2, జూన్ 2021, బుధవారం

రామదాసు

 *రామదాసు*


అశోక వన ధ్వంసం తరవాత, రాక్షసులతో యుద్ధ మప్పుడు, అంతవరకూ, సుగ్రీవుడి సచివుడినని, రామ దూతను,  అని చెప్పుకున్న హనుమ తనంత తానుగా  *"దాసోహం కోసలేంద్రస్య"* అని తాను *"రామ దాసును"* అని గట్టిగా వినపడేటట్లు అరిచి చెబుతాడు.


 సీతాన్వేషణ సీతా దర్శనం వరకూ, రామ దూత. సీతతో సంభాషణా, అంగుళీయాక ప్రదానం, చూడామణి ప్రదానం  అయ్యాక రామ దాసు. ఈ మార్పు కు కారణ మేమిటి? కిష్కింధ కాండ లో ఆంజనేయుడికి  రాముడు పరిచయ మవగానే  దాసత్వం అంగీకరించి తనకు తాను రామదాసును అని అనుకోవచ్చు కదా. సుందరాకాండ ముందు ఈమాట ఎక్కడా ఎందుకు అనలేదు. 


మాయారూపిణి అయిన అమ్మవారు విక్షేపణ, ఆవరణ, వివేక శక్తి రూపాలగా ఉంటుంది. విక్షేప శక్తి తామస మైంది. చరాచర ప్రకృతి రూపంలో జీవుడిని తికమక పెడుతుంది. ఆవరణ శక్తి రాజస మైనది పరమాత్మకు జీవుడికి అడ్డుగా వుంటుంది. వివేక శక్తి సాత్విక మైంది పరమాత్మ తత్త్వాన్ని జీవుడు తెలుసుకోడానికి సహాయ పడుతుంది. 


సీత పరాశక్తి. ఆమె జగన్మాత జగన్మాయ కూడా. మాయాశక్తి అనుగ్రహం లేనిదే పరమాత్మ ను పట్టుకోలేము. సీతా దర్శనం కాగానే హనుమ మానసికం గా రాముడినే తల్చుకుంటారు.  సీత కోరికను అనుసరించి రామ లక్ష్మణులను వర్ణిస్తాడు.  సీతా దర్శనమైన తరవాత ఆమె అనుగ్రహం వల్ల, హనుమకు రామ తత్వం అప్పుడు, (రాముడిని వర్ణన చేసినప్పుడు), పూర్తిగా అర్థమౌతుంది. ఆ తత్వం తెలిశాక ఈయన దాసత్వం స్వీకరిస్తారు.


దాసత్వం అనేది నవవిధ భక్తి మార్గాల లో ఒకటి. ఏమి చెయ్య మంటారు అనడానికి సంస్కృతం లో "కిం కరోమి" అంటారు. అలా అనేవాడిని "కింకరః" అంటారు. తెలుగులో కింకరుడు అంటారు. వాడి గుణము లేదా ప్రవృత్తిని "కైంకర్యం" అంటారు. దాసత్వం చాలా కష్టమైన వ్రతం. ముందుగా అహంకార మమ కారాలు విడిచిపెట్టాలి. సర్వం భగవంతుడికి ఒప్పచెప్పాలి. గోదా దేవి తండ్రి విష్ణు చిత్తుల వారు కూడా జీవిత మంతా స్వామి కైంకర్యం లోనే గడిపారు.  త్యాగరాజు బంటు రీతి కొలు వియ్యవయ్య రామా అన్నా మీరాబాయి చాకర్ రాఖోజి అన్నా వాళ్ళు కోరుకున్నది ఈ విధమైన సేవ చేసే అవకాశమే.   హనుమ ఆదర్శ ప్రాయుడైన రామ బంటు.


హనుమ పేర్లన్నీ పరిశీలించి చూడండి. ఒక్కొక్క పేరూ ఒక్కో సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చినవి. రామదాసు లేదా దాసాంజనేయ అన్న పేరు ఆయనకు ఆయనే ఇష్టపడి తగిలించు కుంటారు.  అది ఆయన కోరుకున్న పేరు. ఏ దేవత కైనా ఆయన కిష్టమైన పేరుతో పిలిస్తే నే సులభంగా అనుగ్రహిస్తాడు కదా.  దాసాంజనేయ మూర్తి పూజలో ఇంకో విశేషం. ఈ మూర్తి  (రాముడిని ధ్యానిస్తున్న అంజనేయుడి) కి చేసే పూజ రాముడికి కూడా చెందుతుంది. వీరాంజనేయ, పంచముఖి ఆంజనేయులు ఉగ్ర మూర్తులు. అభయాంజనేయ దాసాంజనేయులు భద్ర మూర్తులు. అందులో కూడా అభయాంజనేయ మూర్తి లో రాజసం ఉంటుంది. దాసాంజనేయులు శుద్ధ సాత్విక రూపం. అందువల్ల దాసాంజనేయ మూర్తి పూజ అధిక ఫలాన్ని ఇస్తుంది. 



*పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: