12, జూన్ 2023, సోమవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 88*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 88*


చాణక్యుడు అశ్వరూడుడై వేగంగా ప్రయాణం చేసి పర్వతక సోదరుడు వైరోచనుని విడిదికి చేరుకున్నాడు. వైరోచనుడు ఆర్యునికీ స్వాగతం పలికి "చంద్రగుప్తునితో పాటే మాకూ పట్టాభిషేకమన్నారుగా ? ఇప్పుడు ఊరేగింపు అతనికొక్కడికే పరిమితం చేయడం ఏమి న్యాయం ?" అని అడిగాడు నిష్టూరంగా.


"మా చంద్రుడూ సరిగ్గా ఇదే ప్రశ్న నన్ను అడిగాడు..." అంటూ చాణక్యుడు నవ్వి "ఊరేగింపు మాత్రమే కాదు. పట్టాభిషేక విషయంలోనూ, తన విజయానికి కారకులైన మీకే మొదటి గౌరవం దక్కాలని, ముందుగా తమర్ని అర్ధరాజ్యాభిషిక్తుడిని గావించిన తర్వాతే తన పట్టాభిషేకం జరగాలని మా చంద్రుడు మంకుపట్టు పట్టాడు. అదీ నిజమే. అసలు విజయానంతటికీ మూలకారకులు మీరూ మీ సైన్యసంపత్తులేకదా ! చంద్రుడి పట్టు న్యాయమే" అన్నాడు. 


చంద్రగుప్తుడికంటే ముందు తనకే అర్థరాజ్య పట్టాభిషేకం జరుపుతారన్న మాటకి వైరోచనుడు లోలోపలే సంబరపడిపోతూ "న్యాయం ఎవరు చెప్పినా న్యాయమే" అన్నాడు. 


చాణుక్యుడు నవ్వి "మరే ఇందులో వేరు అభిప్రాయానికి తావులేదు. కానీ ... " అర్థోక్తిలో ఆగాడు. 


"కానీ ....?" అనుమానంతో రెట్టించాడు వైరోచనుడు. 


"మరేం లేదు. ధర్మాచరణ మంటూ ఒకటి ఉంది కదా ! మగధలోని పెద్దలు ధర్మాచరణకే ప్రాధాన్యతను ఇస్తారు. ఆ ప్రకారం ఆలోచిస్తే చంద్రుడే మొదట సింహాసనం అధిష్టించాలి. అతడేమో ఒప్పుకోవడం లేదు. అందుకని..." 


"చెప్పండి...." రెట్టించాడు వైరోచనుడు.


చాణక్యుడు నవ్వి "మరేంలేదు. భద్రగజంపై చంద్రగుప్తుని ఊరేగింపు పెట్టిన ముహూర్తానికే బయలుదేరుతుంది. కానీ ఇక్కడే చిన్న మార్పు. ఏనుగుపై చంద్రుని బదులు అతని దుస్తులు ధరించి మీరు ఆసీనులై ఊరేగుతారు. ప్రజలు గుర్తించకుండా మీ ముఖం మీద పూలమాలలు వేస్తాం. మీరు చంద్రునిలా ఊరేగుతూ సభాస్థలికి చేరుకుంటారు. వెంటనే మీకు పట్టాభిషేకమూ జరిగిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని సభాస్థలకి పరిచయం చేస్తాం. జరగాల్సిందేదో జరిగిపోయింది కాబట్టి మాగధ పెద్దలు నోరెత్తలేరు. ఆ తదనంతరం చంద్రునికి అర్ధరాజ్యాభిషేకం. అదీ మీ చేతుల మీదుగా..." అని చెప్పి ఆగి, ఊపిరి పీల్చుకొని "దీనికి తమరు పెద్ద మనసుతో అంగీకరిస్తేనే" అంటూ ముక్తాయింపు ఇచ్చాడు. 


ఊరేగింపుతో పాటు పట్టాభిషేకం ముందు తనకే జరుగుతుందని విన్నాక, వైరోచనుడు మరేం ఆలోచించకుండా "బలేవారే మీరు నిర్ణయం చేశాక దాన్ని వ్యతిరేకిస్తానా ? మీ ఇష్టప్రకారమే కానివ్వండి" అని చెప్పాడు సంతోషంగా. 


చాణక్యుడు లేచి "శుభం. అయితే పట్టాభిషేకం దుస్తులు పంపిస్తాను. ధరించి సిద్ధంగా ఉండండి" అని చెప్పి బయలుదేరాడు. 


వైరోచనుడు తన అంగరక్షక దళసేనానిని పిలిచి చాణక్యుని వ్యూహాన్ని అతనికి వివరించి "నేను భద్రగజం మీద ఊరేగుతాను. మీరు చంద్రగుప్తుని గౌరవార్థం అన్న వంకతో మన సైన్యాలతో నాకు ఇరుపక్కలా అనుసరించండి. అనుకున్న ప్రకారం మా పట్టాభిషేకం సజావుగా జరిగిందా సరే సరి. ఏదైనా ప్రమాదం వస్తే మీరు తెగబడి చాణక్య చంద్రగుప్తులను నరికి పారేయ్యండి. మేము సింహాసనాన్ని ఆక్రమించుకుంటాం" అని తన వ్యూహాన్ని విశదం చేశాడు. 


ఊరేగింపు అనుకున్న ముహూర్తానికి ప్రారంభమైంది. ముందు భాగంలో పాంచాల, అయోధ్య, కాశీ, మధుర రాజ్యాలు సైన్యాలు వాటివెనక మంగళ వాయిద్యాలతో పాటు వివిధ వాయిద్య బృందాలు, వారి వెనక కవి, గాయక, నృత్య కళాబృందాలు, ఆ వెనక వేదమంత్రోచ్ఛారణలు చేస్తూ వేద మంత్రోచ్చారణలు చేస్తూ వేదకోవిదులు, పురోహితులు, ప్రముఖులు, మంత్రులు, ఆ వెనక భద్రగజంపై ఆశీనుడై చంద్రగుప్తుడు-భద్రగజానికి ఇరువైపులా 'గౌరవ సూచకంగా' పర్వతక సేనలు, ఆ వెనక పిప్పలవన సేనలు, వాటి వెనక సింహపురి సేనలు, వాటి తర్వాత ఆంధ్ర, కళింగ సైన్యాలు అనుసరిస్తుండగా ఊరేగింపు నగర ప్రధాన వీధులగుండా సాగుతోంది. 


చంద్రగుప్తుని దుస్తుల్లో ముఖం ఆనవాలు తెలియకుండా పూలమాలలు ధరించి భద్రగజంపై ఊరేగుతున్న వైరోచనుడు తన అదృష్టానికి లోలోపలే మురిసిపోతున్నాడు. ఊరేగింపు కంటే ముందు చాణక్యుడు ఒక్కడే అశ్వారూడుడై ముందుకు సాగుతున్నాడు, ప్రజలు నినాదాలతో, చంద్రగుప్తునికి జేజేలతో నగర వీధులు మార్మోగిపోతుంటే.... చాణక్యుడి డేగ చూపులు దారి పొడవునా "దేనినో" అన్వేషిస్తూనే ఉన్నాయి.

 

ఊరేగింపు క్రమక్రమంగా ఉత్తర దిశకు తిరిగి ప్రధాన రాజమార్గంలో సుగాంగ ప్రాసాదం వైపు పయనించసాగింది. రాజభవనం సమీపిస్తుండడంతో ఊరేగింపు కోలాహలం మిన్నంటింది. 


ఆ సమయంలో చాణక్యుడి దృష్టి ఒక అద్భుతమైన ద్వారం మీద పడింది. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*



🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: