28, నవంబర్ 2020, శనివారం

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 28  / Sri Devi Mahatyam - Durga Saptasati - 28 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 8*

*🌻. రక్తబీజ వధ - 2 🌻*


16. ఎద్దు పై ఉత్తమమైన త్రిశూలం ధరించి, పెద్ద సర్పాలను గాజులుగా కలిగి, చంద్రరేఖ విభూషణంగా దాల్చి మాహేశ్వరి వచ్చింది.


17. చేత బల్లెం దాల్చి, చక్కని నెమలిని ఎక్కి, కుమారస్వామి రూపంతో, అంబికా కౌమారి దైత్యులతో యుద్ధానికి వచ్చింది.


18. అలాగే విష్ణుశక్తి గరుడునిపై ఎక్కి, శంఖం, చక్రం, గద, శాస్రం (ధనుస్సు), ఖడ్గం, చేతులలో ధరించి వచ్చింది.


19. అసమానమైన యజ్ఞవరాహరూపాన్ని దాల్చిన హరి యొక్క శక్తి, వారాహి కూడా అచటికి వచ్చింది.


20. నారసింహి నర-సింహ రూపంతో, నక్షత్రమండలాలు డుల్లిపోవునట్లు జూలు విదుర్చుతూ అచటికి వచ్చింది.


21. అలాగే వేయి కన్నులు గల ఐంద్రి ఇంద్రుని వలే వజ్రాయుధాన్ని చేతబూని శ్రేష్ఠమైన ఏనుగుపై ఎక్కి వచ్చింది.


22. అంతట శివుడు, ఈ దేవశక్తులు తనను పరివేష్టించి ఉండగా (అచటికి వచ్చి) “నా ప్రీతి కొరకు అసురులు శీఘ్రంగా నీ చేత చంపబడుదురు గాక” అని చండికతో చెప్పాడు.


23. అంతట అత్యంత భయంకరి, మిక్కిలి ఉగ్రరూప అయిన చండికా శక్తి నూరు నక్కల వలే అరుస్తూ దేవి శరీరం నుండి వెలువడింది.


24. ఓటమి ఎరుగని (పార్వతీ) దేవి ధూమ (పొగ) వర్ణపు జడలు గల శివునితో ఇలా పలికింది : "ప్రభూ! శుంభ నిశుంభుల వద్దకు నీవు దూతగా వెళ్లు. 


25. "మిక్కిలి పొగరుబోతులైన ఆ శుంభ, నిశుంభాసురులతో, యుద్ధం చేయడానికి అక్కడ చేరిన ఇతర దానవులతో, ఇలాచెప్పు :


26. 'మూల్లోకాలును ఇంద్రునికిని, హవిర్భాగాలు దేవతలకు, లభించు గాక, బ్రతికివుండ గోరితే పాతాళానికి వెళ్ళిపోండి.


27. లేక బలగర్వంతో యుద్ధం చేయ గోరితే, రండి! నా నక్కలు మీ మాంసం తిని తృప్తినొందుగాక.” 


28. దౌత్యానికి శివుడే స్వయంగా నియోగించడం వల్ల ఆ దేవి అప్పటి నుండి “శివదూతి” అని లోకంలో ఖ్యాతి కెక్కింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: