12, అక్టోబర్ 2022, బుధవారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 1


ఇరువదవ శతాబ్దము బహు విధములుగా చాలా గొప్పది. ఆధ్యాత్మిక రంగమున దీని ముద్ర శాశ్వతమైనది. ఈ శతాబ్దములో ఆధ్యాత్మికాకాశమున దివ్య జ్యోతులు అనేకము వెలుగొందినవి. అందులోనూ దక్షిణ భారత దేశము ఈ విషయమున ఎంతో ముందున్నది. శృంగేరీ చంద్రశేఖర భారతీ స్వామి వారొకరు తిరువణ్ణామలై రమణులొకరు కంచి మహాస్వాము లొకరు ధగద్ధగాయమానముగ ప్రకాశించిన మహాజ్యోతులు. ఒకరు తెలుగు వారు, వేరొకరు తమిళులు, ఇంకొకరు కన్నడిగులు. ముగ్గురూ జీవన్ముక్తులు. ముగ్గురూ ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతమును అనుభవములో నిరూపించిన మహామహులు. వీరు మువ్వురూ కారణములేమైననూ ఒకరినొకరు కలుసుకొనలేదు. శృంగేరీ స్వామి, రమణ భగవానులు కలిసే అవకాశం లేదు. శృంగేరీ స్వామి తిరువణ్ణామలై పోలేదు. రమణులు ఆ వూరు వదలలేదు.


అయితే కంచిస్వామి రమణులు ఉండగా తిరువణ్ణామలై రెండుసార్లు వెళ్ళారు. తిరువణ్ణామలై ఏమిటి – రమణాశ్రమం ముందుగనే నడుస్తూ గిరి ప్రదక్షిణానికి వెళ్ళారు. బౌద్ధమత ప్రవక్త అయిన గౌతమ బుద్ధుడు. జైన మత ప్రవక్త అయిన మహావీరుడు చాలాకాలం ప్రక్క ప్రక్క వీధులలో ఉండి కూడా కలుసుకోలేదుట. వారు కలుసుకోపోవడానికి కారణం చరిత్ర మనకు తెలపలేదు. వీరు కలుసుకోపోవడానికి మాత్రం కారణం పీఠనియమాలే. పీఠాధిపతులు అనాహుతులుగా ఇంకొక చోటికి పోవడానికి వీలులేదు. అందులో స్వామివారు తాము మానాభిమానాలకు అతీతులైనా, ఆదిశంకరులు అధిష్ఠించిన పీఠగౌరవ విషయంలో మాత్రం ఎంతో పట్టుగా ఉండేవారు.


ఒక సందర్భంలో ఒక ముఖ్య విషయంపై మంతనాలు జరపడానికి ఒక వైష్ణవ మఠాధిపతి ఆహ్వానంపై తాము పోతున్న దారిలో ఉన్న ఆ మఠానికి పోవడానికి శ్రీవారు సమ్మతించారు. తీరా ఒప్పుకొన్న తరువాత శ్రీమఠపు మేనేజరు ఆ వైష్ణవ మఠయాజమాన్యం వారు ఆ మఠాధిక్యత పైన నమ్మకం కలవారు అవడాన ఏదైనా అవమానం జరుగుతుందేమోననే సందేహాన్ని శ్రీవారి ముందు వెలిబుచ్చారు. 

అయితే అలాంటి సంఘటనేమీ జరగకుండానే సమావేశం సాఫీగా జరిగిపోయింది. స్వామివారి సన్నిధిలో మేనేజర్ విశ్వనాథ అయ్యర్ తమ సంతృప్తిని వెలిబుచ్చారు. "అవునయ్యా! మీ పీఠగౌరవాన్ని నిలబెట్టడానికే నేను ఒంటికాలు మీద కూర్చోవలసి వచ్చింది" అన్నారట స్వామివారు.


అసలు ఏమిజరిగిందంటే స్వామివారు లోపలికి ప్రవేశించగానే తమకు కూర్చోవడానికి చూపే ఆసనం వైపు చూశారు. వైష్ణవ ఆచార్యుల వారు కూర్చోబోయే ఆసనం కంటే రెండంగుళాలు తక్కువ ఎత్తులో ఉంది. స్వామివారు కూర్చోగానే ఫోటోలు తీస్తారు. వారు ప్రచారం చేసినా చేయకపోయినా శంకర పీఠాధిపతులు రెండంగుళాలు క్రింద కూర్చుని ఉన్నట్లు తెలుస్తుంది. ఇది గ్రహించిన స్వామివారు తనకే చేతనైన విధానంలో మడమపై కూర్చుని రెండవ కాలు పైన వేసి నేలమీద కూర్చున్నారు. వైష్ణవస్వామికి ఈ ఆసనం రాదు కదా! నేలమీద చతికిల పడవలసి వచ్చింది. మఠగౌరవ విషయంలో స్వామివారు అంత గమనంగా ఉంటారు.


అంత గమనం అవసరమా అని చదువరులకు ఆశ్చర్యం కలగవచ్చు. ఈ మధ్యకాలంలో మన విజయవాడలోనే జరిగిన ఒక సంఘటన చెబుతాను. శంకర విజయేంద్రసరస్వతీ స్వామివారు కృష్ణా పుష్కర సందర్భంలో కృష్ణ గట్టు అవతల జరిగిన ఒక యజ్ఞానికి నిర్వాహకుల ఆహ్వానంపై వెళ్ళారు. అప్పటి జీయర్ స్వామి ఉపన్యాసం నాకు ఆశ్చర్యం కలగజేసింది. “మా గురువులను కంచి మహాస్వామివారు కలసినప్పుడు...’ అని చెబుతున్నారు. యదార్థానికి జియ్యర్ గారే అనేక సందర్భాలలో పెద్ద శ్రీవారి దర్శనం చేసినట్లు మహాస్వామివారిని ఎంతో ఆదరించినట్లు మనందరికీ తెలుసు. చిన్నజియ్యర్ గారి ఎదురుగా కూర్చున్న పామర జనానికి అది తెలియదు కదా! శంకరాచార్యుల వారే వచ్చి మన గురువులను కలుసుకొంటారట అని చెప్పుకొంటారు.


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: