23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

దానవుడు మానవుడు

 దానవుడు..

                  మానవుడు..

                                     దేవుడు

                   


మానవునకు రోగం కలిగించేది పాపం.

పాపం చెయ్యకూడదు అని తెలిసినా చేస్తాడు మనిషి పాపం.


మానవునకు భోగం కలిగించేది పుణ్యం.

పుణ్యం చేస్తే మంచిది అని తెలిసినా, పుణ్యం చెయ్యడానికి యిచ్చగించదు మనసు.


మానవుని భవిష్యత్తు నిర్ణయించేది కర్మ.

నీ స్వకీయ కర్మను అంకిత భావంతో చేసుకో మంటాడు పరమాత్మ. అలా చేసుకుంటే - నీకు మోక్షం కూడా యిస్తానన్నాడు భగవద్గీత 18-46 శ్లోకంలో.

అయినా మనసు యిచ్చ గించదు.


మానవునకు లాభం కలిగించేది సేవ.

సర్వ ప్రాణులకు చేసిన సేవ మాధవ సేవే ఔతుంది -అని, పదే పదే చెప్పాడు పరమాత్మ కానీ, అంతా నాకే కావాలంటాడు మనిషి.


మానవునకు సంపాదన నిలిపేది పొదుపు.

బిందువు + బిందువు కలిస్తేనే సింధువు అయ్యింది అని తెలుసు మనిషికి! కానీ కొంచెం + కొంచెం కూడ బెడితే కొండంత అవుతుంది అని తెలిసినా - ఒకేసారి కొండంత అయిపోవాలంటాడు మనిషి.

ఇటుక + ఇటుక పేరిస్తేనే ఇల్లు ఔతుంది. ఓకే రోజు ఇల్లు పూర్తైపోవాలంటాడు మనిషి.

విత్తనం పెట్టి, నీరు + ఎరువు వేసి కొన్ని సంవత్సరాలు పెంచితే, చెట్టు ను జాగ్రత్తగా కాపాడితే - బ్రతికి నన్నాళ్ళు ఫలాలు యిస్తుందని తెలిసినా, ఓర్పు వుండదు మనిషికి.


మానవుని విలువ పెంచేది దానం.

మనకున్న దాంట్లో, మనకన్నా లేని వాళ్లకు దానం చెయ్యాలి. నీవుఒక చేత్తో దానం చేస్తే - నీకు పది చేతుల్తో సహాయం చేస్తాడు దేవుడు.

దానం చెయ్యాలి!          మానాన్న నాచేతికిచ్చి, నాచేత్తో దానం చేయించేవాడు.

అంటే, నాకు దానగుణం నేర్పాడన్న మాట.


దయగల హృదయమే భగవన్నిలయము.

మానవునకు నష్టం కలిగించేది హింస.

’అహింసా పరమోధర్మహః’- అని శాస్త్రం చెప్పినా, మనిషి హింస మానడు. [బోయవాడు కొల్లేరు (నీటి సరస్సు)లో పట్టిన పక్షుల్ని మావూర్లో అమ్మడానికి వచ్చే వాడట. మొత్తం పక్షుల గుట్టను క్రిందికి దింపించి - కట్లు (హరిః ఓమ్ హరిః ఓమ్) విప్పించే వాడట మాతాత. బేరమాడి, కాళ్ళు + రెక్కలు బాగా వున్న పక్షుల్ని మొత్తంగా కొని పక్షుల్ని వదిలేసే వాడట మాతాత. అది అహింసకు పరాకాష్ట].  


తన తొడ నుండి మాంసం కోసి బోయ వాడికి (తాను పట్టుకున్న పావురాయికి బదులు) యిచ్చిన శిబి చక్రవర్తి ఈ దేశంలో పుట్టిన వాడే గదా! మాతాతకు శిబిచక్రవర్తి ఆదర్శం.


మానవునకు అశాంతి కలిగించేది ఆశ.

ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. ఆశకు మితం ఏముంది?

మానవునకు శాంతి కలిగించేది తృప్తి.

తినుటకు జీవించువాడు బద్ధుడు, జీవించుటకు తినువాడు ముక్తుడు. Eat to live, do not live to eat.


మానవునకు దుఃఖం కలిగించేది కామం.

Desire is the root cause of all evils. It is an insatiable demand _ కోర్కెలు తీరేవి కావు. కోర్కెల్ని తీర్చలేము.


మానవుని పతనం చేసేది అహంకారం.

’అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహా’ లను వదిలేస్తే మోక్షం యిస్తానన్నాడు పరమాత్మ  భగవద్గీతలో.


మానవునకు అందరిని దగ్గర చేసేది ప్రేమ.

Serve, Love, Give, Purify, Meditate, Realise.


మానవునకు అందరినీ దూరం చేసేది అసూయ.

కేవలం అసూయతో దుర్యోధనుడు వంశవినాశనానికి కారకు డౌతాడు.


మానవుని స్థితిని సూచించేది గుణం.

అన్నింటికీ మూలకారణం గుణమే. మంచి గుణం తయారు చేసుకోవాలి. చెడుగుణాల్ని వదిలి మంచి గుణాల్ని పోగు జేసుకోవాలి. అప్పుడు మనలో దైవత్వం చేరుతుంది.


మానవుని దైవంగా మార్చేది "దయ!"


మానవుని ఆత్మస్థితి తెలిపేది వాక్కు.

తియ్యగా మాట్లాడటం నేర్చుకోవాలి. ‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్’ - అని భగవద్గీత చెప్పింది.


మానవునకు విజయం చేకూర్చేది "ధర్మం"

మానవుని గొప్పవాడిగా చేసేది "తత్వజ్ఞానం".

మానవునకు ముక్తి నిఇచ్చేది "సత్యం".

మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది "ధ్యానం".

కామెంట్‌లు లేవు: