23, జులై 2022, శనివారం

 లంచము - శిక్ష


మహాస్వామివారికి న్యాయస్థానాల మీద అమితమైన విశ్వాసం, గౌరవం ఉండేవి. తప్పు చేసిన వానికి దండన అనే విషయంలో వారి వద్ద రాజీనే లేదు. తప్పు చేసినవాడు పశ్చాత్తపపడితే! అతడు నిజానికి మంచివాడై పొరపాటున తప్పు చేసి ఉంటే! ఇటువంటి క్లిష్టపరిస్థితులలో మహాస్వామివారి తీర్పు ఏ విధంగా ఉండేది? వారికి స్వామివారు ఇచ్చే సలహా ఏ విధంగా ఉండేది? 


మద్రాస్ లో తిరువెళ్ళిహేని పార్థసార్థి స్వామి ఆలయం దగ్గరగా ఒక బ్రాహ్మణభోజన హోటలు ఉండేది. దానిని నిర్వహించేవారు ఒక పాలఘాట్ అయ్యర్. మహాస్వామివారికి ఎంతో భక్తుడు. అప్పట్లో ద్రవిడ కళగం ఉద్యమం చాలా ఎక్కువగా ఉండేది. వారికి ఈ బ్రాహ్మణహోటల్ అన్నపేరు కంటగింపుగా ఉండేది. ఆ కాలంలో మన ప్రాంతాలలో వలె తమిళనాడులో కూడా శాఖాహార భోజనశాలలకు బ్రాహ్మణ భోజనశాలలనే పేరు. ఇప్పుడు శైవము - అశైవము అని మార్చారు. ఉత్తరాది వైష్ణవ భోజనశాలంటారు, సరి! 


ద్రవిడకళగం వారు ఒక గుంపుగా హోటల్ పై దoడెత్తారు. ఆ అయ్యర్ కి గుండె దిటవు ఎక్కువ. సలసల కాగే నూనె మూకుడు పెద్దది ఎత్తిపట్టి “కాలు ముందుకేస్తే మాడిపోతార”ని గర్జించాడు. గుంపు కకావికలమై పోయింది.


ఈయన దురదృష్టం - ఆ గుంపు నాయకుడు తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీలో ముఖ్యుడైనాడు. ఎలాగైనా ఈ హోటల్ మూయించాలని దృఢసంకల్పంతో ఉన్నాడు. మరి నాయకులకు ప్రభుత్వంలో ఉండే పలుకుబడి గురించి మనకు తెలియంది కాదు కదా! 


హోటలు తనిఖీకి ఆరోగ్యశాఖ అధికారులు వచ్చారు. ఆరోగ్యశాఖ ప్రమాణాలకు ఈ రోజులలో కూడా బహుశః ఏ హోటల్ నిలువలేదనుకుంటాను. ఈయన హోటల్ లోని లొసుగులన్నిటితో ఒక నివేదిక తయారు చేసి ఉంచాడు. 


హోటల్ తాత్కాలికంగా మూయించి విచారణ ఆరంభించారు. ఇలాంటి సమయాలలో మామూలుగా అయితే ఆరోగ్యశాఖ అధికారులకు లంచం ఇచ్చి కేసు మూయించుకుంటారు కదా! ఈ అయ్యర్ ను ఇంకా ఇరికించాలనే ఉద్దేశంతో ఆ నాయకుడే ఇతని దగ్గరకు మనుషులను పంపాడు. ఆ అధికారికి లంచం ఇస్తే కేసు మాఫీ చేస్తారని నమ్మబలికారు. పాపం ఈ అయ్యర్ ఆ అధికారికి లంచం ఇచ్చాడు. ముందుగా వేసుకున్న ప్రణాలికకు అనుగుణంగా అక్కడ పోలీసులు అయ్యర్ ను అరెస్టు చేశారు. పోలీసు విచారణలో అయ్యర్ లంచం ఇచ్చిన విషయం ఒప్పుకున్నాడు. 


హోటల్ లొసుగుల కంటే ఈ కేసు బలీయమై కూర్చుంది. ఈ పరిస్థితిలో అయ్యర్ పరమాచార్య స్వామి వద్దకు వచ్చి బోరుమన్నాడు. 


“ఎందుకలా చేశావ”ని ప్రశ్నించారు స్వామి. 


”వాళ్ళ మాటలు నమ్మాను. ఇప్పుడేం చేయమంటా”రన్నాడు అయ్యర్. 


ఈ మాటలు ఆ సమయంలో దర్శనానికి వచ్చిన మద్రాసులో పేరుమోసిన క్రిమినల్ లాయర్ వింటున్నాడు. స్వామివారు అతనివంకకు తిరిగి, “పాపం! ఈ అమాయకుని విషయంలో నీవేమైనా చేయగలవా?” అన్నారు. 


”ఈతడే స్వయంగా జరిగినదంతా వ్రాసి సంతకం చేసి మరీ ఇచ్చాడు. ఈతనిని రక్షించడం నావల్ల కాదుకదా భగవంతునివల్ల కూడా కాద”న్నాడు లాయరు. 


స్వామివారు నవ్వి, “భగవంతుడు ఏమి చేయగలడో అది ఆయనకే వదులుదాము లే” అంటూ అయ్యర్ వంక తిరిగి, “కామాక్షీదేకి దర్శనం చేసుకుని ఆవిడకు విన్నవించుకొని ఇంటికి పో! ఆమె మీద భారం వేసి కోర్టులో నిజం మాత్రమే చెప్పు” అన్నారు. 


కోర్టులో కేసు విచారణకు వచ్చింది. అయ్యరు ఉన్నదున్నట్లుగా పూసగుచ్చినట్లు చెప్పాడు. సాక్షులందరినీ విచారించిన తరువాత న్యాయాధికారి అత్యాశ్చర్యకరమైన తీర్పు ఇచ్చాడు. 


“నా అనుభవంలో ఇంతవరకూ ఈ విధంగా శిక్షపడుతుందని తెలిసి కూడా కేవలం నిజమే చెప్పిన ముద్దాయిలను నేను చూడలేదు. ఈతడు చేసింది తప్పే. సాక్షులు ఒప్పుకోకపోయినప్పటికీ వారి మాటల ప్రభావంతో అమాయకంగా ఈ తప్పు చేశాడని నమ్ముతున్నాను. పశ్చాత్తాపంతో పవిత్రుడైన ఈతడు మరి ఇటువంటి తప్పులు చేయడని విశ్వసిస్తున్నాను. అతడు న్యాయస్థానం వారి క్షమకై చేసుకొన్న అర్జీని అంగీకరిస్తూ అతనిని విడుదల చేస్తున్నాను” అన్నది ఆ తీర్పు సారాంశం. 


తీర్పువిని అయ్యర్ నేరుగా స్వామివారి పాదాలను ఆశ్రయించి వెక్కి వెక్కి ఏడ్చాడన్న విషయం వేరుగా చెప్పనక్కర్లేదు. అయితే ఆరోజున భగవంతుడు కూడా శిక్ష తప్పించలేడని చెప్పిన లాయరు నేరుగా స్వామివారి ఎదురుగా చెంపలు వేసుకొని


“ఇది కేవలం స్వామివారి అనుగ్రహమే తప్ప వేరొకటి కాద”ని సాష్టాంగంగా నమస్కరించాడు. 


సత్యం బ్రూయాత్ ప్రియమ్ బ్రూయాత్ 

న బ్రూయాత్ సత్యమప్రియమ్

ప్రియం నానృతం బ్రూయాత్ 

ఏషః ధర్మ సనాతనః


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి, ఋషిపీఠం ప్రచురణ


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: