8, డిసెంబర్ 2021, బుధవారం

ఆసక్తికరమైన అంశం*

 💥💥 *ఆసక్తికరమైన అంశం* 💥💥

కరోనా వ్యాధి చికిత్స ఇచ్చే వార్డులో చికిత్స పొందుతున్న ఒక టీచర్ ఏమీ తోచక చదువుదామని ఒక పుస్తకం తీసుకోనే సమయానికి ఆమె ఫోన్ మ్రోగింది. ఆ ఫోన్ కాల్ ఒక తెలియని నంబర్ నుండి వచ్చింది. సాధారణంగా అలాంటి నంబర్ల ఫోన్ కాల్ ఆవిడ తీయదు, ఆసుపత్రిలో ఒంటరిగాఉంది, చేయడానికి వేరే పని లేనందున  ఆ ఫోన్ కాల్ ని తీసుకుంది. 


“ గుడ్ మార్నింగ్ మేడమ్, నేను సత్యేంద్ర గోపాలకృష్ణ, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. సీమా కనకాంబరన్ గారితోనే మాట్లాడుతున్నానా?”, అని ఒక మగ గొంతుక తననుతాను పరిచయం చేసుకుంది.  

ఆ టీచర్ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని కుతూహలంతో,“అవును నేనే మాట్లాడుతున్నాను” అని సమాధానం చెప్పింది. 

కొంత సమయం తర్వాత  అతను, “మాడమ్ కొన్ని సంవత్సరాల క్రితం మీరు నా పదో క్లాస్  టీచర్“ అని చెప్పాడు. 

టీచర్ అతడిని గుర్తించలేకపోయింది.“ప్రస్తుతం కోవిద్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను. అంత ముఖ్యమైన విషయం కాకపోతే మనం తర్వాత మాట్లాడుకోవచ్చా?”అని అంది. 

దానికి బదులుగా సత్యేంద్ర, “1995 బ్యాచ్ లో మొదటి ర్యాంకర్ ఐన సుబ్బు ద్వారా మీకు ఆరోగ్యం బాగులేదని తెలిసింది“ అని చెప్పాడు.

 “ నాకు సుబ్బు బాగా తెలుసు నేను అతడిని గుర్తుపట్టాను కాని నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను” అని టీచర్ చెప్పింది. 


సత్యేంద్ర “ మీకు ఎప్పుడూ తలనొప్పి తెప్పించి, పొడుగ్గా, నల్లగా వుండి, ఆఖరి బెంచీలో కూర్చునే ఒక పిల్లవాడు బహుశా గుర్తుండివుంటాడు. ఆపిల్లవాడ్ని నేనే ” , అని చెప్పాడు.  


ఆ టీచరకి ఒక్కసారిగా గుర్తుకొచ్చి “ ఓ ! ఆ వెనక బెంచీ పిల్లలా“, అని అడిగింది. 


ఆ సంభాషణ ఆసక్తిగా మారడం వల్ల ఆవిడ పుస్తకాన్ని బల్ల మీద ఒక ప్రక్కగా పెట్టి  దిండుని తల వెనుకగా సర్దుకొని  తనకి తాను సుఖంగా కూర్చొని అప్పుడు అతడిని “ఇప్పుడు ఇంత అకస్మాత్తు గా నేను నీకు ఎందుకు జ్ఞాపకం వచ్చాను”, అని అడిగింది.

  

సత్యేంద్ర “ మీరు ఆసుపత్రిలో వున్నారని తెలిసినప్పుడు మా 1995 క్లాసు పిల్లలందరితో ఒక కాన్ఫరెన్సు కాల్ ఏర్పాటుచేద్దామని నాకు ఆలోచన వచ్చింది” అని చెప్పాడు.


“ తోటి విద్యార్ధులు ఏడుగురిని నేను ఈరోజు లైన్ లోకి తేగలిగాను. ఇప్పుడు వాళ్ళందరూ మన సంభాషణ వింటున్నారు. మేమందరం మీరు తొందరగా కొలుకోవాలని ప్రార్ధిస్తున్నామని మీకు తెలపడానికి ఫోన్ చేసాం“, అని అతను చెప్పగానే ఆ టీచర్ కి మాటలు తడబడ్డాయి. 


కొంత సమయం తరువాత ఆవిడ “ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడ వున్నావు?” అని అడిగింది. 


“ నేను ప్రస్తుతం దుబాయిలో ఉన్నాను. నేను స్వంతంగా లాజిస్టిక్ వ్యాపారం చేస్తున్నాను. మొదట్లో నేను ఉద్యోగం వెతుక్కోవడానికి ఇక్కడకు వచ్చాను. చివరికి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను అయ్యాను. ప్రస్తుతం నా సంస్థలో 2000 మంది ఉన్నారు“, అని సత్యేంద్ర చెప్పాడు. 


మేము పదో తరగతిలో వున్నప్పుడు మీరంటే  మా వెనక బెంచీ విద్యార్ధులకు క్రమశిక్షణ విషయంలో చాలా భయం వేసేది. కానీ అదేసమయంలో మీరు ఎంతో ఔదార్యంతో మాకు మద్దతు ఇచ్చి, గొడవ చేసి, అల్లరిచేసే వెనక బెంచీ విద్యార్ధులమైన మాలో విశ్వాసాన్ని పెంచారు. నేను వారి నాయకుడిగా వుండేవాడిని”, అని అతడు చెప్పాడు.


మీ చేతిలో అందరికన్నా నాకే ఎక్కువ శిక్షలు పడ్డాయి, మీరు నన్ను తరుచూ క్లాస్ బయట, కొన్ని సార్లు క్లాస్ లో బెంచీ మీద నిలబెట్టేవారు. ఆ అనుభవాలన్నీ నా తరువాతి జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. 


“బెంచీ మీద నిలబెట్టినప్పుడు నాకు క్లాస్ అంతా ఒకేసారి కనిపించేది, నేను నేర్చుకున్న ఈ పాఠాలు నేను నా జీవితంలోనే కాదు నా వ్యాపారం లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ రొజు నేను ఉన్న ఈ స్థితి అంతా మీ వల్లనే సాధ్యపడింది”, అని చెప్పాడు. 

 

టీచర్ కి ఇప్పుడు మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సత్యేంద్ర తన కధను చెప్తూనే వున్నాడు, ఆ టీచర్ కొన్ని దశాబ్దాలకి ముందు, 1995 సంవత్సరానికి వెనక్కివెళ్లి తన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. 1995 లో క్లాస్ ...


 “ అవును, ఆ పొడుగ్గా నల్లగా వుండే కుర్రవాడు, క్లాస్ కి ఎప్పుడు ఆలస్యంగా వచ్చి విసిగించడంలో దిట్ట. క్లాసులను మానేసి సినిమాలకు వెళ్ళేవాడు. తరచూ టీచర్ విధించిన శిక్షలు, వేసిన జరిమానాలను  తగ్గించమని కోరడానికి వాళ్ళ గదికి వచ్చే పిల్లవాడు ఇతనే. టీచర్లందరికీ ఓ పీడకలగా ఉన్నా  పిల్లలందరికి మాత్రం చాలా ప్రియమైనవాడు ఇతనేనని గుర్తించింది.


అవును, అతడినితో అందరూ స్నేహంగా ఉండేవారు. అతడు ఇప్పుడు దుబాయిలో ఎలా వున్నాడు?” అని ఆ టీచర్ అనుకుంటోంది. 


ఆవిడ ఆలోచనలకు అంతరాయం కలిగింది 

“ హలో ! మీరు వింటున్నారా ?” అని సత్యేంద్ర అడిగాడు.  


 టీచర్ స్పృహలోకి తిరిగి వచ్చి “ ఆ.. ఆ.. వింటున్నాను “ అని సమాధానం చెప్పింది.


ఆవిడ సంభాషణ కొనసాగిస్తూ “ సత్యేంద్ర! స్కూలు వదలి వెళ్ళిన తరువాత నీ గురించి ఏమీ తెలియలేదు. నువ్వు నాకు కాల్ చేయడం, అది కూడా నీ మిత్రులతో కాన్ఫరెన్స్ కాల్ చేయడం చాలా ఆశ్చర్యంగాను, సంతోషంగాను వుంది. అందరూ మీ గురించి చెప్పండి", అని అడిగింది.


ఆ గ్రూప్ కాల్ లో వున్న మిగతా ఆరుగురిలో ముగ్గురు మూడు ఖండాలలో ఇంజనీర్ లని,  ఒకడు ఢిల్లీ లో డాక్టర్, ఒకడు షిల్లాంగ్ లో పురోహితుడు, చివరిగా క్లాస్ లో మొదటి స్థానం లో వుండే సుబ్బు, “మేడమ్, నేను ఒక చార్టెడ్ అకౌన్టెంట్. సత్యేంద్ర కంపెనీ లో CFO ని” అని చెప్పారు.

ఆవిడ తాను విన్న మాటలను నమ్మలేకపోతోంది ఎంతో ఆశ్చర్యంగా, “నిజంగానే నా!”అని అంది. 

సుబ్బు ఆ మాటలను ధృడపరిచాడు, “నేను సత్యేంద్రతో  కలవక ముందు KPMG లో పనిచేసేవాడిని. సత్యేంద్రతో కలిసిన తరువాత వృత్తిపరంగా నాకు చాలా తృప్తి గా వుంది. అలాగే నా కుటుంబజీవితం కూడా బావుంది ”, అని చెప్పాడు. 


అందరూ వాళ్ళ కధలు పూర్తిచేసేటప్పటికి 40 నిమిషాలు గడిచాయి. సత్యేంద్ర  అంత ఎక్కువ సేపు మాట్లాడినందుకు క్షమించమని అడిగాడు, వాళ్ళ ప్రియమైన  టీచర్ త్వరగా కొలుకోవాలని కోరుకుంటూ  తాను ఇండియా  వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని  వాగ్దానం చేశాడు . 


కోవిద్ ఐసొలేషన్ వార్డులో ఒంటరిగా వున్న టీచర్ కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఆవిడ హృదయం సంతోషంతో పొంగిపోయింది, కన్నీళ్ళు ఆవిడ బుగ్గల మీదకు జారాయి. 

విద్యార్ధులకు క్రమశిక్షణ నేర్పినందుకు, వాళ్ళ మీద ఔదర్యాన్ని ప్రదర్శించినందుకు తనని జ్ఞాపకముంచుకున్నారని తెలుసుకోవడం ఆవిడకి ఆనందంలో ముంచెత్తే  అనుభవం.


అదేవిధంగా వాళ్ళందరూ సంతోషంగా వున్నారని ఆనందంగా జీవిస్తున్నారని తెలుసుకున్న ఆవిడ,  తరగతిలో తెలివైన వాళ్ళే కాదు తరగతిలో బాగా విసుగుపుట్టించే విద్యార్ధులు కూడా జీవితపు పాఠాలను నేర్చుకొని ప్రస్తుతం ఉత్తమంగా రాణిస్తున్నారని చాలా కృతజ్ఞతానుభూతి చెందింది. 


“ సిలబస్ లో లేనివి, తరగతిలో చెప్పని పాఠాలను జీవితంలో ఉపయోగించిన ఒక కుర్రవాడు ఇక్కడ వున్నాడు” అని ఆవిడ తనలో తాను అనుకుంది. 


అతడు అనుభవించిన శిక్షలు అతడ్ని పరిశీలకుడిగా ఒక విశాలమైన  దృష్టిని పెంపొందించుకోవాడానికి అవకాశం ఇచ్చాయి. క్లాసులను వదిలేసి పారిపోతూ దొరికిపోయినప్పుడు, చాలా చిన్నవయసులోనే కష్టాలను తగ్గించుకొని, వాటిని దాటడం నేర్చుకున్నాడు. 


అతడు తనకు విధించిన శిక్షను, పరిహారాన్ని తగ్గించమని ఆడగడానికి భోజనసమయంలో ఉపాధ్యాయుల గదికి వచ్చినప్పుడు చర్చించే కళను నేర్చుకున్నాడు. స్కూలులో వున్నప్పుడు అతను ఏర్పరచుకొన్న సంబంధాలు ఇప్పటికీ  బలంగా ఉన్నాయి.


లెక్కల్లో పోగొట్టుకున్న మార్కులను అతను నిజజీవితం కోసం భద్రపరుచుకున్నాడు. నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న సుబ్బు  సత్యేంద్ర పోగొట్టుకున్న ఆ అంకెలతోనే పనిచేయడం ఆశ్చర్యకరమైన విషయం.


ఆవిడ ఆలోచిస్తూనే వుంది. కరోనా మహమ్మారి వలన రెండు సంవత్సరాలుగా మూసి వేసిన స్కూళ్ళు  పిల్లల స్వభావాలను మలచుకునే అవకాశం ఇవ్వకుండా బాగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. 

ఇంట్లో కూర్చొని డిజిటల్ పద్దతిలో నేర్చుకోవడం కూడా గొప్ప నష్టాన్ని కలిగిస్తోంది. వాళ్ళు విద్యకు సంభందించినంత వరకు బాగా విజ్ఞానాన్ని పొంది వుండవచ్చు కానీ దానిని వాళ్ళు తమ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టగలరు ?


సమాజం నిజమైన అభివృద్దిని పొందడానికి, తరగతి గదులకే పరిమితమై పుస్తకాల ద్వారా పొందేది మాత్రమే విద్య కాదు అని ప్రపంచానికి తెలియజేయడానికి సత్యేంద్ర, సుబ్బు వంటి వ్యక్తుల అవసరం చాలా ఉంది. 


(ఈ కధ వాస్తవ జీవితపు సంఘటన మీద ఆధారపడినది )


 గ్రంధాలు, పుస్తకాల నుండి పొందే జ్ఞానం జీవితపు సమస్యలను పరిష్కరించదు. అవి కేవలం పునాదిగా పనికొస్తాయి.🙏🙏🙏🙏🙏

Fb సేకరణ. 🙏

కామెంట్‌లు లేవు: