9, ఆగస్టు 2020, ఆదివారం

*సాక్షి* దినపత్రికలో వ్యాసం

🌹 *యుగకర్త చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి* // "కవనార్థంబుదయించితిన్,  సుకవితా కార్యంబు నా వృత్తి", 
అని చెప్పుకున్నాడు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి.చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణము చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న  మహాకవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి ఆస్థానకవి.1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది.అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది.యుగపురుషుడే కాదు.యోగపురుషుడు కూడా. తిరుపతి వేంకటకవులుగా జగత్ ప్రసిద్ధులైన ఈ జంటలో అగ్రజుడు చెళ్ళపిళ్ళ. దివాకర్ల తిరుపతిశాస్త్రి కంటే ఒకటిన్నర సంవత్సరం పెద్దవాడు. దివాకర్ల కంటే ముందుగానే అవధాన ప్రదర్శనకు శ్రీకారం చుట్టిన  పద్యయోధుడు చెళ్ళపిళ్ళ.ఈ మహాకవి పుట్టి  నేటికి 150ఏళ్ళు పూర్తయ్యాయి.1870,ఆగస్టు 8వ తేదీ నాడు తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించాడు.తల్లి దండ్రులు చంద్రమ్మ, కామయ్య.అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి, తన  గళానికి, కలానికి ఎదురులేదని నిరూపించుకున్నాడు. వీరింట్లో పూర్వుల్లో కవిత్వం ఉంది. వీరి ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే గ్రంథాలు రచించాడు. చిన్ననాడు చూసిన తాళపత్ర గ్రంథాలు చెళ్ళపిళ్ళపై అపురూపమైన ముద్ర వేశాయి.వీరి విద్యాభ్యాసం చాలా గ్రామాల్లో సాగింది.కాశీ కూడా వెళ్ళాడు.పాండిత్యంతో పాటు వివిధ సారస్వత అంశాలు గ్రహించి వచ్చాడు. కవితా జీవితంలో అవధానకవిగా నానా రాజ సందర్శనం చేసి అఖండ యశస్సు పొందాడు.  ఎంతమంది దగ్గర విద్యాభ్యాసం చేసినా, చర్ల బ్రహ్మయ్యశాస్త్రినే ప్రధాన గురువుగా భావించాడు.వెంకటశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఇతని అసలు పేరు వెంకటాచలం. జంటకవిత్వానికి, అవధాన విద్యకు, పద్యనాటకాలకు వీరు తెచ్చిన మోజు అంత ఇంతా కాదు. చెళ్ళపిళ్ళ ప్రభావం ఈ తెలుగునేలపై చాలా ఎక్కువ.తదనంతర జీవితంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరో కవి,పండితులు చెళ్ళపిళ్ళ శిష్యులే కావడం విశేషం.చెళ్ళపిళ్ళ మా  గురువని చెప్పుకోవడమే ఆ కాలంలో అంత గొప్ప.బందరు(మచిలీపట్నం)లో హైస్కూల్ లో అధ్యాపకుడుగా పనిచేయడం చెళ్ళపిళ్ళకు బాగా కలిసొచ్చిన అంశం.విశ్వనాథ సత్యనారాయణ,వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళికాటూరి, వేలూరి శివరామశాస్త్రి  వంటివారెందరో బందరులో స్కూల్లో ఈయన దగ్గర   చదువుకున్నారు.వీరికి శిష్యగణం, శత్రుగణం, భక్తగణం  ఆన్నీ  ఎక్కువే.ఎవరినైనా సరే ఎదిరించాలి,గెలవాలి,  గుర్తింపు తెచ్చుకోవాలి, అనే  పట్టుదల చెళ్లపిళ్లకు మొదటి నుండీ ఉంది. గురువు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, శిష్యులు వెంకటరామకృష్ణకవులతోనూ విభేదాలు వచ్చాయి. సాటి  కవులు, సంస్థాన పండితులు, దివాన్లతోనూ వివాదాలు వచ్చాయి. సంచలనాత్మమైన యుద్ధం కొప్పరపు సోదరకవులతో జరిగింది.  ఈ వివాదాలు ఆధునిక సాహిత్య చరిత్రలో సుప్రసిద్ధం.చెళ్ళపిళ్ళ గుంటూరుసీమ అనే గ్రంథమే రాయాల్సి వచ్చింది. లక్కవరం జమిందార్ రాజా మంత్రిప్రగడ భుజంగారావు బహుద్దర్ కలుగజేసుకొని,  ఈ  వివాదాలకు  ముగింపు పలికారు.వివాదాలు ఎలా ఉన్నా, అద్భుతమైన పద్యాలు తెలుగునాట సందడి చేశాయి.భాషా పరిపుష్ఠి జరిగింది. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ళ ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగారు.శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి -చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండులో బాహాబాహీకి దిగి, ఇద్దరూ చెప్పులు చూపించుకునే స్థాయికి వీరి వాగ్వాదం వెళ్ళిపోయింది.వీరి  వివాద సాహిత్యం పుంఖానుపుంఖాలుగా వచ్చింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి.అద్భుతమైన ధారణ ఈయన సొత్తు.పద్య పఠనం పరమాద్భుతం.సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది.కొంతకాలం సాధన కూడా చేశారు.పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు,పిట్టకథలు,సామెతలతో   చెళ్ళపిళ్ళ ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవసించేవారు."మంచి కవిత్వం అంటే ఏమిటి", అనే అంశంపై  విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో,  చెళ్ళపిళ్ళ 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు.ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్ళపిళ్ళ మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు.వెంకటశాస్త్రికి ధిషణ, ధిషణాహంకారం,లౌక్యం ఆన్నీ ఎక్కువే. అదే సమయంలో మెత్తని మనస్సు కూడా. తన ఎద ఎల్ల మెత్తన,శిష్యులన్న ఎడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన, అని అందుకే విశ్వనాథ అన్నాడు.చెళ్ళపిళ్ళ జంటకు కొప్పరపు సోదరకవులతో కొంత కాలం వివాదాలు నడిచినా, తదనంతరం, చెళ్ళపిళ్ళ  దగ్గరుండి కొప్పరపుకవుల కుమారులతో  అవధానాలు చేయించాడు. వానలో తడవని వారు, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కవితాధారలో మునగనివారు తెలుగు జగాన లేరు.అంతటి ఆకర్షణ,చమత్కారభరితమైన శైలి  చెళ్ళపిళ్ళ సొత్తు. తొలిరోజుల్లో, సంస్కృత సమాస చాలనా జ్వలితమైన కవిత్వం వ్రాసినా, తర్వాత కాలంలో తెలుగుకవిత్వం వైపు మళ్లారు. ఎన్నో కావ్యాలు, శతకాలు, అనువాదాలు,  నాటకాలు రాశారు. పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు.ఎందరో కళాకారులకు అన్నంపెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై  కూర్చోపెట్టిన ఘనత వీరిదే. తద్వారా, వాడుకభాషకు వీరు చేసిన సేవ అనుపమానం.గొల్లలకు, గొడ్లకాపరులకూ తెలిసే స్థితిలో నా కవిత్వం ఉంటుందని చెప్పుకున్న చెళ్ళపిళ్ళ, ఆ మాట అక్షరాలా నిలబెట్టుకున్నాడు.ఇదొక భాషాపరమైన విప్లవం.ఇది ఎందరికో చైతన్యాన్ని నింపింది. చెళ్లపిళ్లది ఎంతటి ధారాశుద్ధి బంధురమైన పద్య కవిత్వమో, అంతటి చక్కని వచన రచనం కూడా. చెళ్ళపిళ్ళవారి రచనలు చదవడం ప్రారంభిస్తే, చివరి అక్షరం వరకూ ఆగకుండా చదివిస్తాయి. అంతటి ఆకర్షణా శిల్పం ఆ రచనలో ఉంటుంది. కథలు-గాథలు, దీనికి చక్కని ఉదాహరణ.తిరుపతి కవిజంటలో మీసాలు పెంచింది కూడా ఈయనే.తెలుగు పద్యాన్ని ఏనుగుపై ఊరేగించాడు.పద్యాలను ప్రబంధాల కౌగిళ్ళ నుండి బయటకు తెచ్చి, ప్రజల నాలుకలపై నర్తనం చేయించాడు. ఏనుగునెక్కినాము, ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము, అంటూ పద్యపౌరుషంతో జీవించిన యుగపురుషుడు చెళ్ళపిళ్ళ. తెలుగుపద్య జండాపై నిలిచిన కవిరాజు,యుగకర్త చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (ఈ వ్యాస రచయిత కొప్పరపుకవుల మనుమడు)🙏
***********************

కామెంట్‌లు లేవు: