29, మార్చి 2022, మంగళవారం

సకాలసంధ్యావందనం

 🌸🌸🌸                       🌸🌸🌸

*సకాలసంధ్యావందనం ఎంతో ముఖ్యమైనది...*




                                                                        సంధ్యాసమయంలో భగవద్ధ్యానం మంచిదనీ అంటారు. సంధ్యాకాలం అంటే సరిగ్గా ఏ సమయం? 'సకాలం'లో సంధ్యావందనం చేయాలి కదా? ఆ 'సకాలం' ఏమిటి? 


      రోజుకి మూడు సంధ్యలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. 1. ప్రాతఃసంధ్య, 2. మధ్యాహ్న సంధ్య, 3. సాయం సంధ్య. ఇవికాక కొన్ని ఉపాసనలకు చెప్పబడ్డ సంధ్య - తురీయ సంధ్య. ఇది నాలుగవది. దీని సమయం అర్ధరాత్రి. (కొందరు ఇది ఆచరిస్తుంటారు)


       ఉదయానికి ముందు వచ్చేకాలం 'ప్రాతఃసంధ్య'. రాత్రికి ముందు వచ్చేది ' 'సాయంసంధ్య', మధ్యాహ్నవేళ 'మధ్యాహ్నిక సంధ్య'. 


*ఉదయా ప్రాక్తనీ సంధ్యా*

*ఘటికా త్రయ ముచ్యతే ౹*

*సాయం సంధ్యా త్రిఘటికా*

*అస్తాదుపరి భాస్వతః ౹౹*


సూర్యోదయానికి ముందు దాదాపు 70 నిమిషాల కాలం ప్రాతః సంధ్యకు ముఖ్యకాలం. సూర్యుడస్తమించడానికి ముందు ఇరవై నిమిషాలు మొదలుకొని, సూర్యుడస్తమించిన తరువాత 30 నిమిషాల కాలం సాయంసంధ్యకు ముఖ్య కాలం. ఇందులోనూ ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. 


1. *ఉత్తమా తారకోపేతా*

    *మధ్యమా లుప్త తారకా ౹*

    *అధమా సూర్యసహితా*

    *ప్రాతఃసంధ్యా త్రిధామతా ౹౹*


తెల్లవారు ఝామున నక్షత్రాలుండగా ప్రాతః సంధ్యావందనానికి ముఖ్యకాలం. ఇదే సకాలం. తారకలు లేని ప్రాతఃకాలం మధ్య కాలం, సూర్యుడు ఉదయించిన తరువాత సంధ్యా వందనానికి అధమ కాలం, సకాలంలో చేయడమే సర్వశ్రేష్ఠం. అలా కుదరనప్పుడు, మానేయడం మంచిది కాదు కనుక, "ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం" అధిక అర్ఘ్యప్రదానంతో సంధ్యోపాసన చేయాలి. 


2. *ఉత్తమా సూర్యసహితా*

    *మధ్యమా లుప్త భాస్కరా ౹*

    *అధమా తారకోపేతా*

    *సాయం సంధ్యా త్రిధామతా ౹౹*


సాయంవేళ సూర్యుడుండగా చేసే సంధ్యావందనం ముఖ్యకాలం, సకాలం. సూర్యుడస్త మించినప్పుడు మధ్యమం. నక్షత్రోదయం తరువాత చేయడం అధమం. కానీ 'సకాలం' దాటిపోతే, ప్రాతః సంధ్యకు లాగానే, 'ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం' అధిక అర్ఘ్య ప్రదానం చేయాలి. 


'మధ్యాహ్న సంధ్య' అంటే మధ్యాహ్నం 11 గంటల తరువాత నుండి సాయంత్రం లోపల చేయాలి.......

కామెంట్‌లు లేవు: