30, డిసెంబర్ 2020, బుధవారం

మొగలిచెర్ల

 *పటమూ..పరివర్తన..*


"స్వామివారి పల్లకీసేవ లో నా పేరు నమోదు చేయండి..నేను పాల్గొంటాను.." అంటూ నా వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకతను అడిగాడు.."మీ పేరు..?" అన్నాను నేను.."తిరుపయ్యండి..ఇతను నా స్నేహితుడు, గురుమూర్తి.."అన్నాడు..మా సిబ్బంది వద్దకు వెళ్లి, తన పేరు నమోదు చేయించుకోమని చెప్పి పంపాను..ఇద్దరూ వెళ్లారు..మరి కొద్దిసేపటికి ఆ ఇద్దరిలో గురుమూర్తి అనే అతను నాదగ్గరకు వచ్చి, "నేను ఈ ప్రాంతానికి కొత్త..ఈ క్షేత్రం గురించి వివరాలు తెలుపగలరా..?" అని అడిగాడు..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే నాటి నుంచి, కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా జరిగిన చరిత్రను అతి క్లుప్తంగా చెప్పాను..శ్రద్ధగా విన్నాడు..


"ఈరోజుల్లో కూడా ఇలాటి సిద్ధులు, అవధూతలు, సాధకులు ఉన్నారా?..మీరంటే ఈ స్వామివారిని చూసారు కాబట్టి మీరు నమ్మడం లో అర్ధం ఉంది..మాలాంటి వారికి ఏదైనా దృష్టాంతరం కనబడితే..అప్పుడు విశ్వసిస్తాము..నా వరకూ నేను కళ్ళతో చూసేదాకా ఏదీ నమ్మనండీ..అది తప్పో ఒప్పో తెలీదు..నా పద్ధతి అలాంటిది.." అన్నాడు.."మిమ్మల్ని నమ్మించాలని నేను ప్రయత్నం చేయటం లేదండీ..మీరు అడిగారు కాబట్టి స్వామివారి గురించి చెప్పాను..నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం.." అన్నాను..ఇక అతనితో ఎక్కువ సంభాషణ చేయదల్చుకోలేదు..అతనూ తన స్నేహితుడి వద్దకు వెళ్ళిపోయాడు..


ఆరోజు సాయంత్రం పల్లకీసేవలో తిరుపతయ్య ఒక్కడే పాల్గొన్నాడు..గురుమూర్తి పల్లకీసేవ జరిగే విధానాన్ని చూస్తూ దూరంగా నిలబడ్డాడు..పల్లకీ స్వామివారి మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని, ముఖద్వారం  వద్దకు వచ్చింది..అక్కడ పల్లకీ మోసే వాళ్ళు, పల్లకీని పైకెత్తి పట్టుకుంటారు..అప్పటిదాకా పల్లకీ తో పాటు ప్రదక్షిణాలు చేసిన భక్తులు ఒక వరుసలో నిలబడి..ఒక్కొక్కరుగా పైకెత్తి పట్టుకున్న పల్లకీ క్రింద నుంచి, నమస్కారం చేసుకుంటూ ఇవతలికి వస్తారు..అలా పల్లకీ క్రింద నుంచి వస్తే..తమకు మేలు జరుగుతుందనే భావన ఎప్పటినుంచో భక్తుల మనస్సులో నాటుకొని ఉన్న సాంప్రదాయం..తిరుపతయ్య తాను కూడా పల్లకీ క్రింద నుంచి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చాడు..గురుమూర్తి దూరంగా వున్నాడు..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధికి అర్చక స్వాములచే అభిషేకము, హారతులు పూర్తయ్యాక..తిరుపతయ్య స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లి వచ్చాడు..ఆ తరువాత ఇద్దరు మిత్రులూ స్వామివారి ముందున్న మంటపం లో కూర్చున్నారు..కొద్దిసేపటి తరువాత..ఇద్దరూ నాదగ్గరకు వచ్చి, తాము తమ ఊరికి తిరిగి వెళుతున్నామని చెప్పారు..తిరుపతయ్య అత్యంత భక్తితో.."ఈరోజు స్వామివారి సమాధి దర్శనం చాలా బాగా జరిగిందనీ..వీలైతే త్వరలో మళ్లీ వస్తాననీ " చెప్పాడు..ఇద్దరూ వెళ్లిపోయారు..


సరిగ్గా ఆరు రోజుల తరువాత.."ప్రసాద్ గారూ..నా పేరు గురుమూర్తి అండీ..పోయినవారం నేనూ, నా స్నేహితుడు తిరుపతయ్య స్వామివారి వద్దకు వచ్చాము..రేపు శనివారం నాడు నేను వస్తున్నాను..నేను స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని, సమాధి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను.." అని ఫోన్ లో చెప్పాడు..నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది..తనకు ఏదైనా ఋజువు కనబడితేనే నమ్ముతానని చెప్పిన వాడు, ఇలా హఠాత్తుగా ఫోన్ చేసి స్వామివారి వద్దకు వస్తానని చెప్పడానికి ఏదో ఒక కారణం ఉంటుందని అనుకున్నాను..


ఆ ప్రక్కరోజు శనివారం నాటి సాయంత్రం గురుమూర్తి తన కుటుంబం తో సహా మందిరానికి వచ్చాడు..నేరుగా నేను కూర్చున్న చోటుకే వచ్చి, "ప్రసాద్ గారూ..పోయినవారం నేను స్వామివారి సన్నిధికి వచ్చి కూడా దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళాను..ఇంటికి వెళ్ళేసరికి మా ఇంట్లో స్వామివారి పటం వుందండీ..నాకు విపరీతంగా ఆశ్చర్యం వేసింది..ఈ పటం ఎలా వచ్చింది అని మా భార్యను ఆడిగానండీ..ఆదివారం ఉదయం మా వీధిలో ఒక సాధువు వచ్చాడట..మా యింటి ముందు నిలబడితే మా ఆడవాళ్లు భిక్షకో..డబ్బులు అడగడానికో వచ్చాడనుకొని ఓ పదిరూపాయలు ఆయన చేతిలో పెట్టిందట..ఆయన తన సంచీలోంచి, స్వామివారి చిత్ర పటం మా వాళ్ళ చేతిలో పెట్టి, ఇంట్లో పెట్టుకొని రోజూ నమస్కారం చెయ్యి..మంచి జరుగుతుందని చెప్పి వెళ్లిపోయాడట..ఆ పటం ఇంటికొచ్చిన కొద్దిసేపటి కే మా అబ్బాయికి బెంగుళూరు లో ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు మెయిల్ వచ్చింది..సాక్షాత్తు స్వామివారే నడిచి మా యింటికి వచ్చారని మా ఆవిడ అన్నది..నాకూ నిజమనిపించింది..నేను పొరపాటు చేశానని అర్ధం చేసుకొని, ఈరోజు ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని, క్షమాపణ చెప్పుకొని వెళదామని వచ్చాను..నాతో పాటు ఆమెనూ పిల్లలనూ తీసుకొని వచ్చాను.." అన్నాడు..ఆ మాటలు అతను చెప్పేటప్పుడు గురుమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి..అతని స్వరం లో పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తోంది..


అతనిలో పరివర్తన రావడానికి స్వామివారే చొరవ తీసుకున్నారు..ఇక నేను వివరించడానికి ఏమీ మిగలలేదు..గురుమూర్తి తో పాటు స్వామివారికి నేనూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..సెల్ : 94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: