13, డిసెంబర్ 2020, ఆదివారం

శంకరాభరణం

 కళాతపస్వి' డా.కె.విశ్వనాథ్ గారు రూపొందించగా సంచలన విజయం సాధించిన 

'శంకరాభరణం' సినిమాలో శంకరశాస్త్రిగారి పాత్రకు ప్రేరణ మరెవరో 

కాదు..'గాయకసార్వభౌమ' పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారే. ఆ సినిమా 

విజయవంతం అయిందని తెలియగానే విశ్వనాథ్ గారు విజయవాడ వచ్చి, గాంధీనగర్ 

లోని పంతులుగారి విగ్రహాన్ని దర్శించుకొని, పూలమాల వేసి, వారికి తన కృతజ్ఞత 

తెలుపుకున్నారు.

        పారుపల్లివారి కట్టు, బొట్టు, తలపాగా, కోటు,నడక,వారి 

హుందాతనం, మితభాషణ...ఒక్కటేమిటి?..అన్నిటికీ సజీవ రూపాన్నిచ్చారు. 

పంతులుగారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, వారి నిస్వార్థ సంగీత సేవ..వీటిని 

తన చిత్రంలో ఎంతో అందంగా మలచారు విశ్వనాథ్ గారు.  ఆఖరికి శంకరశాస్త్రిగారి     

శిష్యుడి పాత్ర కూడా పంతులుగారి శిష్యుడైన 'బాల'మురళిదే...ఆ సినిమా చివరిలో 

శంకరశాస్త్రిగారికి వయోభారం చేత కచేరీ చేయలేని పరిస్థితి వస్తే, వేదికపైకి 

శిష్యుడువచ్చి,గురువుగారు ఆగిన చోటునుండి అందుకొని, పాటని రసవత్తరంగా పూర్తి 

చేస్తాడు.దాదాపు అటువంటి సంఘటనే పంతులుగారి జీవితంలోనూ జరిగింద     

ఆరోజు 7-1-1942..సాయం సమయం..త్యాగయ్యగారి ఆరాధనోత్సవాలు 

తిరువయ్యారులో జరుగుతున్నాయి. అందులో గానం చేయడానికి పంతులుగారికి గంట 

సమయం కేటాయించబడింది.పంతులుగారు తనతో తన శిష్యుడు, 12 సంవత్సరాల 

మురళిని కూడా అక్కడికి తెచ్చారు.అప్పటికే తెలుగునాట బాల గాయకుడిగా     

పేరుతెచ్చుకున్న మురళిచేత ఆ పవిత్ర స్థలంలో పాడించి, పెద్దల ఆశీస్సులకు పాత్రుణ్ని చేయాలని నిశ్చయించుకున్న పంతులుగారు, నిర్వాహకులతో తనకు ఆరోగ్యం సరిగా లేదని,అందుచేత, తనకు బదులుగా తన శిష్యుడికి రెండు కీర్తనలు పాడే అవకాశం 

ఇవ్వవలసిందిగా విన్నవించుకొని, ఎలాగో ఒప్పించారు.ఎంతో అరుదైన తన 

అవకాశాన్ని శిష్యుడి కోసం త్యాగం చేశారాయన... మురళిని తానే వేదికనెక్కించారు.     

ఆజానుబాహులైన ప్రక్కవాద్య కళాకారుల మధ్య...అర్భకుడైన బాలమురళి ప్రేక్షకులకు 

కనిపించకపోవడంతో ఒక పీటను తెప్పించి, దానిపై కూర్చుండబెట్టారు.కచేరీ ప్రారంభం 

అయింది. మురళీగానానికి శ్రోతలు పరవశించిపోయారు.రెండు కీర్తనలు 

నాలుగయ్యాయి..మరొక పావుగంట..మరొక అరగంట..ఇలా మూడుసార్లు సమయం 

పొడిగించబడింది. జనం ఆ గంధర్వ గానానికి మంత్రముగ్ధులయ్యారు..బాలమురళికి 

బ్రహ్మరథం పట్టారు.పంతులుగారి ఆనందానికి అవధులు లేవు.తనకు సంగీత       

వారసుణ్ణి ఇచ్చి, తన అభీష్టాన్ని నెరవేర్చిన 'నాదయోగి' త్యాగయ్యకు మనసులోనే 

తృప్తిగా నమస్కారం చేసుకున్నారు...ఇంచుమించుగా ఈ యదార్థ సంఘటనే 

'శంకరాభరణం' చిత్రంలో ఆఖరి దృశ్యంగా ప్రేక్షకుల మనఃఫలకాలపై చెరగని ముద్ర 

వేసుకొంది.

కామెంట్‌లు లేవు: