6, ఏప్రిల్ 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *సన్నిధిలో శరణాగతి..*


"ప్రసాద్ గారూ రాబోయే శనివారం రాత్రి అన్నదానానికి దాతలు ఎవరైనా ఉన్నారా?..ఒకవేళ ఎవరూ లేకపోతే..మా కుటుంబానికి అవకాశం ఇవ్వండి.." అని దుర్గారావు గారు ఫోన్ లో అడిగారు.."వచ్చే శనివారం నాడు అన్నదానం చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారండీ..వాళ్ళది హైదరాబాద్..ఆరోజుకు వస్తామన్నారు..మీకు వీలయితే ఆ ప్రక్కరోజు ఆదివారం మధ్యాహ్నం రోజు అన్నదానం చేయండి.."అన్నాను..ఒక్కక్షణం ఆలోచించారు.."అలాకాదు ప్రసాద్ గారూ..శనివారం రోజు రాత్రికి ఎక్కువమంది భక్తులు వస్తారు..అందుకని అడిగాను..పోనీలేండి..ఆ పై శనివారం రాత్రికి..ఆ ప్రక్కరోజు ఆదివారం మధ్యాహ్నం కూడా మా తరఫునే అన్నప్రసాదం ఏర్పాటు చేస్తాము..అందుకు అవకాశం ఇవ్వండి.." అన్నారు.."అలాగే దుర్గారావు గారు..ఆ రెండు పూటల అన్నదానం కొఱకు మీ పేరు నమోదు చేసుకుంటాను.." అన్నాను..


అనుకున్న విధంగానే దుర్గారావు గారు తమ కుటుంబం తో సహా శనివారం మధ్యాహ్నానికి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..ఆరోజు సాయంత్రం శ్రీ స్వామివారి పల్లకీసేవ లో పాల్గొన్నారు..రాత్రికి అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భక్తులకు వడ్డన చేశారు..వారి కొఱకు ఒక గది ని మేము కేటాయించి ఉంచినాకూడా..పిల్లలతో సహా స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధికి అర్చకస్వాములు చేసిన అభిషేకము, ఇచ్చిన హారతులనూ శ్రద్ధగా చూసి..ఆ తరువాత శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చారు..కొద్దిసేపు మంటపం లో కూర్చున్నారు..

తరువాత నాదగ్గరకు వచ్చారు.."ప్రసాద్ గారూ..స్వామివారి సన్నిధిలో ఇలా అన్నదానం జరిపించాలని అనుకోవడానికి ఒక కారణం ఉన్నదండీ..మీకు చెప్పుకోవాలని ఇలా వచ్చాను.." అన్నారు.."నేనే అడగాలని అనుకుంటున్నాను..మీరే చెప్పాలని అనుకున్నారు..చెప్పండి.." అన్నాను..


"మా అమ్మాయి పోయిన సంవత్సరం మెడిసిన్ చదవడానికి ఎంసెట్ రాసిందండీ..మంచి రాంక్ వచ్చినా..ఫ్రీ సీట్ రాలేదండీ..అమ్మాయి బాగా నిరుత్సాహం చెందింది..సుమారు పది పదిహేను రోజులు ఏడుస్తూ కూర్చుంది..బాగా ఆశలు పెట్టుకున్నది..అలాంటిది ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయింది..అమ్మాయి అలా నిరుత్సాహం చెందేసరికి మేము బాగా బెంగ పెట్టుకున్నాము..ఏ దిక్కూ తోచలేదు..మీకు కాల్ చేసాము..మీకు గుర్తుండే వుంటుంది..అమ్మాయిని తీసుకొని ఇక్కడకు రండి..మూడురోజులు నిద్ర చేయండి..అన్నీ సర్దుకుంటాయి అని మీరు చెప్పారు..ముందు మేము సందేహించాము..స్వామివారి సన్నిధికి వచ్చినంతమాత్రాన అమ్మాయి మామూలుగా మారుతుందా అని..మళ్లీ మిమ్మల్ని ఆడిగాము..మేలు జరుగుతుంది అని మీరు అన్నారు..అయినా ఒకమూల సందేహం తోనే అమ్మాయిని తీసుకొని ఇక్కడకు వచ్చాము..బుధ, గురు, శుక్ర వారాలు ఇక్కడే ఉన్నాము..మొదటిరోజు గడిచేసరికి తనలో మార్పు కనపడింది..శనివారం నాడు మాలకొండకు వెళ్లి, మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని మా ఊరు వెళ్ళాము..స్వామివారి దయవల్ల అమ్మాయి కోలుకున్నదండీ..మామూలుగా ఉత్సాహంతో మమ్మల్ని పలకరించుకున్నది..స్వామివారి దయవల్ల మా అమ్మాయి మాకు దక్కింది అనుకున్నాము..మళ్లీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమని మేము చెప్పాము..సరే అన్నది..ఈ సంవత్సరం కష్టపడింది..మెడిసిన్ లో సీటు వచ్చింది..తనకు ఫ్రీ సీటు వస్తే..స్వామివారి వద్ద అన్నదానం చేయిస్తామని అమ్మాయే మొక్కుకుంది..మాతో అదేమాట చెప్పింది..అందువల్ల మీతో మాట్లాడి ఈ ఏర్పాటు చేసుకున్నాము..సమస్య ఏదైనా శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి శరణాగతి చెందితే..తప్పకుండా దానిని పరిష్కరిస్తారు..ఒక్కటిమాత్రం నిజం ప్రసాద్ గారూ..స్వామివారిని నమ్మడమే కాకుండా..మన కృషి కూడా మనం చిత్తశుద్ధితో చేస్తే..ఫలితం తప్పకుండా వుంటుంది..మా విషయం లో ఋజువు అయింది..నిన్న ఇక్కడికి వచ్చాము..ఈరోజు, రేపు కూడా ఇక్కడే ఉంటాము..మళ్లీ మూడురోజులు నిద్ర చేసినట్లు అవుతుంది..మంగళవారం ఉదయం మా ఊరు వెళ్లిపోతాము.." అన్నారు..


చెప్పాలసింది అంతా దుర్గారావు గారు చెప్పేసారు..స్వామివారి కృప పొందే మార్గం కూడా ఆయన ద్వారా మాకు మళ్లీ స్వామివారు గుర్తుచేశారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: