19, సెప్టెంబర్ 2020, శనివారం

శ్రీ సీతారామ కల్యాణం

 పద్యభారతీసంతతికి ప్రణామాలు. 

శ్రీ సీతారామ కల్యాణం అనే గ్రంథంలో 220, 221 పద్యములు. 

      ప్రభాతాయాం తు శర్వర్యాం 

      కృతపౌర్వాహ్ణికక్రియౌ।

      విశ్వామిత్ర మృషీం శ్చాన్యాన్

      సహితా వభిజగ్మతుః॥-1.31.2

          ........................

     మైథిలస్య నరశ్రేష్ఠ 

     జనకస్య భవిష్యతి।

    యజ్ఞః పరమ ధర్మిష్ఠ

    స్తత్ర యాస్యామహే వయమ్॥-1.30.6

అని విరచించిన వాల్మీకి మహర్షికి ప్రణామాలు. 

        యజ్ఞమును సంరక్షించిన రామలక్ష్మణులు ఆ నాటి రాత్రి సిద్ధాశ్రమంలో నిశ్చింతగా హాయిగా నిద్రించినారు. వారిరువురు వేకువనే నిద్రలేచి ప్రాతఃకాల సంధ్యావందనాది పూజావిధులను పూర్తిచేసి ఏమాత్రము గర్వమును పొందకుండా విశ్వామిత్ర మహర్షిని చూచేందుకు వెళ్లినారు. రాజకుమారులైన రామలక్ష్మణులు మునిరాజైన కౌశికుని చూచి కింకరుల వలె మెలగుతూ ఎంతో వినయంతో నమస్కరించినారు. రాముని చూచి గాధిజుడు సంతోషిస్తూ ఉండగా అచ్చట ఉన్న మునులు “ఓ రఘురామా! మనం మిథిలకు వెళ్దాము. ఆ నగరంలో ఒక గొప్ప యజ్ఞము జరుగగలదు. అచ్చటికి వెళ్లినట్లైతే మనం ఆ యజ్ఞముతో పాటు మహిమాన్వితమైన శివధనుస్సును కూడా చూడవచ్చు అని రామునికి మిథిలానగర విశేషములను వివరింపసాగినారు. 

          ఈ విషయాన్ని ఈ పద్యములలో తెలియజేస్తూ ఉన్నాను. 


అంతట రామలక్ష్మణులు హాయిగ రాత్రి పరుండినారు, ని

శ్చింతగ లేచి వేకువన శ్రీకర సంధ్యల వార్చినార లా

వంతయు గర్వమందక మహర్షినిఁ జూడగఁ నేగినారు త

చ్చింత దొలంగినన్ వినయశీలతఁ గింకరులై చరింపగన్.{220}


రాముడు లక్ష్మణుండు మునిరాజునుఁజేరి నమస్కరింపగా

రామునిఁ జూచి కౌశికుడు రంజిల మౌనులు వల్కి రిట్టులన్

“రామ! చనంగనౌ మిథిల, రాజిలు నచ్చట దివ్య యజ్ఞ, మా

సీమ మహేశదత్తమగు శ్రేష్ఠధనుస్సునుఁ జూడగా నగున్.{221}

           రచన:-కోట రాజశేఖర్, కోవూరు, నెల్లూరు.

కామెంట్‌లు లేవు: