5, డిసెంబర్ 2020, శనివారం

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైమూడవ శ్లోక భాష్యం - మొదటి భాగం


త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా

శరీరార్ధం శంభో-రపరమపి శంకే హృతమభూత్ !

యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం

కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ !!

(అమ్మా! నీవు శివుని ఎడమభాగమును పొందిన  మాత్రముతో తృప్తి పొందక కుడి భాగమును కూడా హరించినావని శంకపొడముచున్నది. ఎందుచేత ననగా 'నా హృదయములో నీ రూపమంతయూ (ఎడమ కుడి భాగములు రెండూ) ఎఱ్ఱటి ప్రకాశము కలది, మూడు నేత్రములు కలది, స్తనభారముచేత కొంచెము వంగినది, చంద్రవంక తోడి చూడా కిరీటము కలదిగా అనబడుచున్నది).


వేదములు శివునకు రెండు దేహములున్నా యని ప్రకటించాయి. “శివాతను” - అందు ఒకటి పూర్తిగా అంబికది. అర్ధనారీశ్వర రూపంతో ఒకే దేహంలో అంబిక, శివుడు సగం సగంగా ఉంటారు. ఆచార్యులవారు ఈ రెండు విషయములను కలిపి అంబిక చౌర్యం చేసిందని ఆరోపిస్తున్నారు. శివశక్తులు భిన్నభిన్నములుగా (విడివిడిగానూ, ఐక్యరూపంలోనూ) కన్పిస్తూ ఉంటారు. ఒకప్పుడు రెండు శరీరములతోను మరొకప్పుడు ఏకదేహంతోనూ దర్శనమిస్తారు. ఈవిధంగా భిన్నరూపములుగా శివుడు లింగరూపంలో ఉన్నప్పుడు అంబిక సర్పమై ఆయనను చుట్టి ఉంటుంది. ఇది భిన్నరూపం. దక్షిణామూర్తిగా శివుడున్నపుడు బయటకు కనిపించకుండా ఆయనతో కలిసి పోయి ఉంటుంది. ఇది  ఏకరూపం. ఆయన ఒక్కడే కన్పిస్తాడు.  వీటికి వ్యతిరిక్తంగా దుర్గ ఉన్నది. ప్రతి రూపం ఒక సత్యాన్ని, ఒక భావనను తెలియజేస్తుంది.


ఈ భావనలు, సత్యాలను ఆధారం చేసుకొని కవులు చమత్కారం చేస్తారు. “నిరంకుశాః కవయః" ఒకప్పుడు చనువుతో హేళన చేస్తారు. ఆరోపణలు చేస్తారు. ఇదంతా మిక్కుటమైన భక్తితో. అదే విధంగా ఈ శ్లోకంలో  ఆచార్యుల వారు అంబిక చేసిన పెద్ద చౌర్యం గురించి చెబుతున్నారు. ఆమె తన పతి పూర్తిదేహాన్ని కాజేసిందట. దొంగిలించిన సొమ్ము దాచి ఉంచుతారుకదా! ఆ రకంగా అంబిక తాను దొంగిలించిన శంకరుని దేహాన్ని తనలో దాచి ఉంచుకొన్నదట. ఆరోపణ ఒక్కదొంగతనమే కాదు. దొంగిలించిన సొమ్ము మీంగేసిందనికూడా. 


శ్లోకమే ఆరోపణతో మొదలవుతున్నది. “త్వయాహృత్వా వామం” నీచేత శివుని వామభాగం దొంగిలించబడింది. దీనికి “అమ్మా! నీచే శివుని ఎడమభాగము దొంగిలించబడిన తరువాత కూడా” అని అర్థం చెప్పుకోవాలి. ఈ తరువాత కూడా ఏమిటి? అపరితృప్తీన మనసా = తృప్తిపొందని మనస్సు తో; "శంభోః అపరం శరీరార్ధం అపి హృతమ్ అభూత్” = ఇంకొక భాగము కూడా దొంగిలించావు.


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

కామెంట్‌లు లేవు: