12, అక్టోబర్ 2020, సోమవారం

మహాభారతము ' ...48.

 మహాభారతము ' ...48. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


రాజసూయ యాగంలోని అంతిమ ఘట్టమైన అగ్రపూజ సందర్భంలో, శ్రీకృష్ణునికి అగ్రాసనమిచ్చి నిండుసభలో పాండునందనులు సత్కరిస్తుండగా, శిశుపాలుడు, ఓక్క వుదుటున లేచి నిలబడి ' ధర్మరాజా ! నేను చూస్తున్నది నిజమేనా ! సభలో యింత మంది యోగ్యులు, మహానుభావులు, వీరులు వుండగా, నీవు యీ కృష్ణునికి అగ్రస్థానం యివ్వడం, యాగానికి వచ్చినవారినందరినీ, పరిహాసం చేస్తున్నట్లు వున్నది. '


' సరే ! మీకైతే, వయసు పరిణితి చెందలేదు, యుక్తాయుక్తాలు తెలియవు. భీష్మ పితామహా ! నీ బుద్ధి ఏమైనదయ్యా ? మీరు వృద్ద్ధులైనందున, మీరుసరిగా నిర్ణయించలేక పోయినట్లున్నారు. నాలాంటి విజ్ఞులు యీసభలో యెందరోవున్నారు. వారిని సంప్రదించి వుండవచ్చు కదా ! ఈ కృష్ణునిలో యేమి ఉత్కృష్టమైన గుణాలుచూసి, పరమపూజ్యుడిగా మీరు నిర్ణయించారు ? '


' వయసులో పెద్దవాడా ? వయసే కొలమానం అయితే, ఆతని తండ్రి వసుదేవునికి అగ్రస్థానం యివ్వవచ్చుకదా ! పోనీ, ఆప్తబంధువా ? ద్రుపదునికంటే, ఆత్మబంధువులు, శ్రేయోభిలాషులు అయి వుండడు కదా ! గురుతుల్యుడా ? మరి ద్రోణుని సంగతేమిటి ? వేదవేద్యుడా ? సభలో వున్న వేదవ్యాసునికంటే ఘనుడా ! '


' ఇది మేము చేస్తున్నపూజ, మా యిష్టంవచ్చినవారికి అగ్రస్థానం యిస్తాము అంటారా ? అది మీ వ్యక్తిగతం. కానీ, యిది నిండు పేరోలగం. మీ చర్య,యెందరో పెద్దలను అవమాన పరుస్తున్నది. అట్టిపూజలు మీగృహంలో నిరభ్యంతరంగా చేసుకోండి. '


అని ప్రేలాపనలు చేస్తూ శిశుపాలుడు సభికులనుద్దేశించి ' మహావీరులారా ! ఈతడు ధర్మరాజని, మనం అభిమానంతో కానుకలు తెచ్చి, కప్పాలు గట్టి, యాగదర్శనకు వచ్చాము. ఇప్పుడు తెలిసిపోయింది. ఈతడు అధర్మరాజని. లేవండి ! మీ విముఖత కూడా తెలియజేయండి. ' అని నాలుగువైపులా చూస్తూ అన్నాడు. అయితే, సభికులలో యెవరూ, శిశుపాలునితో ఏకిభవించలేదు. మౌనంగా, తమ పెద్దరికం నిలుపుకుని సభా మర్యాద కాపాడారు. ఎవరో ఒకరిద్దరు శిశుపాలుని జతగాళ్ళు, లేచీ లేవనట్లు లేచి నిల్చున్నారు.


అయినా, శిశుపాలునికి తాను చేస్తున్న ప్రేలాపనలో తప్పు తెలియలేదు. ఇంకా తన వాచాలత్వం కొనసాగిస్తూ ' ధర్మరాజు అతని సోదరులు, నీకు బంధువులు, నీకన్నా చిన్నవారు. వారి అమాయకత్వంతో నీకు అగ్రస్థానం యిస్తేమటుకు, తగుదునమ్మా అని నీవెట్లా అంగీకరించావు ? ' అని కృష్ణుని పలురకాల దుర్భాషలాడుతూ, తనకు వంతపాడే బహుకొద్దిమంది రాజులతో సహా పైకి లేచాడు, సభ ముగియకుండానే, వెళ్ళడానికి ఉద్యుక్తుడై, సభామర్యాద అంటే తెలియని శిశుపాలుడు.


ఇంత జరిగినా, ధర్మరాజు శాంతంగా ' శిశుపాలా ! ఇతరులను కఠినవచనాలతో దూషించడం, అకారణంగా ఆక్షేపించడం, విజ్ఞులుచేసే పనికాదు. అందునా, శ్రీకృష్ణుని ఔన్నత్యం తెలియక, నీవిట్లు మాట్లాడడం నీకే మంచిది కాదు. భీష్ముని కూడా తూలనాడావు. తోటిరాజులు అనేకమంది వున్న సభలో, వారు మౌనంగా వున్నా రెచ్చకొట్టి సభను కలుషితం చేయవలెనని చూడడం నీకున్యాయమా ? దయచేసి శాంతించు. సభాగౌరవాన్ని కాపాడి, సభ ముగిసేవరకు వుండి, మాసపర్యలు స్వీకరించు. ఇది మా పాండునందనుల అందరి విన్నపం. ' అని అన్నాడు.


ఆసమయంలో భీష్ముడు కూడా కలిపించుకుని, ' ధర్మనందనా ! అనవసర వాద ప్రతివాదాలకు యిది సమయంకాదు. అగ్రపూజ అందుకుంటున్న శ్రీకృష్ణునకు, యిది ఇబ్బందికరంగా కాకూడదు. సభ నడిపించి, అర్ఘ్యతాంబూలాలు, అగ్రపూజ అందుకుంటున్న ఆ పరమాత్మకు అందజెయ్యి. ' అని సూచించాడు. శిశుపాలుని వైపు తిరిగి, ' శిశుపాలా నీవు చేసినది యుక్తమైన పనికాదు. నీ నడవడి మార్చుకో. శ్రీకృష్ణుడు పురుషోత్తముడు. ఆయన సూర్యుడు. మిగిలినవారు యెంతటివారైనా దివిటీల లాంటి వారు మాత్రమే. నీ ఆగ్రహం చాలించి, ఆశీనుడవు కమ్ము. ఇది నా సలహా ! ' అని స్పష్టం చేశాడు భీష్ముడు. 


ఇక యెప్పుడూ పరమశాంతంగా అన్నల వెనుకవుండే సహదేవుడైతే, ' శ్రీకృషుని గురించి పరుషంగా యింకొక్కమాట యెవరైనా మాట్లాడితే, వారి శిరస్సును నా యెడమకాలి క్రింద వేసి తొక్కేస్తాను. ' అని అన్నాడు. అతని మాటలను సభికులంతా హర్షధ్వానాలు చేశారు. ఒక్కరూ వ్యతిరేకించలేదు. పైనుండి యాగం వీక్షిస్తున్న దేవతలుకూడా ' భళా ' అంటూ సహదేవునిపై పుష్పవృష్టి కురిపించారు.        


అంతవరకు, మౌనంగా వున్న నారదముని లేచి, ' శ్రీకృష్ణుని దేవుడని తెలుసుకోనివారు, ఆయనని అర్చించకపోగా, విమర్శించేవారు, జీవన్మృత్యులు. అనగా బ్రతికివుండీ మరణించినవారిలో సమానం. ' అని మాత్రం చెప్పి కూర్చున్నాడు.


పాండుకుమారులు తిరిగి కృష్ణుని పూజకు వుపక్రమించగా, యింతమంది యిన్నిరకాలుగా చెప్పినా కూడా, చెవికెక్కని శిశుపాలుడు రోషంతో, కళ్లెర్రజేసి, కొందరు రాజులను కూడగట్టుకుని, ' పాండవులను వధిస్తాను ' అంటూ వారిపైకి రాసాగాడు.


జగడం అనివార్యమయ్యేటట్లున్నదని ఆందోళనగా ధర్మరాజు బీష్ముని వైపు చూడగా ' ధర్మరాజా ! భయపడకు. సింహాన్ని చూసి కుక్కలు మొరగడం తెలియని విషయం కాదు. కానీ అవి సింహాన్ని యెదుర్కొనలేవు కదా ! ఆ యదుసింహం మౌనంగా వీని తప్పులులెక్కిస్తూ సహిస్తున్నాడు. తనపంజా విసిరేదాకానే ఈఅరుపులు. నీవు నిశ్చింతగా నీ కార్యక్రమం కానీ ! ' అన్నాడు భీష్ముడు.  


భీష్ముని మాటలు విని శిశుపాలుడు మరింత రెచ్చిపోయాడు. మళ్ళీ మళ్ళీ కృష్ణుని, పాండవులను తూలనాడసాగాడు. అది సహించలేని భీముడు ఒక్కసారిగా, దూరంగా వున్న గదను విసురుగా తీసుకుని, ప్రళయకాల రుద్రుని వలే శిశుపాలుని మీదకు లంఘించబోయాడు. సభ రసాభాస అవుతుందని, భీష్ముడు వారించాడు. వారిస్తున్న భీష్మునికూడా నిందించి శిశుపాలుడు యేమాత్రమూ జంకకుండా, శ్రీకృష్ణునికూడా తనతో యద్ధం చెయ్యమని కవ్వించాడు. ' వినాశకాలే విపరీత బుద్ధి : '


అప్పుడు లేచాడు శ్రీకృష్ణుడు, తనకు పూజ చేయుచున్న పాండునందనులను, ఒకింత ఆగమని చెప్పి, తన ఆసనం నుండి పైకిలేచాడు. . 


పాండునందనులూ, భీష్ముడు మొదలైన పెద్దలు, దివినుండి దేవతలు విభ్రమంగా చూస్తున్నారు, శ్రీకృష్ణుని వైపు. .  


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత

 రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం

హిందూపురం.

9989692844

కామెంట్‌లు లేవు: