19, డిసెంబర్ 2021, ఆదివారం

దోసావకాయోత్పత్తి

 👉సరదాగా కాసేపు అంతే


*దోసావకాయోత్పత్తి వృత్తాంతము::*

పూర్వం 1822 వ సంవత్సరంలో, దెందులూరు గ్రామమునందు దర్భా ధనుంజయ చైనులు గారు అనెడి ఒక వేదపండితుడు వేదములతో పాటు, సాంప్రదాయ సద్వంటలను కూడా క్షుణ్ణముగా అభ్యసించినాడు!


ఆయన ఒక సాయంత్రము రాత్రి భోజనమునకు దోసకాయ పప్పు చేయవలెనని, ఒక పుల్లని, గట్టి దోసకాయను ముక్కలు గా చేసి ఒక తప్పాలా యందు వేసికొనినాడు! అటు పిమ్మట ఆయన కించిత్తు వేదపఠనమునందు నిమగ్నుడయినాడు! ఇంతలో ఆయన గారి సతీ మణి, దర్భా దాక్షాయనీ దేవమ్మ, ఆ ఉదయము కొత్త ఆవకాయ పెట్టుటకు వాడిన ఆవపిండి కాస్త ఒక పళ్ళెమునందు మిగిలియుండుట చేత, ఆ ఆవపిండి పళ్ళెమును ఆ దోసకాయ ముక్కల తప్పాలాయందు, దృష్టి లోపమువలన చూచుకొనక పడవైచినది! అటు పిమ్మట ఆమె ఇంకనూ రెండు దినములలో గల లక్ష వత్తుల నోముకు వత్తులు చేసికొనుటకు ఉపక్రమించినది!


అంతలో, వేదపఠనము ముగించుకొని, ఇక ఇంగువ తిరగమాత దోసకాయ పప్పు చేయుదమని వచ్చిన చయనులు గారు, ఆ దోసముక్కల మీద పడియున్న ఆవపిండిని చూచి, 'అకటా, ఇక ఈ రాత్రికి దోసకాయ పప్పు దుర్లభము కదా! ఏమి శాయవలె?' అని ఆలోచించి, 'సరియే, ఈ ఆవపిండి తో కలసిపోయిన దోస ముక్కలను ఎటులయిననూ సద్వినియోగము చేయుదు గాక ' అనుకొనుచూ, పాక దేవీ మాత పైనుండి దీవించుచుండగా, ఆ దోసముక్కలూ, ఆవపిండీ గల తప్పాలమునందు, కాస్త మచిలీపట్నపు రాళ్ళ ఉప్పూ, నారాకోడూరు ఎర్ర కారమూ కలిపి, ఆ పైనుండి ధారగా గానుగ నువ్వుల నూనె పోసినాడు! ఆ మిశ్రమమును ఒక బృహద్గరిటె తో బాగుగా కలియ బెట్టినాడు! 'ఇది ఏదియో చూచుటకు మాత్రము బహు ముచ్చటగానున్నదే' అనుకొనినాడు!


ఒక గంట పిమ్మట, ఆ దంపతులు ఇరువురూ, రాత్రి భోజనమున వేడి వేడి దంపుడు బియ్యపన్నము నందు ముద్దపప్పు కలిపి, అవనిగడ్డ ఆవునెయ్యి ధారాళముగా వేసికొని, ఆ ముద్దపప్పన్నము తో పాటు, ఈ తప్పాలమునందలి వింత పదార్ధమును నంచుకొనుచుండగా, వారికి ఆ ఘాటుకు నుదుటినుండి స్వేదము చిందుచూ, అనిర్వచనీయమగు అనుభూతీ, ఆనందమూ లభ్యమైనవి!


ఆ రాత్రి భోజనానంతరము , దర్భా ధనుంజయ చైనులు గారు, ఆ ఎర్రని, ఘాటగు వింత పదార్ధమునకు 'దోస ఆవకాయము ' అని నామకరణమొనర్చినాడు!


ఇతి దోసావకాయోత్పత్తి వృత్తాంతః


ఈ దోసావకాయ గురించి పాకపంచశతి మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక "లో ఫలశృతి చెప్పబడింది. అందులో జఠమహర్షి, ఉదరానందునకు చెప్పిన కొన్ని విషయాలు:


ఈ దోసావకాయ అపమృత్యువులను, అకాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించును. దీనిని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం భుజించాలి. అన్ని రోగాలను హరించడానికి గట్టిగా ఉన్న ఒక్క ముక్క చాలును. ఆసక్తి గలవారు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ దోసావకాయను తప్పక భుజించాలి. ఊరగాయలు, పచ్చళ్ళలో దోసావకాయ అసమానమైనది. జిహ్వసక్తి లేనివారికి దీనిని వడ్డించరాదు.


నిత్యకృత్యమునందు, పర్వదినములందు ఎవరీ దోసావకాయను యథాశక్తి విధిగా భుజిస్తారో, వారికి ధన్వాంతరీ అనుగ్రహముచే దీర్ఘాయువు, రథగజతురంగములతో సదా సుప్రసన్నమైన స్థిరసంపదలు సిద్ధించును...





కామెంట్‌లు లేవు: