4, అక్టోబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం

 *2.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదకొండవ అధ్యాయము*


*బద్ధజీవుల-ముక్తజీవుల-భక్తుల లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీభగవానువాచ*


*11.1 (ప్రథమ శ్లోకము)*


*బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మే న వస్తుతః|*


*గుణస్య మాయామూలత్వాన్న మే మోక్షో న బంధనమ్॥12614॥*


*శ్రీభగవానుడు వచించెను* ఉద్ధవా! సత్త్వాది గుణములను బట్టియే బద్ధులు, ముక్తులు అని వ్యావహారికముగా పేర్కొనుచుందురు. కాని వాస్తవముగా (తత్త్వదృష్టితో) కాదు. గుణములన్నియును మాయా మూలకములు. నేను గుణాతీతుడను. కావున నా స్వరూపమైన ఆత్మకు మోక్షముగాని, బంధనము గాని లేవు. 


*11.2 (రెండవ శ్లోకము)*


*శోకమోహౌ సుఖం దుఃఖం దేహాపత్తిశ్చ మాయయా|*


*స్వప్నో యథాఽఽత్మనః ఖ్యాతిః సంసృతిర్న తు వాస్తవీ॥12615॥*


శోకమోహములు, సుఖదుఃఖములు, దేహము ప్రాప్తించుట, నశించుట అనునవి అన్నియును మాయా మూలకములు. ఇవి అన్నియును స్వప్నసదృశములు. కనుక, మిథ్యయే. ఈ దృశ్యజగత్తు అంతయును మాయవలన గోచరించును. కావున, అది వాస్తవముకాదు.


*11.3 (మూడవ శ్లోకము)*


*విద్యావిద్యే మమ తనూ విద్ధ్యుద్ధవ శరీరిణామ్|*


*మోక్షబంధకరీ ఆద్యే మాయయా మే వినిర్మితే॥12616॥*


ఉద్ధవా! విద్యయు, అవిద్యయు అను రెండును నా శక్తులే. ఇవి శరీరధారులకు క్రమముగా మోక్షమును, బంధమును కలిగించును. అనాదియైన ఈ రెండును నా మాయాశక్తులే.


*11.4 (నాలుగవ శ్లోకము)*


*ఏకస్యైవ మమాంశస్య జీవస్యైవ మహామతే|*


*బంధోఽస్యావిద్యయానాదిర్విద్యయా చ తథేతరః॥12617॥*


మహాత్మా! ఈ జీవుడు మాత్రము నా అంశయే. అనాదియైన అవిద్యవలన జీవునకు బంధనములు ఏర్పడును. నా యొక్క విద్యాశక్తివలన మోక్షము గలుగును.


*11.5 (ఐదవ శ్లోకము)*


*అథ బద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే|*


*విరుద్ధధర్మిణోస్తాత స్థితయోరేకధర్మిణి॥12618॥*


నాయనా! బద్ధులకును, ముక్తులకును గల భేదమును నీకు తెలిపెదను. జీవుడు నా స్వరూపమే యగుట వలన వాస్తవముగా జీవుడన్నను, ఆత్మయన్నను ఒకటే. కానీ, ఆ రెండిటిమధ్యగల భేదమును వినుము. ఆత్మస్వరూపుడనైన నేను శాసకుడను. జీవుడు శాసింపబడువాడు. నేను ఆనందస్వరూపుడను. జీవుడు శోకమోహములకు వశుడై సుఖదుఃఖములను అనుభవించును.


*11.6 (ఆరవ శ్లోకము)*


*సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే|*


*ఏకస్తయోః ఖాదతి పిప్పలాన్నమన్యో నిరన్నోఽపి బలేన భూయాన్ ॥12619॥*


ఈ శరీరరూపవృక్షముపై హృదయమను గూటిలో రెండు పక్షులు జతగా నివసించు చుండును. సమానధర్మముగల ఈ పక్షులు రెండును మిత్రభావమును గలిగియుండును. ఆ రెండింటిలో ఒకటి ఈ శరీరముద్వారా చేయబడు కర్మలఫలరూపమున శబ్దాది విషయములను అనుభవించును. ఐనను అది క్షీణించుచుండును. మఱియొక పక్షి ఫలములను అనుభవింపకున్నను మిగుల బలిష్ఠముగానుండును.


*11.7 (ఏడవ శ్లోకము)*


*ఆత్మానమన్యం చ స వేద విద్వానపిప్పలాదో న తు పిప్పలాదః|*


*యోఽవిద్యయా యుక్ స తు నిత్యబద్ధో విద్యామయో యః స తు నిత్యముక్తః॥12620॥*


ఫలములను అనుభవింపని పక్షి తనను తెలిసికొనును, తన సఖుడైన ఆ జీవునిగూడ తెలిసికొనును. కాని కర్మఫలములను అనుభవించునట్టి పక్షి తనను తాను తెలియదు. ఆత్మస్వరూపుడైన తన మిత్రునిగూర్చి గూడ తెలిసికొనజాలదు. ఈ విధముగా అవిద్యకు వశుడైనవాడు నిత్యబద్ధుడు. తన నిజస్వరూపమును ఎరిగినవాడు నిత్యముక్తుడు.


*11.8 (ఎనిమిదవ శ్లోకము)*


*దేహస్థోఽపి న దేహస్థో విద్వాన్ స్వప్నాద్యథోత్థితః|*


*అదేహస్థోఽపి దేహస్థః కుమతిః స్వప్నదృగ్యథా॥12621॥*


ఆత్మజ్ఞాన సంపన్నుడగు పురుషుడు స్వప్నము ముగిసి, నిద్రనుండి మేల్కనిన పిమ్మట స్వప్నము నందలి శరీరముతో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. అదేవిధముగ అతడు సూక్ష్మ, స్థూల శరీరమునందు ఉండినప్పటికినీ, వాటితో ఎటువంటి సంబంధమును కలిగియుండడు. కాని, అజ్ఞానియగు పురుషుడు స్వప్నమును చూచునప్పుడు కనిపించే స్వప్నశరీరముతో సంబంధమును జోడించుకొనినట్లుగా వాస్తవమునందు ఎట్టి సంబంధములేని శరీరమునందు అజ్ఞానమువలన శరీరమునందే తాను ఉన్నట్లుగా తాదాత్మ్యమును అనుభవించును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: