25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*వసుదేవుడు గాడిద కాళ్ళు*

 


వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు అంటుంటారు. వసుదేవుడంతవాడు గాడిద కళ్ళెందుకు పట్టుకోవలసి వచ్చింది, అసలు గాడిద కాళ్ళు పట్టుకున్నాడా? భాగవతంలో చూదాం..రండి...


భాగవతంలో ఎక్కడా వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్న సందర్భం కనపడలేదు. పరమాత్మ పుట్టడమే నాలుగు చేతులతో శంఖ, చక్ర,గద లతో పుట్టేరు, తల్లితండ్రులకు అలా దర్శనమిచ్చి ఆ తరవాత మామూలు బాలకుడయ్యాడని భాగవతం చెబుతోంది. ఆ సమయం లో లోకమంతా గాఢ సుషుప్తిలో ఉన్నదని భాగవతం మాట. కాని లోకం మాటేంటంటే, పరమాత్మని తలపై బుట్టలో ఉంచుకుని తీసుకు వెళుతున్న వసుదేవుని చూసి గాడిద ఓండ్ర పెట్టిందనీ, ఆ అరుపుకు కావలివారు లేస్తే పరమాత్మని వ్రేపల్లె చేర్చడం కుదరకపోవచ్చు గనక ఓండ్ర పెట్టద్దని వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు. లోకమంతా గాఢ సుషుప్తిలో ఉండగా ఈ గాడిద మాత్రం ఎలా మెలుకువగా ఉండగలిగింది? ఈ ప్రశ్న అడిగినవారూ లేరు, దీనికి సమాధానమూ లేదు.


మనం కొంచం ముందుకెళ్ళి దేవకి, వసుదేవుల గురించి కంసుని గురించి చూదాం. 


దేవకి కంసుని పినతండ్రి కూతురు. తోడబుట్టిన చెల్లెల్లు కాకపోయినా కంసుడు దేవకి పై ప్రేమ చూపాడు. వసుదేవునికిచ్చి దేవకిని వివాహం చేసిన సందర్భంలో స్వయంగా రథం నడుపుతూ, దేవకిని అత్తవారింటికంపుతున్న సందర్భం. ఇంత ఆనందకర సందోహంలో ఆకాశవాణి అసదర్భంగా ఇలా పలికింది. ”కంసా! ఇంత ఆప్యాయతతో అత్తవారింటికంపుతున్న ఈమె అష్టమ గర్భం నీకు మారకం కలగజేస్తుందీ” విన్న కంసుడు విచలితుడై చరాలున కత్తి దూసి దేవకిని సంహరించడానికి పూనుకుంటాడు. ఆ సందర్భంగా వసుదేవుడు పలికిన పలుకులు చిత్తగించండి. 


”దేవకి కి అన్నవు కదయ్యా! చీరలు,సారెలు పెట్టడమో,చక్కగా మాటాడటమో చేయాలిగాని, ఆకాశవాణి చెప్పిందని, అది నిజమనీ నమ్మి 

చెల్లెలిని చంపకు! ఆలోచించు,తొందరపడకు” అని బతిమాలాడాడు. కోపం మీద ఉన్న కంసుడు కంగలేదు. దాంతో మళ్ళీ నీ చెల్లెలు ముద్దరాలు, ఏమీ తెలియనిది, నీ క్షేమమే ఎప్పుడూ కోరేది అటువంటి దానిని బయటవారి మాట పట్టుకుని చంపుకుంటావా? అని నిలదీసాడు.నువ్వు పుట్టడంతోనే కూడా మృత్యువూ పుట్టింది, ఇప్పుడో మరో నూరేళ్ళకో చావు తప్పదు అంటూ


కర్మంబులు మేలునిచ్చును, గర్మంబులు కీడు నిచ్చు కర్తలు దనకున్

గర్మములు బ్రహ్మకైనను,గర్మగుడై వరల దడవగా నేమిటికిన్.....


ఇంత చెప్పినా కంసుడు వినలేదు.ఇలా మరికొన్ని మాటలు చెబుతూ వసుదేవుడు ఆలోచించాడు తనలో.

''ఎంతదాకా వీలుంటే అంతదాకా ప్రయత్నం చేయాలి కదా అనుకుని కష్టంలో ఉన్న దేవకిని రక్షించాలంటే కొడుకుల్ని ఇచ్చేస్తాను అని చెప్పడం మంచిది కదా! ఇప్పుడీమె ప్రాణాలు దక్కితే రేపేమవుతుందో ఎవరికెరుక? కొడుకులు పుడితే వారి చావు వెంట వస్తే తప్పించగలవారెవరు? అంతెందుకు వీడు బ్రహ్మరాత కొద్దీ రేపటికేమవుతాడో ఎవరి కెరుక? వీడి కర్మ ఎలారాసి ఉందో ఎవరికి తెలుసు? అందుకని కొడుకులనిస్తానని భార్యను విడిపించుకోవడం నేటి నీతి,కర్తవ్యం'' అని తలపోసి ”కొడుకుల్ని ఇచ్చేస్తాను దేవకిని వదిలేయ”మంటే అలాగేనని ఒప్పుకుని వారిని నగరులోని సౌధంలో ఉంచాడు. నజర్ బంద్ అనమాట అంటే కళ్ళెదురుగా ఎక్కడికి పోకుండా బందీగా మహల్ లోనే ఉంచటం. హవుస్ అరస్ట్. అలా బందీగా ఉండడానికే వసుదేవుడు ఇష్టపడ్డాడు. నీ చెల్లెలు, ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, దీనికి పుట్టే వాడు నీ ప్రాణహానికి కారణమని, నీ చెల్లిని చంపుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో నాకేం, మరో పెళ్ళాం దొరకదా! అని వదిలేసిపోక కంసుని గాడిదను చేసి,

కాళ్ళు పట్టుకున్నంత పని చేసి దేవకిని రక్షించుకున్నాడు.

కామెంట్‌లు లేవు: