30, ఆగస్టు 2021, సోమవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *30.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*రాజోవాచ*


*3.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*కర్మయోగం వదత నః పురుషో యేన సంస్కృతః|*


*విధూయేహాశు కర్మాణి నైష్కర్మ్యం విందతే పరమ్॥12286॥*


*నిమిమహారాజు ఇట్లు అడిగెను* "యోగీశ్వరులారా! కర్మయోగాచరణము మానవుని సంస్కరించును. అది (ఆ ఆచరణము) అతని పుణ్యపాపకర్మలను అన్నింటిని కడిగివేసి వెంటనే సర్వోత్తమమైన నైష్యర్మ్యసిద్ధిని కలిగించును. అట్టి కర్మయోగమును గూర్చి తెలుపుడు.


*3.41 (నలుబది రెండవ శ్లోకము)*


*ఏవం ప్రశ్నమృషీన్ పూర్వమపృచ్ఛం పితురంతికే|*


*నాబ్రువన్ బ్రహ్మణః పుత్రాస్తత్ర కారణముచ్యతామ్॥12287॥*


పూర్వము బ్రహ్మమానసపుత్రులైన సనకాది మునీశ్వరులను మా తండ్రిగారైన ఇక్ష్వాకుమహారాజుయొక్క సమక్షమున ఈ ప్రశ్నను అడిగియుంటిని. కాని వారు సర్వజ్ఞులైనను నా ప్రశ్నకు సమాధానము ఇయ్యలేదు. కారణము ఏమై యుండును? దయతో వివరింపుడు.


*ఆవిర్హోత్ర ఉవాచ*


*3.43 (నలుబది మూడవ శ్లోకము)*


*కర్మాకర్మవికర్మేతి వేదవాదో న లౌకికః|*


*వేదస్య చేశ్వరాత్మత్వాత్తత్ర ముహ్యంతి సూరయః॥12288॥*


*3.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*పరోక్షవాదో వేదోఽయం బాలానామనుశాసనమ్|*


*కర్మమోక్షాయ కర్మాణి విధత్తే హ్యగదం యథా॥12289॥*


*అంతట ఆరవ యోగీశ్వరుడైన ఆవిర్హోత్రుడు ఇట్లనెను* "నిమిమహారాజా! కర్మ (శాస్త్రవిహితకర్మ), అకర్మ (నిషిద్ధకర్మ), వికర్మ (విహితకర్మను ఉల్లంఘించుట) అని వేదములలో కర్మనుగూర్చి మూడువిధములుగా వివరింపబడినది. వేదములు పరమాత్మ స్వరూపములు. అపౌరుషేయములు. అనగా మానవులచే ప్రకటితములైనవి కావు. వేదవాణి పరోక్షవాదాత్మకము. అనగా వాటి శబ్దార్థముల కంటె తాత్పర్యములు వేరుగా నుండును. కనుక విద్వాంసులు గూడ వాటి విషయమున భ్రమకు లోనగుచుందురు. వేదవిహిత కర్మానుష్ఠానము వలన మానవులు కర్మబంధముల నుండి విముక్తులగుదురు. పెద్దలు రోగనివృత్తికై బాలురకు తీపిపదార్థములను ఆశగా చూపి వారిచే ఔషధమును సేవింపజేసినట్లు, వేదములు పామరులకు స్వర్గఫలాదులను ఆశగా చూపి వారిచే విహితకర్మలను ఆచరింపజేయును.


*3.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*నాచరేద్యస్తు వేదోక్తం స్వయమజ్ఞోఽజితేంద్రియః|*


*వికర్మణా హ్యధర్మేణ మృత్యోర్మృత్యుముపైతి సః॥12290॥*


జితేంద్రియుడు కాని అజ్ఞాని, వేదవిహితకర్మలను ఆచరింపక వాటిని ఉల్లంఘించుటవలన అతడు పాపములను మూటగట్టుకొనును. ఫలితముగా అతడు జననమరణ చక్రములోబడి పరిభ్రమించుచుండును. అట్టివాడు ఎన్నటికిని ముక్తిని పొందజాలడు.


*3.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*వేదోక్తమేవ కుర్వాణో నిఃసంగోఽర్పితమీశ్వరే|*


*నైష్కర్మ్యం లభతే సిద్ధిం రోచనార్థా ఫలశ్రుతిః॥12291॥*


వేదోక్తకర్మలను అనాసక్త భావముతో (ప్రతిఫలాపేక్షారహితముగా) ఆచరించి, వాటిని ఈశ్వరార్పణము చేసినవాడు నైష్కర్యసిద్ధిని (కైవల్యమును) పొందును. వేదోక్తములైన స్వర్గాదిరూపఫలము కేవలము కర్మలను చేయుటయందు రుచి కలుగజేయుటకే అని గ్రహింపవలెను.


*3.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*య ఆశు హృదయగ్రంథిం నిర్జిహీర్షుః పరాత్మనః|*


*విధినోపచరేద్దేవం తంత్రోక్తేన చ కేశవమ్॥12292॥*


పురుషుడు పరబ్రహ్మరూపమైన ఆత్మవిషయమున అజ్ఞానకారణముగా ఏర్పడిన అహంకార, మమకార గ్రంథిని పూర్తిగా ఛేదింపదలచినచో అతడు వైదిక-ఆగమ పద్ధతులద్వారా భగవంతుని ఆరాధింపవలెను.


*3.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*లబ్ధానుగ్రహ ఆచార్యాత్తేన సందర్శితాగమః|*


*మహాపురుషమభ్యర్చేన్మూర్త్యాభిమతయాఽఽత్మనః॥12293॥*


గురువునకు సేవలొనర్చుటద్వారా ఆయన అనుగ్రహమును పొందవలెను. దీక్షాదులను స్వీకరించి ఆయననుండి ఉపాసన-అనుష్ఠాన విధులను తెలిసికొనవలెను. పిదప అతడు తనకు ఇష్టమైన భగవంతుని విగ్రహముద్వారా (అర్చామూర్తిద్వారా) ఆ పరమపురుషుని ఆరాధింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: