19, జూన్ 2023, సోమవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 95*

 .    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 95*


పట్టాభిషేక మహోత్సవానంతరం తన నివాసాన్ని ఒక పర్ణకుటీరానికి మార్చాడు చాణక్యుడు. చంద్రగుప్తుడు ఎంత ప్రాధేయపడినా, రాజమాత మురాదేవి ఎన్ని విధాల బ్రతిమాలినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు చాణక్యుడు. 


"వేద కోవిదుడైన బ్రాహ్మణుడికి ఆశ్రమమే నివాసయోగ్యమని ధర్మశాస్త్రాలు బోధించాయి. ధర్మపరి రక్షణార్థమే నేనింతవరకూ బ్రాహ్మణ నిందార్హమైన పనులు కొన్ని చేశాను. నాకు రాజభోగాల మీద యే మాత్రం ఆసక్తి లేదు. నా సహాయ సహకారాలు నేనెక్కడున్నా మీకు లభిస్తూనే ఉంటాయి. నా వర్ణాశ్రమ ధర్మాన్ని ఇకనైనా నన్ను ఆచరించనివ్వండి" అని నిర్మొహమాటంగా చెప్పాడు చాణక్యుడు. 


కుసుమపుర ఉద్యానవనంలో శోణనదీ తీర ప్రాంతంలో నిరాడంబరంగా నిర్మించబడిన పర్ణకుటీరానికి తన నివాసాన్ని మార్చేశాడు చాణక్యుడు. అయితే ప్రతినిత్యం ఆర్యుడు బ్రహ్మీ ముహూర్తానికి పూర్వమే లేచి తన నిత్య కృత్యాలు పూర్తి చేసుకుని సూర్యోదయానికి పూర్వమే రాజభవనానికి వచ్చి పరిపాలన సంబంధమైన విధుల్లో చంద్రగుప్తునికి తన సలహా, సంప్రదింపులు అందిస్తున్నాడు. అయితే పేరుకి చంద్రగుప్తుడు రాజేగానీ పరిపాలన యావత్తు చాణక్యుని చేతిల మీదుగానే నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్యుని సహాయం అనివార్యమని అందరికీ తెలుసు. 


ఒకనాడు చంద్రగుప్తుడి నుద్దేశించి "రాజా ! నీవంటి ధర్మనిరుతులైన నరేంద్రుల నిమిత్తమే నేను అర్థశాస్త్రాన్ని రచించాను. దాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి తగిన సమయం ఇదే... రేపటినుంచీ ప్రతిరోజూ బ్రహ్మీముహూర్తంలో నీకు అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయిస్తాను. ఈ అధ్యయనం నిమిత్తం నీవే రోజూ బ్రహ్మీముహూర్త సమయానికి నా ఆశ్రమానికి రావాల్సి ఉంటుంది. గురుకుల ఆశ్రమంలో శాస్త్ర అధ్యయనం మన ప్రాచీన సాంప్రదాయం" అని చెప్పాడు చాణక్యుడు. 'సరే'నని తలవూపాడు చంద్రగుప్తుడు. 


ఆ మరునాటి బ్రహ్మీముహూర్త సమయంలో చంద్రగుప్తునికి అర్థశాస్త్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టాడు చాణక్యుడు. ఆర్యుని అర్థశాస్త్రం నందలి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.... 


శ్లో ll 

    ప్రజాసుఖే సుఖం రాజ్ఞ ప్రజానాం చ హితమ్  

    నాత్మప్రియం హితం రాజ్ఞ ప్రజానాంతు ప్రియం        

    హితమ్ ll


'ప్రజల సుఖమే రాజుకి సుఖము. ప్రజాహితమే తన హితము. ప్రజలకు కానిదేదీ రాజుకి ప్రియము కాదు. హితము కాదు' అను మూలసూత్రము పరమావధిగా రచించబడిన అర్థశాస్త్రము సుమారు ఆరువేల తాళపత్ర గ్రంథంములలో లిఖించబడింది. ఒక్కొక్క తాళపత్ర గ్రంథంనందు నూరు తాళపత్రములు గుది గుచ్చబడివుండును.  


♦️రాజు అన్ని విద్యలలో ఆరితేరిన వాడై ఉండాలి. ఇంద్రియ నిగ్రహమును పాటించగల సమర్ధుడై ఉండాలి. ఈ రెండు విశేషములులేని రాజు పరిపాలన వ్యాధిగ్రస్తమై కుళ్లిన శరీరంతో సమానం. 


♦️వేదవిజ్ఞానము, వేదాంతము, ఆర్థికశాస్త్రము, రాజకీయమునందు క్షుణ్ణముగా పరిజ్ఞానం ఉన్నవాడే రాజుగా అర్హుడు. ఇందు దండనీతి అతి ముఖ్యమైనది. 


♦️ప్రభువు పరిపాలనకు సంబంధించిన అన్ని కార్యములను తానొక్కడే నిర్వహించలేడు. పరిపాలనలో ప్రభువుకి సహకరించడానికి కొందరు సహాయకులను నియమించుకోవలెను. వీరిని రాజసేవకులు లేదా ప్రభుత్వోద్యోగులు అందురు. ఇట్టి రాజసేవకులలో.... 

1. మంత్రి 

2. పురోహితుడు లేదా రాజగురువు 

3. సేనాధిపతి 

4. యువరాజు 

5. దౌవారికుడు

6. అంతర్వంశుకుడు

7. ప్రశాస్త 

8. సమాహర్త 

9. సన్నిధాత 

10. ప్రదీష్ట 

11. నాయకుడు 

12. పౌరవ్యవహారికుడు

13. కార్మాంతికుడు 

14. మంత్రిపరిషత్ అధ్యక్షుడు

15. దండపాలుడు

16. న్యాయాధీశుడు

17. అంతపాలుడు 

18. ఆటవికుడు 


అను పద్దెనిమిది విభాగములతో కార్యనిర్వాహక గణములను నియమించవలెను. ప్రభుత్వంలోని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క నాయకుడుగా నియమించబడు వీరికి 'పద్దెనిమిది తీర్థములు' అని పేరు. శాఖాబేధాలున్నా వీరందరూ ప్రభుత్వోద్యోగులే... ప్రజాసేవకులే... 


♦️మంత్రి మండలి అనునది కనీసం పన్నెండుగురు మంత్రులతో ఏర్పాటు చేయవలెను. వీరిలో అమాత్యుడు ముఖ్యుడు. ఇతనే మహామంత్రి లేదా ప్రధానమంత్రి అని వ్యవహరించవచ్చును. దేశక్షేమము, యుద్ధము, ప్రజాసంక్షేమము, వ్యవసాయము, నీటి వనరులు, కార్మిక విధానము, వ్యాపార వాణిజ్యములు, పరిశ్రమలు, అటవీ సంపద, భూగర్భ సంపద, రహదారులు, బలహీన వర్గాల సంక్షేమం వంటి ప్రధాన శాఖలను ఏర్పాటు చేసుకొని, మంత్రుల సమర్థత అభీష్టానుసారం వారి వారికి ఆయా శాఖలను అప్పగించి సజావుగా, ధర్మబద్ధంగా పరిపాలన జరుగునట్లు చూచుట మహామంత్రి లేదా ప్రధానమంత్రి బాధ్యత. ఇతడే అన్ని శాఖలపై నియంత్రణాధికారి. ఇతని మాటకు తిరుగులేదు. ఇతడే ప్రభువునకు కుడిభుజము వంటి వాడు. 


♦️స్వార్ధము మనిషికి సన్నిహితము. రాజోద్యోగి స్వార్థపరుడైతే ప్రజాధనాన్ని తస్కరిస్తాడు. శత్రువుల నుండి ధనాన్ని స్వీకరించి ప్రభుత్వ రహస్యాలు బహిర్గతం చేస్తాడు. కనుక ఉద్యోగులను నిరంతరం కనిపెట్టి చూచుటకు ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండవలెను. ఇట్టి వ్యవస్థ ఉద్యోగులను నేరస్తులవల్లే చూడకుండా ఉద్యోగులలోని నేరస్తులను కనిపెట్టి వాని నేరములు నిరూపించునదై ఉండవలెను.


♦️అవినీతి మార్గాన ఆదాయము పెంచుకున్న రాజసేవకుడు ఏ స్థాయి వాడైననూ, వాని సంపదను జప్తు చేసి ప్రభుత్వ కోశాగారమున జమచేసి వానిని కఠినముగా శిక్షించవలెను. అయితే వానిపై ఆధారపడిన భార్యాబిడ్డలకు ప్రభుత్వమే తగిన జీవన భృతిని ఏర్పాటుచేయవలెను. ఉద్యోగి చేసిన తప్పుకి వాని భార్యాబిడ్డలు శిక్ష అనుభవించకూడదు గదా ! 


♦️అవినీతిపరులని తేలిన మంత్రుల సంపదను జప్తు చేసి వారికి దేశ బహిష్కారము విధించవలెను. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀

 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: