుడికి అశ్వమేధయాగము చేయాలనే కోరిక పుట్టింది!.
.
యాగాశ్వమును స్వేచ్ఛగా వదిలాడు దానిని దుర్బుద్ధియై ఇంద్రుడు అపహరించి పాతాళంలో కపిలముని ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు..
.
యాగాశ్వాన్ని వెతుక్కుంటూ అరవై వేలమంది సగరులూ బయలుదేరారు భూమి నాలుగు చెరగులా వెతికారు ,అణువణువూ శోధించారు ఎక్కడా వారికి అశ్వము జాడ కనపడలేదు ..
.
ఇక లాభంలేదు అని భూమిని అన్నివైపుల నుండి బద్దలు కొట్టి పాతాళానికి పయనమయ్యారు. పాతాళలోకంలో ఒక చోట కపిల ముని ఆశ్రమంలో గడ్డిమేస్తూ కనపడ్డది అశ్వము.
.
కపిలముని అపహరించాడనే అపోహతో ఆయన మీద యుద్ధానికి వెళ్ళగా ఆయన ఆగ్రహజ్వాలలో మాడి మసి అయి బూడిద కుప్పలుగా మారారు సగరులు.
.
పుత్రులు ఎంతకీ రాక పోయేసరికి చింత పట్టుకున్నది సగరుడికి.
మనుమడు అంశుమంతుని వారి జాడ కనుగొనమని పంపినాడు .
.
N.B
..
శిక్షలు విధించడంలో ఇక్ష్వాకులు స్వ, పర భేదాలు పాటించరు!
న్యాయం అందరికీ ఒకటే ! సగరుడయినా ,రాముడయినా అదే ధర్మం పాటించారు ,అందుకే చిరకాలం భూమి మీద యశఃకాయులైనారు.
మన ఇప్పటి తరాలకు ఈ కధలు అందించే నైతిక బలం అపారం ! ఇలాంటి కధలు విస్త్రుతంగా ప్రచారం చేద్దాం.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: