6, మే 2021, గురువారం

ప్రియంచనానృతం బ్రూయాత్

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🥀  *సత్యంలోని సత్యం*🥀


🌻 *"నబ్రూయాత్ సత్యమప్రియం"🌸* సత్యమును కఠినంగా ఉండేట్లు, బాధపడేట్లు చెప్పకండి, చెప్పకండి. సత్యాన్నే చెప్పండి, ఎదుటివాడు బాధపడేట్లు సత్యాన్ని చెప్పకండి. 


ఎదుటివాడు ఒక తప్పు చేశాడనుకోండి. శిష్యుడే అనుకోండి, నలుగురిలో పట్టుకొని నువ్విలా చేస్తావా అనకండి. కనుక "సత్యార్జవే" సత్య ప్రవర్తనం, కష్టంగా ఉండేటట్లు చెప్పకండి సత్యం. శిష్యుడు ఇట్లా చేశాడు. "ఏరా! ఇలా చేశావు? బుద్దుందా, లేదా నీకు? ఎన్ని మాట్లు చెప్పాలి నీకు? మందమతీ,చవట వెధవా" అనరాదు. తప్పు అని, వాణ్ణి లోపలికి, ఇంట్లోకి పిలిచి, ఎవ్వరూ వినకుండా, వాడు ఒక్కడ్నీ పిలిచి, చెప్పేటువంటి సద్బుద్ది మన దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది? వీళ్ళందరి ఎదురుగుండా వాడితో చెప్పాననే దురద మనకు తీరాలంటే? జంతుత్వం, పశుత్వం మనం తీర్చుకుంటున్నాం వాడి యందు. 


మనం ఏమన్నా కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరని నలుగురిలో ఒకడ్ని పట్టుకొని మనం తిడుతున్నామంటే అర్థమేంటి? మనలో ఉన్న జంతుత్వాన్ని, మనలో పశుత్వాన్ని బయట పెట్టుకుంటున్నామని అర్థం. మనలో మానవత్వం ఉంటే వాడ్ని వేరే ఒంటరిగా పిలిచి చెప్పి ఉండేవాళ్ళం, కొడుకైనా సరే, శిష్యడైనా సరే, తమ్ముడైనా సరే, మిత్రుణ్ణయినా సరే, ఎవరయినా సరే హృదయంలో ఉన్న పరమాత్మను మనం గుర్తించటం కనుక నేర్చుకున్నట్లయితే, నలుగురు ఎదురుగుండా పట్టుకొని అదీ ఇదీ అనిఉండేవాళ్ళం కాదు. అంటే మన దగ్గర్నుంచి బయలుదేరాలి ఆచరణ అనేది. 


కనుక సత్యం ఎప్పుడూ కూడా అప్రియంగా చెప్పకు, "ప్రియంచనానృతం బ్రూయాత్" చాలా మధురంగా ఉంటుంది గదా అని అబద్ధమూ చెప్పవద్దన్నారు. *సత్యాన్ని అవతలివాడు ప్రేగులు తెగేటట్లు చెప్పకూడదు‌.* చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి అసత్యమూ చెప్పకూడదు.........!

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

కామెంట్‌లు లేవు: