20, జులై 2023, గురువారం

శ్లోకానికి మంత్రానికీ తేడా

 శ్లోకానికి మంత్రానికీ తేడా ఏమిటి?


మంత్రానికి కనీసం నాలుగు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు.


· వేదాలలో ... మొత్తం ఋగ్వేదం ఎనిమిది అష్టకాలు లేదా పది మండలాలుగా విభజించబడింది. ఆ ఒక్కొక్క మండలం లేదా అష్టకం కొన్ని సూక్తాలుగా విభజించ బడ్డాయి. ఆ ఒక్కో సూక్తానికి విడివిడిగా దేవత, ఛందస్సు, ఋషి, వంటి కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ విధంగా ఏర్పరచిన సూక్తాలలోని అతి చిన్న విభాగాన్ని ఋక్ లేదా ఋచ్ అంటారు. ఆ ఋక్కులకే మరో పేరు మంత్రం. అదే విధంగా యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామలు వుంటాయి. వీటినే వేదం మంత్రాలు అంటారు.


· దైవారాధనలో ... ఏదైనా వ్యక్తిగత దేవతను ఉద్దేశించిన పవిత్ర అక్షర/శబ్ద సూత్రం. ఉదా. ఓం విష్ణవే నమః, ఓం శివాయ నమః.


· తంత్రశాస్త్రంలో ... ఒక ఆధ్యాత్మిక పద్యం లేదా మాంత్రిక సూత్రం (కొన్నిసార్లు వ్యక్తీకరించబడింది), మంత్రం, ఆకర్షణ (spell) (ఉదా. ఆధునిక కాలంలో మానవాతీత శక్తులను పొందేందుకు శక్తి ఉపాసకులు ఉపయోగించారు; ప్రాథమిక మంత్రాలు సంఖ్య 70 మిలియన్లు మరియు ద్వితీయ అసంఖ్యాకమైనవి).


· రాజనీతి, ఇతర రంగాలలో ... సంప్రదింపులు, తీర్మానం, వ్యక్తిగత సలహా, ప్రణాళిక, ప్లాన్, రహస్యం, మొదలైనవి. రాజులకు మంత్రులు, గూఢచారులతో చర్చలు, సమావేశాలు జరపడానికి ఆలోచనా మందిరం లేక మంత్రాలయం అనే ప్రత్యేక సమావేశ మందిరాలు వుండేవి.


శ్లోకం అనగా ఒక ప్రత్యేకమైన ఛందస్సు (అనుష్టుప్) లక్షణాలు కలిగిన ఒకరకమైన సంస్కృత పద్యం. దీనిలో 8 అక్షరాలు కలిగిన నాలుగు పాదాలు లేదా 16 అక్షరాలు కలిగిన రెండు వరుసలు వుంటాయి. ప్రతి పాదంలో 5, 6 మరియు 7వ అక్షరాలకు లఘు/దీర్ఘ అక్షర నియమాలు వుంటాయి.


ఋగ్వేదంలో, రామాయణంలో, భగవద్గీతలో చాలా పద్యాలు ఈ శ్లోక ఛందస్సులోనే వున్నాయి.


కానీ ఈ కాలంలో ఏ ఛందస్సులోనున్న పద్యాన్నైనా సరే సామాన్య పరిభాషలో శ్లోకం అని వ్యవహరిస్తున్నారు.


శ్లోకాన్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనే నియమేమీ లేదు. అన్ని రకాల విషయాలకూ వాడుతున్నారు.


మంత్రాలు, శ్లోకాలు, (శ్లోకాలు కాని) పద్యాలకూ ఉన్న సంబంధం ఈ క్రింది విధంగా చూపవచ్చు.



సంస్కృతంలో ‘కాదంబరి’ అనే ప్రముఖ గద్య కావ్యం వుంది. చాలా పెద్ద కావ్యం. దాని పరిమాణాన్ని చెప్పడానికి కూడా అందులో పద్యాలు లేకపోయినా సరే xxxx శ్లోకాలు వున్నాయి అని చెబుతారు. (ఒక శ్లోకంలో మొత్తం 32 అక్షరాలు వుంటాయి కాబట్టి, ఆ గద్య కావ్యంలోని మొత్తం అక్షరాల సంఖ్యను 32 తో భాగించగా వచ్చిన సంఖ్య xxxx).

కామెంట్‌లు లేవు: