26, డిసెంబర్ 2021, ఆదివారం

కృతఘ్నత

 ॐ                       కృతఘ్నత 



    "కృతఘ్నత" (ఇతరులు మనకు చేసిన మేలు మరచి పోవడం) మహాపాపం.

    అన్ని పాపములకు "ప్రాయశ్చిత్తం" శాస్త్రములలో చెప్పబడి  ఉంది.

    కానీ "కృతఘ్నతా దోషానికి" మాత్రం  ప్రాయశ్చిత్తం లేదు.

    భగవంతుడు కూడా ఈ దోషాన్ని పోగొట్టలేడు.

    ఒక్క సద్గురువు మాత్రమే ఈ దోషమునుండి భక్తులను కాపాడగలరు.


    కృతఘ్నతా దోషము పాలుగాకుండా, ఒక మహా పండితుని  శ్రీ కంచి పరమాచార్యులవారు అనుగ్రహించిన  సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము.


    అనంతపురంలో  "మొదలి శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు"  అనే వేద విద్వాంసులు ఉండేవారు.

    వారు అనేకమంది శిష్యులకు వేదము చెప్పేవారు. సంస్కృతములో కూడా గొప్ప పండితులు.

    అనంతపురం, ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకులుగా ఉద్యోగం చేసే వారు.


    మా బావమరిది శ్రీ అమ్మనమంచి శివప్రసాదు, అనంతపురం వైశ్యాబాంక్ లో పనిచేస్తుండగా వీరి సాంగత్యం లభించి, వీరి శిష్యులైనారు. వీరిదగ్గర "అరుణము", మొదలైనవి అధ్యయనం చేశారు.

    వారికి శ్రీ శర్మగారు స్వయముగా చెప్పినదే ఈ వృత్తాంతమంతా.


    శ్రీ శాస్త్రిగారు  నిత్యము " సప్తశతి"పారాయణ చేసేవారు.

    అనేకమంది చేత చండీయాగములు చేయించారు.

     ఆగమ శాస్త్ర పండితులు కూడా కాబట్టి  అనేక దేవాలయ ప్రతిష్టలు కూడా నిర్వహించారు.

    నెల్లూరు దగ్గరవున్న" పెంచలకోన" లో శ్రీ విజయేశ్వరి అమ్మవారు అనేకసార్లు వీరిచేత  తమ ఆశ్రమంలో చండీయాగములు చేయించారు. 


    ఒకసారి శ్రీ కంచి పరమాచార్యులవారు అనంతపురంలో పదిరోజులు బస చేశారు.

    శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు రోజూ వారిని దర్శించుకునేవారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామివారు వీరితో మాట్లాడేవారు కాదు. 

    అందరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా, ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వీరితో మాత్రం  శ్రీ స్వామివారు మాట్లాడక పోవడము అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించేది.

    శ్రీ స్వామి వారు తనతో మాట్లాడక పోవడముతో శ్రీ శర్మగారు ఎంతో మనస్తాపం చెందారు.

    కారణము తెలియక వారికి రోజు రోజుకు దుఃఖము అధిక మవుతుండేది.

    ఇలా పదిరోజులు గడిచినై.


    శ్రీ స్వామివారు అక్కడనుండి "ధర్మవరము" నకు ప్రయాణమయినారు.

    శ్రీ శర్మగారు చింతాగ్రస్తులయినారు. ఏమైనా సరే, శ్రీ స్వామివారు మాట్లాడేదాకా వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.

   "నేను ఎప్పుడు వస్తానో తెలియదు.అప్పటివరకు సెలవు మంజూరు చేయ వలసినది" అని కళాశాలకు సెలవు చీటీ పంపించి, శ్రీ స్వామివారి వెంట ధర్మవరము వెళ్లారు.

    శ్రీ స్వామివారు నదీ స్నానం ఆచరిస్తుండగా అక్కడ నిలబడి " అఘమర్షణ " సూక్తము మొదలైన స్నాన మంత్రములు చదివారు.

    మంత్రములు చదవటం పూర్తి అయినా, శ్రీ స్వామివారు, ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు.

    శ్రీ శర్మగారు కొంత తటపటాయిస్తూ "రుద్రము" చదవటం మొదలుపెట్టారు. 

    శ్రీ స్వామివారు చదవమని చేయి ఊపి సైగ చేశారు.


    పది రోజుల తరువాత అదే 

మొదటిసారి శ్రీ స్వామివారు, శ్రీ శర్మగారివంక చూడటము. 

    శ్రీ శర్మగారు మహదానంద భరితులయినారు.


    సాయంకాలము ఊరి వారందరితో కూడిన సభ జరుగుతున్నది. శ్రీ స్వామివారు వున్నట్లుండి శ్రీ శర్మగారిని పేరు పెట్టి పిలిచి, వేదికపైకి రమ్మన్నారు.

    శ్రీ శర్మగారు వేదికపైకి వెళ్లి శ్రీ స్వామివారికి " న కర్మణా న ప్రజయా" అని వేదమంత్రం చదువుతూ సాష్టాంగ నమస్కారం చేశారు. 

    శ్రీ పరమాచార్యులవారు వీరితో సంస్కృతములో సంభాషణ ప్రారంభించారు.


   "మీరు మీ గురువులను విస్మరించారు.

    మీ కుటుంబము వారందరికి శ్రీ శృంగేరీ జగద్గురువులతో ఎన్నో తరములనుండి అనుబంధము ఉన్నది.

    మీకు చిన్న తనములో నత్తి వల్ల మాటలు సరిగా రాకపోవడంతో మీ ఇంట్లో వారందరు దిగులు పడ్డారు.

    మీ తాతగారు, మిమ్ములను, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి సన్నిధికి  తీసుకు వెళ్లి విషయం విన్నవించారు.

    జగద్గురువులు మీ నోరు తెరవమన్నారు. ఎంతో అనుగ్రహంతో మీ నాలుకమీద వారి అమృతదృష్టి ప్రసరింపజేసి, చిరునవ్వు నవ్వుతూ "ఈ అబ్బాయి గొప్ప పండితుడు అవుతాడు. చాలా ప్రఖ్యాతి సంపాదిస్తాడు" అని ఆశీర్వదించారు.

    ఆ క్షణం నుండీ మీకు నత్తి పోయింది స్పష్టమైన ఉచ్ఛారణ వచ్చింది. వేదము, సంస్కృతము అధ్యయనం చేసి మంచి పండితులైనారు.

    అటువంటి సద్గురువులను మీరు విస్మరించారు" అన్నారు.


    శ్రీ శర్మగారు నిశ్చేష్టులైనారు.

    ఒక్కసారిగా వారికి గతమంతా గుర్తుకు వచ్చింది.

    తనను తన తాతగారు, శృంగేరీ తీసుకువెళ్లడము, జగద్గురువులు ఆశీర్వదించడము,తన విద్యాభ్యాసము, క్రమంగా శ్రీ జగద్గురువులను మరచి పోవడము అన్నీ జ్ఞప్తికి వచ్చినవి.

    ఎంతో సిగ్గు పడ్డారు.

    వారికి ఆశ్చర్యం కూడా వేసింది.

    ఎప్పుడో తన చిన్నతనంలో జరిగిన ఈ విషయాలు శ్రీ స్వామివారికి ఎలా తెలుసు?


    శ్రీ స్వామివారు సాక్షాత్తూ భగవంతుని అవతారం అనటానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి?

    తనకు "నత్తి" పోగొట్టి, వాక్పటుత్వము ప్రసాదించిన శ్రీ శృంగేరీ జగద్గురువులు కనులకు గోచరించారు. వారి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది.

    శ్రీ పరమాచార్యులవారికి సాష్టాంగ నమస్కారము చేశారు.


    తాను శ్రీ శృంగేరీ జగద్గురువులను విస్మరించి గొప్ప పాపం చేశానని, మీరు నన్ను కాపాడాలని, 

శ్రీ పరమాచార్యులవారిని  వేడుకున్నారు.

    శృంగేరీ వెళ్తానన్నారు.

    ఆ తరువాత వారిద్దరూ అనేక విషయములు మాట్లాడుకున్నారు.

    శ్రీ శర్మగారి సందేహాలు ఎన్నో శ్రీ స్వామివారు తీర్చారు.

    వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి అనుజ్ఞ ఇచ్చి పంపారు.

    శ్రీ శర్మగారు అప్పటినుండి శ్రీశృంగేరీ వారితో తమ అనుబంధం కొనసాగించారు. అనేకమందికి,వేదము, సంస్కృతము చెప్పారు. అనేక గ్రంధాలు రచించారు. 

    అనేక సత్కార్యాలు చేసి జన్మ చరితార్ధము చేసుకొన్నారు.

    దేహత్యాగ పర్యంతము ఏటువంటి రుగ్మతా లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వున్నారు.

    కృతఘ్నతా మహా దోషం నుండి తనను కాపాడిన శ్రీ పరమాచార్యులవారిని ఆ జన్మాంతమూ, స్మరించుకుంటూనే ఉండేవారు.


    కేవలము తమ భక్తులనే కాదు, సన్మార్గంలో ఉండే వారందరినీ  శ్రీపరమాచార్యులవారు ఇలా

 కాపాడుతూ ఉంటారు. 


శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః.


                    శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

25-12-'21. 


                   **********

    పరమాచార్య నడిచే దైవం.

    ఇప్పూడూ సమాధినించీ నడిపించే ఆ దైవానికి ప్రణామాలు.


"కృతఘ్నత" గురించి శ్రీరాముడు లక్ష్మణుని వాలివద్దకు పంపుతూ లక్ష్మణునితో అన్న మాట 


కృతార్థా హ్యకృతార్థానాం 

మిత్రాణాం న భవన్తి యే I

తాన్మృతానపి క్రవ్యాదాః 

కృతఘ్నాన్నోపభుఞ్జతే ॥ 4/30/73


    మిత్రులసహాయముతో తమ పనులను పూర్తి చేసికొని, 

    పిదప వారికి సహాయపడనివారు కృతఘ్నులు. 

    అట్టివారు చనిపోయిన పిమ్మట వారి కళేబరములను పచ్చిమాంసములను తినెడి క్రూరమృగములుగూడ ముట్టవు. 


    Even the carnivorous animals 

    dislike to eat the body of such ungrateful men 

    who do not help their friends even though they have received help and have achieved their objective. 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: