3, డిసెంబర్ 2020, గురువారం

సౌందర్య లహరి*

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైరెండవ శ్లోక భాష్యం - ఏడవ భాగం


సిద్దాంత పరమైన ఇంకొక కారణం చెప్పుకోవాలి. సత్వరజస్తమోగుణములకు అతీతమైన తురీయస్థితి ఒకటున్నది. సత్వమునకు స్థితికారకుడైన విష్ణుమూర్తి, రజస్సునకు సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు, తమస్సునకు సంహారకారకుడైన రుద్రుడు దేవతలుగా ఉన్నారు. నాల్గవదయిన తురీయము నిర్గుణము. పరబ్రహ్మకు సంబంధించినది. అక్కడ విధులేవీ లేవు. పేరే సూచించనట్లు గుణములు కూడా లేవు. సృష్టి స్థితి సంహారములు మానవజీవితంలో వరుసగా జాగ్రత్(మెలకువ) స్వప్న (కల) సుషుప్తి(నిద్ర)లకు సంబంధం కలిగి ఉన్నాయి. తన ఊహలతో మానవుడు కలలో అనేక మానవులను, వస్తువులను, ప్రదేశాలను చూస్తాడు. ఇది ఒక రకంగా సృష్టేకదా! మెలకువగా ఉన్నప్పుడు ప్రపంచవ్యవహారాలను నిర్వర్తిస్తాడు. ఇది స్థితి. సుషుప్తిలో అన్ని కార్యములు భావములు అణిగిపోయి ఒక విశ్వస్థితి ఏర్పడుతుంది. ఇది సంహారము. లేక లయ. మనిషి నిద్దురలో ఉన్నప్పుడు కూడా అతని లోపల ఒక జీవశక్తి  దేనికీ సంబంధం లేకుండా ఉంటుంది. అది తురీయము (నాలుగవది) - ఇది జాగ్రత్స్వప్ప సుషుప్తులకు అతిరిక్తమైనది. అజ్ఞాన దశలో సాధన లేని మనవంటి వారికి అది తెలియదు.  మాండూక్యోపనిషత్తులో దీనిని మనకు తెలిసిన భాషలో చతుర్థ (నాలుగవది) అన్నారు. జాగ్రత్స్వప్న సుషుప్తులు మనుష్య జీవనానికి అంటే పిండాండమునకు సంబంధించినవి. సృష్టి స్థితి సంహారములు బ్రహ్మాండమును నడిపించే ఈశ్వరునకు చెందినవి.


తురీయము మాత్రము ఇద్దరికీ సమానమైనది. కార్యములే లేని నిర్గుణ పరబ్రహ్మ సగుణ బ్రహ్మ అయిన  ఈశ్వరునకు తురీయమైన సత్యమై ఉంటాడు. అలాగే మానవజీవితంలో జాగ్రత్స్వప్న సుషుపులకు మూలమై తురీయమైన ఆత్మ ఉంటుంది.


పరబ్రహ్మ లేక ఆత్మస్థితి అయిన ఈ తురీయాన్ని, అలా కనిపించకపోయినప్పటికీ, సంహారము లేక లయము దగ్గరగా ఉంటుంది. మనస్సు అణిగి తురీయసమాధిలో ఉన్నప్పుడు ఉన్న ప్రశాంతత, నిర్మలత్వము జాగ్రత్స్వప్న దశలలో సంభవం కాదు. కలలు లేని సుషుప్తిలో మాత్రమే అటువంటి ప్రశాంతత సాధ్యం. అయితే ఆ ప్రశాంతతను అనుభవించి ఆనందస్థితిలో ఉండే సృహ అక్కడ ఉండదు. తురీయ సమాధిలో మాత్రమే అటువంటి ఆనందస్థితి సాధ్యమవుతుంది.


జాగ్రత్స్వప్న దశలలో మనం మనస్సులోను చేయబడే  గందరగోళంతో పోల్చుకుంటే సుషుప్తిలోని స్థితి  తురీయానుభూతికి దగ్గరలో ఉంటుంది. దీనినే విస్తరిస్తే లయం ద్వారా రుద్రుడు జీవులకు ప్రసాదించే తాత్కాలికమైన శాంతి, సృష్టి స్థితులలో బ్రహ్మ విష్ణువులు ఇచ్చేదాని కంటే, అత్యంతికమైన శాంతికి లేక పరబ్రహ్మస్థితికి దగ్గరలో ఉంటుంది. ఈ పరబ్రహ్మను శైవ-శాక్త సంప్రదాయాలలో 'శివం' అంటారు. అందువల్లనే వారిరువురి మధ్య ఎంతో  తేడా ఉన్నప్పటికీ రుద్రుడు శివునిగా పిలవబడుతున్నాడు. రుద్రుడు సంహారకారకుడు. మహేశ్వరుడు తిరోధానము ననుగ్రహించేవాడు. సదాశివుడు ఆత్యంతికమైన ముక్తిని ప్రసాదించేవాడు. ఈ పంచకృత్యములకు పైన జ్ఞానులు నిప్రియుడైన పరబ్రహ్మగా చెబుతున్న స్థితిని “శివం” అంటారు. సాధారణ మానవులకు రుద్ర, ఈశ్వర, శివ, శివంల మధ్య అంతరం తెలియదు. అయితే బ్రహ్మవిష్ణులు  మాత్రం మరి ఏ ఇతర దేవతల వలెనూ గుర్తించబడరు.


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

కామెంట్‌లు లేవు: