28, అక్టోబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం*

 *28.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*19.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*యదాత్మన్యర్పితం చిత్తం శాంతం సత్త్వోపబృంహితమ్|*


*ధర్మం జ్ఞానం సవైరాగ్యమైశ్వర్యం చాభిపద్యతే॥12985॥*


ఈ ధర్మములను పాటించువాని యొక్క చిత్తమునందు సత్త్వగుణము వృద్ధిచెందును. అప్పుడు అతడు ప్రశాంతచిత్తుడై తన ఆత్మను నాయందే లగ్నము చేయును. అంతట సాధకునకు భక్తి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య - ఐశ్వర్యములు సహజముగా అబ్బును.


*19.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*యదర్పితం తద్వికల్పే ఇంద్రియైః పరిధావతి|*


*రజస్వలం చాసన్నిష్ఠం చిత్తం విద్ధి విపర్యయమ్॥12986॥*


మనస్సు సాంసారికమైన సంకల్ప - వికల్పములలో మునిగి, ఇంద్రియములను తనవెంట తీసికొని పరుగెత్తును. వెంటనే ఆ మనస్సునందు రజోగుణము వ్యాపించును. అప్పుడు చిత్తము అసత్పదార్థములను చింతించుటలో మునిగిపోవును. తత్పలితముగ అది తన స్వస్వరూపమునుండి తొలగిపోవును.


*19.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ధర్మో మద్భక్తికృత్ప్రోక్తో జ్ఞానం చైకాత్మ్యదర్శనమ్|*


*గుణేష్వసంగో వైరాగ్యమైశ్వర్యం చాణిమాదయః॥12987॥*


ఉద్ధవా! నా యందు భక్తి కలుగుటయే ధర్మము. ఆత్మపరమాత్మల ఏకాత్మ (ఐక్యతా) భావము కలుగుటయే జ్ఞానము. విషయములయెడ అనాసక్తియే వైరాగ్యము, అణిమాది సిద్ధులే ఐశ్వర్యము.


*ఉద్ధవ ఉవాచ*


*19.28(ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యమః కతి విధః ప్రోక్తో నియమో వాఽరికర్శన|*


*కః శమః కో దమః కృష్ణ కా తితిక్షా ధృతిః ప్రభో॥12988॥*


*19.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*కిం దానం కిం తపః శౌర్యం కిం సత్యమృతముచ్యతే|*


*కస్త్యాగః కిం ధనం చేష్టం కో యజ్ఞః కా చ దక్షిణా॥12989॥*


*ఉద్ధవుడు పలికెను* అరిసూదనా! కృష్ణా! యమ, నియమాదులు ఎన్నివిధములు? శమ, దమములు అనగా ఏమి? ప్రభూ! తితిక్ష అని దేనిని అందురు? ధృతి అని దేనికి పేరు? దానము, తపస్సు, శౌర్యము, సత్యము, ఋతము అంటే ఏమిటి? త్యాగము అనగా ఎట్టిది? అభీష్టమైన ధనమేది? యజ్ఞము అని దేనిని అందురు? దక్షిణ అని దేనికి పేరు?


*19.30 (ముప్పదియవ శ్లోకము)*


*పుంసః కింస్విద్బలం శ్రీమన్ భగో లాభశ్చ కేశవ|*


*కా విద్యా హ్రీః పరా కా శ్రీః కిం సుఖం దుఃఖమేవ చ॥12990॥*


పురుషునకు నిజమైన బలమేది? భగుమనగా నేమి? లాభమనగా ఎట్టిది? ఉత్తమ విద్య, లజ్జ, శ్రీ, సుఖదుఃఖములు అనగా ఏమి?


*19.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*కః పండితః కశ్చ మూర్ఖః కః పంథా ఉత్పథశ్చ కః|*


*కః స్వర్గో నరకః కః స్విత్కో బంధురుత కిం గృహమ్॥12991॥*


*19.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*క ఆఢ్యః కో దరిద్రో వా కృపణః కః క ఈశ్వరః|*


*ఏతాన్ ప్రశ్నాన్ మమ బ్రూహి విపరీతాంశ్చ సత్పతే॥12992॥*


ఎట్టివాడు పండితుడు? మూర్ఖుడు అనగా ఎవడు? సన్మార్గము అనగా ఎట్టిది? దుర్మార్గలక్షణమేమి? స్వర్గము, నరకము అని వేటిని అందురు? బంధుమిత్రులు అనగా ఎట్టివారు? గృహము అనగా ఏమి? ధనవంతుడు ఎవరు? నిర్ధనుడు ఎవరు? కృపణుడు ఎవరు? ఈశ్వరుడు అని ఎవరిని అందురు? దయామయా! నా ఈ ప్రశ్నలకు సమాధానమిమ్ము. అంతేగాదు, వాటికి విరుద్ధములైన భావములనుగూడ విశదీకరింపుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: